రాశిలింగము - మేషరాశి
పార్వతీ సమేత గంగాధరస్వామి - విలాసగంగవరం
మేష, వృషభ రాశులకు (18 పాదశివాలయాలకు) ఈ క్షేత్ర స్థిత గంగాధరమూర్తి
ఆధిపత్యం వుంటుంది. ఆయా రాశులయందు ఆయా నక్షత్ర పాదములయందు
జన్మించినవారు వారి నక్షత్ర పాదములకు సంబంధించిన శివాలయ దర్శనము చేసిన పిమ్మట
విధిగా ఈ ఆలయ దర్శనము కూడా చేయవలెను. తద్వారా శుభఫలములు
చేకూరును.
ఈ క్షేత్రమునకు సంబంధించి
విశేష కథనం కలదు. ఈ ఆలయ
స్థిత గంగాధర స్వామివారి నామము ద్వారా ఈ కుగ్రామమునకు విలాసగంగవరమను నామము
కలిగినట్లు కథనం. అనేక సంవత్సరముల క్రితం నుండి విలసిల్లిన ఈ
శివలింగము ఒక వృక్షము క్రింద యే ఆచ్చాదన లేకుండా ఉండెడిదట. నేడు
శివశ్రీగా పేరుపొందిన వీరశైవ మతావిలంబియైన తాళ్ళ సాంబశివరావుగారు బాల్యంలో
అనుదినము స్నానానంతరము ఒక చెంబుడునీళ్ళను లింగముపై పోసెడివారట. ఆ క్షేత్రము యొక్క ప్రాధాన్యత తెలియకున్నను ఈ రీతిన నిత్యకృత్యముగా
స్వామిని అభిషేకించుట వలన ఆ బాలునికి శివునిపై ప్రీతి అధికమై ఉత్తరోత్తరా ఆయనలో
పరమశివునిపట్ల అచంచల భక్తితత్పరత కలిగి ప్రస్తుతం ప్రచారంలో వున్న "రాశిలింగము, నక్షత్ర శివాలయముల'' పరిశోధన మరియు ప్రాధాన్యతలను వాటి ప్రామాణికత అతి ప్రాచీనమైన "భీమసభ'' శిలాశాసన రూపమునకు అన్వయించి, విషయంలో బీజము పడినట్లు తెలియుచున్నది.
సుమారు 28 సంవత్సరముల క్రితం శివశ్రీ గంపల
సోమేశ్వరరావుగారు, దవులూరి వెంకటరమణ మరియు వారి కుటుంబసభ్యుల
సహకారంతో ఆలయనిర్మాణము మరియు పూజ్యం నాగేశ్వరరావుగారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా
లింగప్రతిష్ట జరిగినవి. ఈ ఆలయంలో 27 అంగుళముల
పానపట్టము ఉండుట విశేషము. అలాగే అమ్మవారి విగ్రహము క్రింద
శివశ్రీ తాళ్ళ సాంబశివరావుగారి ఇంట పూజలందుకొన్న శ్రీచక్ర ప్రతిష్ఠాపన జరగడం
విశేషము. ఈ ఆలయ సమీపములో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన
బిల్వ వృక్షము మరియు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కదంబ వృక్షము వున్నవి.
అతి త్వరలో ఆలయ శిఖర ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయు సంకల్పము
కలదు. ఈ ఆలయమునందు ప్రతివారు స్వయంగా స్వామిని అర్చించుకునే
అవకాశం కలదు.
ఈ ఆలయానికి ప్రత్యేకించి
అర్చకులు లేరు. శివశ్రీ వెన్నావెంకటరత్నంగారు వారి కుటుంబ సభ్యులు
అర్చకత్వం నిర్వహిస్తున్నారు.