రాశి లింగం - మిధునరాశి
శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి - హసన్ బాద
ఈ క్షేత్రము భీమసభ యందలి ప్రథమ వృత్తంలో వుండడం విశేషం. అంతేకాక ఈ క్షేత్ర స్థిత శివమూర్తి కూడా శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి కావడం మరో విశేషం. మిధునరాశియందు జన్మించిన వ్యక్తులు వారి నక్షత్ర శివాలయంతో పాటు ఈ రాశి లింగమును మరియు భీమసభ అధిపతి అయిన ద్రాక్రారామ క్షేత్ర స్థిత భీమేశ్వరమూర్తిని దర్శించుకొని వారికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించడం కద్దు.
ఈ ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణంలో వున్నది. నిర్మించబడుచున్న ఆలయము మిక్కిలి విశాలముగను బృహదాలయముగాను రూపుదిద్దుకొనుచున్నవి. తాత్కాలికముగా రహదారికి రెండవవైపు ఒక బాలాలయంలో స్వామివారి మరియు అమ్మవారి మూర్తులను ఇతర దేవతా మూర్తులను వుంచడం జరిగింది. ఇచటి పుష్కరిణి అందలి స్నానఘట్టమును చూసిన యెడల ఆలయ పురాతనత్వమునకు సంబంధించి ఒక అంచనాకు రావచ్చును. ఈ స్నానఘట్టపు మెట్లు ద్రాక్షారామంలోని ఆలయమునకు వినియోగించిన శిలలను పోలియుండుట మనం గమనించవచ్చు. పూర్వపు ఆలయము సుమారు ఐదు, ఆరు శతాబ్దాల క్రితమే నిర్మితమైనట్లు ఆధారములు కనబడుచున్నవి. ప్రస్తుత ఆలయ నిర్మాణము గ్రామస్థుల సహకారము మరియు దేవాదాయశాఖవారి సంయుక్త కృషివల్ల సంపన్నమగుచున్నది. ఉపాలయములుగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల ఆలయము కలవు. ఈ గ్రామంలో ఈ ఆలయము కాక మరియొక శివాలయము కూడా కలదు.
స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఇచట వైభవోపేతంగా నిర్వహంచబడతాయి.