బతుకమ్మ
సెప్టెంబర్ 30వ తేదీ
దసరా ఉత్సవాలకున్నంత ప్రాధాన్యం తెలంగాణా ప్రాంతంలో ఈ బతుకమ్మ ఉత్సవాలకుంది. ప్రకృతితో మమేకమై ఆటపాటలతో, ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలనేదే ఈ పర్వపు ప్రధాన ఉద్దేశం. ఈ బతుకమ్మ పండగ ఎంగిలిపువ్వుల బతుకమ్మతో ఆరంభమై, విజయదశమికి ఒక రోజు ముందు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
ఆశ్వయుజ మాస పాడ్యమి రోజున బతుకమ్మను నిలుపుకొని ఆరొజూ సంధ్యాసమయంలో ఆటపాటలతో బతుకమ్మకు నీరాజనమర్పిస్తారు. ప్రకృతి సిద్ధమైన గునుగు పూలు, సొంపు పూలు, తోక చామంతి, గులమాల పూలు, తంగేడు పూలు, ఎర్ర గన్నేరు, పచ్చ గన్నేరు , బంతి పూలను ఎంతో కళాత్మకంగా ఉంటుంది. రంగు రంగుల పూలను నేర్పుగా ఆకర్షణీయంగా తిరచిదిద్దుతారు. ఆ పూల పేరుపుపై పసుపు ముద్ద రూపంలో గౌరీదేవిని ఉంచి, మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు అంటే మహర్నవమి నాడు సమీపంలోని చెరువుల్లొనూ, కోనేరుల్లోనూ, తమ పెరటిబావుల్లోనూ వదిలిపెడతారు. అనంతరం జొన్న పిండి, బెల్లం, పల్లీలు, పెసరుపప్పు, నెయ్యితో చేసిన మలీద, సత్తుపిండి వంటివి ప్రసాదంగా స్వీకరిస్తారు. బతుకమ్మ పండుగ చివరి రోజున సద్దుల బతుకమ్మ అడుతారు.
"బతుకమ్మ వెనుక కధ ":
ఈ పండుగ వెనుక రెండు కధలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకదాని ప్రకారం చోళరాజు ధర్మాంగదునికి కలిగిన వందమంది కుమారులు వివిధ యుద్ధాలలో వీరమరణం పొందుతారు. ఆపైన చాలాకాలం తర్వాత ఆయనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆడపిల్ల పుట్టింది. లక్ష్మీ అనే ఆ పాప జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నది. అప్పుడు అందరూ ఆమెను బతుకమ్మ అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి బతుకమ్మ అని వ్యవహారంలోకి వచ్చింది.
రెండో కధ ఆధునిక కాలానికి చెందినది. తెలంగాణా ప్రాంతంలో ఒకనాడు భూస్వాములు అకృత్యాలు నిత్యవ్యవహారంగా ఉండేవి. ఆకాలంలో ఒక బాలిక భూస్వాములు అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ బాలిక పునర్జీవితురాలు కావాలని ఆమెను "బతుకమ్మా" అని దీవించారట . అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది.
ఆట.. పాట అంతా సంబరమే :
బతుకమ్మ పండుగ కోసం ఎదురుచూస్తున్న ఆడపడుచులు పండగకు వారం ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ సన్నాహాలు చేసుకుంటారు. ప్రధాన పండుగకు వారం రోజుల ముందు నుంచే ఆడపడుచులు చిన్న చిన్న బతుకమ్మలు తయారుచేసి రోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు ఆ పై చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ చివరిరోజు జరిగే వేడుకలను, ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. పురుషులు తంగెడు పువ్వు, బంతి పువ్వు, గునుగుపువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, ఛెత్రి పువ్వు, గులాబి, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరింకపూలు కోసుకొని వస్తారు. వాటినతో బతుకమ్మలను తయారు చేస్తారు.
పూలను పేరుస్తూ :
బతుకమ్మను పేర్చడం అంత సులభం కాదు. సున్నితమైన తంగేడుపూలను ఒద్దికగా పేర్చతారు. బతుకమ్మను చేయడానికి ఎంతో ఓపిక, నైపుణ్యం కావాలి. ఏ మాత్రం తేడా వచినా అమరిక మొత్తం క్షణాల్లో చెదిరిపోతుంది. బతుకమ్మను ఎత్తుగా పేర్చడానికి గునుగు పువ్వులను మొదలు కత్తిరించి రకరకాల రంగులల్లో ముంచి, చిన్నచిన్న కట్టలుగా కడతారు. పూలను బట్టి పళ్లాన్ని ఎంచుకుని, అందులో వృత్తాకారంగా అంచు నుండి గోడకట్టినట్లుగా పువ్వుల కట్టలు పేర్చుతారు . ఆ పూల అమరిక నిలబడి ఉండడానికిగాను, వృత్తకేంద్రంలో గుమ్మడి, ఆముదం, కాకర, బీర ఆకులు మొదలైనవాటిని విరిచి ముక్కలు చేసి నింపుకుంటారు . ఇలా అంగుళం అంగుళం మేర పైకి పూలను సర్దుకుంటారు. ప్రతి వరుసకు పూలను మారుస్తారు. పైకి పోతున్నకొద్ది వెడల్పు తగ్గిస్తారు.
తంత్రశాస్త్రంలో త్రికోణం దేవికి ప్రతీక అని చెబుతారు. ఇదే క్రమంలో బతుకమ్మ ఆకారం కూడా పొడవైన త్రిభుజాకారంలోనే ఏర్పాటు చేస్తారు. అతి త్వరగా
పూలతో, కాయలతో విస్తరించే గుమ్మడికాయ, గుమ్మడి పూలు సఫలతాశక్తికి ప్రతీకలుగా పేర్కొంటారు . బతుకమ్మను పేర్చి మొదట గుమ్మం ఎదురుగా గోడ దగ్గర
పీటవేసి ఉంచుతారు, అగరోత్తులు వెలిగిస్తారు. ఎదురుగ పళ్ళెంలో గౌరమ్మను ఉంచుతారు. ఆ పసుపు గౌరమ్మే బతుకమ్మ.
ఉయ్యాల పాటలతో ఉత్సాహం :
తొమిది రోజులు బతుకమ్మను చేసి, ఫలహారాలతో ఇంటి ముందు పెట్టుకొని ఉయ్యాల పాటతో ఆడతారు. గ్రామపు బొడ్రాయి దగ్గరో, కూడలిలోనో బతుకమ్మలను ఉంచి, స్త్రిలందరూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ ఉయ్యాల పాట పాడుకుంటూ ఆడతారు. బొడ్రాయి దగ్గర చాలా సేపు ఆడిన తర్వాత ఎవరి బతుకమ్మను వాళ్లు రెండు చేతులతో ఎత్తుకొని చెరువు దగ్గరికెళతారు. చెరవు దగ్గర బతుకమ్మలను దించి. ఆడి ఆ తర్వాత నీళ్ళలో విడవడం ఆనవాయితీ.
సంస్కృతి మేళవింపు :
బతుకమ్మ వేడుకల చివరి రోజు సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ వలయాకారంలో చేరతారు. ఐక్యత, ప్రేమతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు గొంతు కలుపుతారు. చీకటి పడే వేళకి ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని చెరువువైపు ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో, కన్నుల పండుగగా వుంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు, పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తర్వాత చెక్కర, రొట్టెతో చేసిన "మలీద" అనే వంటకాన్ని పంచిపెట్టి తింటారు.
జలసమర్పణం :
బతుకమ్మను విడవడంలో కూడా ఒక పద్ధతి వుంటుంది. మోకాళ్ల వరకు నీళ్లలో దిగి. నీటిమీద బతుకమ్మ పళ్లెం ఉంచి, నేర్పుగా బతుకమ్మ నీటిలో తేలివెళ్లేట్లుగా పళ్లాని మెల్లగా తీసివేస్తారు. వస్తూ వస్తూ పళ్లెంలో కొన్ని నీళ్ళు తెచ్చి అందరి మీదా చల్లుతారు. నీళ్ళు చల్లాక తెచ్చుకున్న ప్రసాదం పంచుకుంటారు. ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అనుకుంటూ … ఒకచోట కూర్చొని ప్రసాదం తెసుకుంటారు. అన్ని పండుగలకు పెట్టే ప్రసాదాలు వేరే. బతుకమ్మకు సమర్పిం చేవి వేరు. తొమ్మిది రోజులు జరిపే వేడుకల్లో రోజుకో ప్రసాదం సమర్పిస్తారు.
రోజు |
రూపం |
ప్రసాదం |
మొదటి రోజు |
ఎంగిలిపువ్వు |
నువ్వులు, నూకలు , బెల్లం |
రెండో రోజు |
అటుకుల బతుకమ్మ |
చప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం |
మూడోరోజు |
ముద్దపప్పు బతుకమ్మ |
ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి సమర్పిస్తారు |
నాలుగవరోజు | నానే బియ్యం బతుకమ్మ |
నానపెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి సమర్పిస్తారు |
ఐదవరోజు | అట్ల బతుకమ్మ | అట్లు లేదా దోష నైవేద్యంగా సమర్పిస్తారు. |
అరవరోజు | అలిగిన బతుకమ్మ |
ఈ రోజు ఆశ్వయుజ పంచమి కాబట్టి నైవేద్యం ఏమీ సమర్పించరు |
ఏడవరోజు | వేపకాయల బతుకమ్మ |
బియ్యపిండిని బాగా వేయించి వేపపళ్ళుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. |
ఎనిమిదవ | వెన్నముద్దల బతుకమ్మ |
నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారుచేసి సమర్పిస్తారు |
తొమ్మిదవరోజు | సద్దుల బతుకమ్మ |
ఆశ్వయుజ అష్టమి రోజు, అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. కాబట్టి ఐదు రకాల నైవేద్యాలు అంటే పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారుచేసి సమర్పిస్తారు. |
ఈ తొమ్మిది రోజులపాటు రోజూ సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, జీడిపప్పు, బెల్లం, పాలను ఉపయోగిస్తారు.
Note: HTML is not translated!