Click Here To View English Version
అట్లతద్దె వ్రతం
తెలుగువారి పండుగలలో అట్లతద్దె లేదా అట్ల తదియ పండుగ అతిముఖ్యమైన పండుగ. ఆశ్వీయుజ బహుళ తదియనాడు తెలుగువారు అట్లతద్దె పండుగగా జరుపుకుంటారు. కన్నెపిల్లలు, అట్లతద్దె వ్రతం గౌరీదేవి అనుగ్రహంతో తమకు సలక్షణమైన భర్త లభించాలని, కొత్తగా పెళ్ళైనవారు తమకు సద్భుద్ది కలిగిన సంతానం కోసం, వివాహితలు తమ సంసారజీవితం సుఖసంతోషాలతో వర్థిల్లాలని చేస్తారు. గౌరీదేవి కూడా త్రిలోకసంచారి ఆయన నారదుని ఉపదేశంతో అట్లతద్దె వ్రతం చేసి పరమశివుడిని భర్తగా పొందగలిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
అట్లతద్దె రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి, చేతులకు గోరింటాకు, కాళ్ళకు పారాణితో అలంకరించుకుని, ఆటపాటలతో సాయంత్రంవరకు ఉపవాసం ఉండి, ఊయలలు ఊగుతూ అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ... ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుతూ ఊయలలు ఊగుతూ కాలం గడుపుతారు. గౌరీదేవికి ఆటపాటలు అంటే మహా ప్రీతి. చంద్రుడు ఉదయించిన తరువాత మళ్ళీ శుచిగా అభ్యంగనస్నానం చేసి గౌరీ పూజ చేస్తారు. అమ్మవారికి మినుముల పిండి, బియ్యపు పిండితొ చేసిన అట్లు నివేదించి, ఒక ముత్తైదువను గౌరీదేవి ప్రతిరూపంగా భావించి ఆమెను గౌరీదేవిగా అలంకరించి అట్లు, తాంబూలం వాయనంగా ఇస్తారు. అలాగే పదిమంది ముత్తైదువులకు నల్లపూసల గొలుసు, లక్కజోళ్ళు, రవికెల గుడ్డ, తాంబూలం, అట్లు, దక్షిణ వాయనం ఇస్తారు. గోవుకి పూజచేసి, దగ్గరలోని చెరువులలో, కాలువలలో దీపాలను విడిచిపెడతారు. చెట్లకు ఊయలలు కట్టి ఊయల ఊగుతారు. ఈ వ్రతంలో ప్రధానమైన పూజ చంద్ర ఆరాధన. చంద్రకళలలో కొలువై ఉన్న పరాశక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని పెద్దల విశ్వాసం. అట్లతద్దె అట్లలో విశిష్టత ఏమిటంటే నవగ్రహాలలో కుజుడికి అట్లు అంటే మహాప్రీతి. అట్లు కుజుడికి నైవేద్యంగా నివేదించినట్లయితే కుజదోషం పరిహారమై సంసారంలో ఎటువంటి అడ్డంకులు రావు అని, రజోదయానికి కారకుడైన కుజుడు ఋతుచక్ర సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవగ్రహాలలో మినుములు రాహువుకి, బియ్యం చంద్రుడికి అత్యంత ప్రీతికరం.
అట్లతద్దె వ్రత కథ:
ఒక మహారాజుకి కావేరి అనే లావణ్యవతి అయిన కుమార్తె ఉండేది. ఆ రాచబిడ్డ అట్లతద్దె రోజున అట్లతద్దె వ్రతం చేయడానికి తన స్నేహితురాళ్ళతో కలిసి ఉదయం అంతా ఉపవాసం ఉంది. సుకుమారి అయిన రాచబిడ్డ ఉపవాసం ఉండడంతో శోషవచ్చి పడిపోయింది. రాచబిడ్డ అన్నలు చెల్లెలి పరిస్థితి తల్లిద్వారా తెలుసుకుని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దం కట్టి దాని ఎదుట అరికె కుప్పకు నిప్పు పెట్టి చెల్లెలిని లేపి అద్దంలో చంద్రుడిగా భ్రమింపజేసి, చెల్లెలికి చూపించారు. అది చూసిన రాచబిడ్డ చంద్ర దర్శనం అయింది అని తలచి ఉపవాస దీక్షను చాలించి భోజనం చేసింది. అట్లతద్దె వ్రతంలో పాల్గొన్న రాచబిడ్డ స్నేహితురాళ్లకు సలక్షణమైన భర్తలు లభించడంతో వివాహం జరిగిపోయాయి. కానీ కావేరికి ముసలి వరుల సంబంధాలు తప్ప వేరే సంబంధాలు రాలేదు. అన్నలు ఎంత ప్రయత్నించినా ముసలి వరుల సంబంధాలు తప్ప యవ్వనంలో ఉండే వారి సంబంధాలు రాలేదు. పెండ్లి సంబంధాలు విఫలం కావడంతో విరక్తి చెందిన రాచబిడ్డ సమీప అడవులకు వెళ్ళి ఘోర తపస్సు చేయడం ప్రారంభించింది. రాచబిడ్డ తపస్సుకు మెచ్చిన పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని పలికారు. కావేరి పార్వతీపరమేశ్వరులకు భక్తితో నమస్కరించి నేను అట్లతద్దె వ్రతం చేసినా ఫలితం దక్కలేదు. వ్రతంలో దోషాలు ఏమైనా ఉన్నాయా? నేను చేసిన పాపం ఏమిటి అని ప్రశ్నించింది.
పార్వతీపరమేశ్వరులు చిరునవ్వుతో 'అమ్మా నీవు అట్లతద్దె నోము నోచుకుని చంద్రదర్శనం కాకుండానే భోజనం చేశావు. ఇందులో నీ దోషం ఏమీ లేదు. నువ్వు ఉపవాస దీక్షకు తట్టుకోలేక స్పృహతప్పి పడిపోవడంతో నీ సోదరులు చంద్రోదయం కాకుండానే అరికె కుప్పకు నిప్పు పెట్టి అద్దంలో నీకు చంద్రదర్శనం చూపించారు. దీంతో నీవు చంద్రోదయం కాకపూర్వమే భోజనం చేశావు. అందుకే నీకు ముసలివాళ్ళ సంబంధాలు వస్తున్నాయి. కాబట్టి ఆశ్వీయుజ బహుళ తదియ రోజున నోము నోచుకుని చంద్రోదయం అయ్యేవరకు ఉపవాసం చేసి, చంద్రదర్శనం తరువాత ఉపవాస దీక్షను విరమించి భోజనం చేసినట్లయితే నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుందని చెప్పి అంతర్థానం అయ్యారు. రాచబిడ్డ భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించి సలక్షణమైన, శౌర్యపరాక్రమాలు కలిగిన యవ్వనవంతునితో వివాహం జరిగింది.
Click Here To View English Version
Note: HTML is not translated!