శ్రీ రామనవమి విశిష్టత?
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి.
హిందువులు తమ ఇళ్ళలో సీతారాముల విగ్రహాలకు వివాహం చేసి సాయంత్రం ఊరేగిస్తారు. దేశంలోని ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీథులలో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి లేదా ఆంధ్రప్రదేశ్ లో వసంతోత్సవం తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలలో వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది.
శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల పాత్రధారులు, రథంతో పాటు పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు.
కైలాసంలో ఒక రోజు పార్వతీదేవి పరమశివుడిని ఈ విధంగా ప్రశ్నించింది 'స్వామీ! 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి ఈశ్వరుడు 'ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!' అని చెప్పి ఈ శ్లోకంతో మంత్రోపదేశం చేశాడు .
శ్లో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే !!
ఈ శ్లోకం మూడుసార్లు స్మరించినంత మాత్రానే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. 'రామ' అంటే రమిచడం అని అర్థం కాబట్టి మనం ఎప్పుడూ మన హృదయాలలో శ్రీరాముని స్మరిస్తూ ఉండాలి. ఎవరయితే భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
'రా' అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మనలోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. 'మ' అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మానవుల శరీరాలలోకి ప్రవేశించలేవు. ముఖ్యంగా శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు.
ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్ ఋతువు, వసంత ఋతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయి అని ఆయుర్వేదం నిర్థారిస్తుంది. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.
అలాగే పెసరపప్ప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో 'వడదెబ్బ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.
సీతారాముల కల్యాణం అనగానే ప్రతి హిందువుకి గుర్తుకు వచ్చేది భద్రాచలంలోని సీతారాముల కల్యాణం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. సతీసమేతంగా సీతారాములకు రాష్ట్రప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. భద్రాచలంలో జరిగినట్లుగా దేశవ్యాప్తంగా మరెక్కడా సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరగదు అనడంలో అతిశయోక్తి కాదు.
వ్రత కథారంభం :
శివభక్తుడైన అగస్త్యమహర్షి సుతేష్ణ మహర్షితో ఇలా చెప్పాడు 'ఓ సుతేష్ణ మునీ! నీకు నేను ఒక రహస్యము చెపుతాను' అని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు.
చైత్రమాసంలో శుక్లపక్షమి రోజున సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారాలతో ఆరాధించి పురాణానాన్ని చదివి, జాగారణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే కాలకృత్యాలు నెరవేర్చుకుని తన శక్తికి తగినట్లుగా భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసంతో అన్నము చేసి పెద్దవారిని, బంధువులను తృప్తి పరిచి, గోవు, భూమి, నువ్వులు, బంగారం, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి కౌసల్య పుత్రుడైన శ్రీరామచంద్రుని ఆనందింప చేయాలి. ఇలా శ్రీరామనవమి వ్రతం భక్తిగా ఆచరించు వారి జన్మాంతరముల పాపాలు అన్నీ నశించిపోతాయి. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభిస్తుంది. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకాలలో భోగాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది.
కాబట్టి మహాపాపి అయినా కూడా శుచిగా ఈ వ్రతం ఆచరించడంతో జన్మజన్మాల పాపాలు అన్నీ జ్ఞానాగ్ని వల్ల నాశనం అవడంతో లోకాభి రాముడిన శ్రీరామునివలే అన్ని లోకాలలోనూ ఉత్తముడై వెలుగొందుతారు. శ్రీరామనవమి వ్రతం రోజున తినే నరుడికి నరకం కలుగుతుంది. అన్నిటికంటే ఉత్తమమైన ఈ వ్రతం చేయకుండా వేరే వ్రతం చేసినా సఫలం కాదు. కాబట్టి ఈ వ్రతం ఒకసారి చేసి, భక్తితో ఆచరించినట్లయితే వారి మహాపాపాలు అన్నీ తొలగి కృతార్థులవుతారు.
అందుకని నవమి రోజున శ్రీరామ ప్రతిమకు పూజను పూజావిధానంగా చేసినట్లయితే ముక్తుడు అవుతాడు.' అగస్త్యమహర్షి మాటలు విన్న సుతేక్షుడు ఇలా ప్రశ్నించాడు. 'ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనంలేని వారైన మానవులకు సులభమైన ఉపాయం చెప్పు' అని అడిగాడు. దానికి అగస్త్యుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు.
'ఓ సుతేక్షణా ! దరిద్రుడైన మానవుడు తనకు కలిగినంత మేరకు స్వర్ణ రజతాలతో దేనితోనైనా డబ్బుల లోపం చేయకుండా శ్రీరాముడి ప్రతిమను చేయించి ఈ వ్రతం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క సర్వపాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఎలాగైనా ఈ వ్రతాన్ని చేసి జానకీ కాంతుడిని పూజించాలి.
ఈ వ్రతం భక్తి కొలది చేయనివాడు రౌరవాది నరకంలో పడతాడు.' అని తెలిపాడు. అప్పుడు సుతేక్షుడు మళ్ళీ అగస్త్యుడిని ఈ విధంగా ప్రశ్నించాడు 'సమస్తమైన రామమంత్రాలలోను 'రామ షడక్షరి అనే మంత్రరాజం ఉత్తమమని స్కాందపురాణం, మోక్ష ఖండనంలోని రుద్రగీతలో శ్రీరాముని గురించి రుద్రుడు (పరమశివుడు) తెలుపుతున్నాడు.
'ఓ రామా! మణికర్ణిక ఒడ్డున మరణించే మానవుడి కుడిచెవిలో 'శ్రీరామరామరామ' అనే తారకమంత్రం ఉపదేశించాడు కాబట్టి నీవు 'తారకపరబ్రహ్మము అని పిలువబడుతున్నావు. కాబట్టి పరిశుద్ధమైన, పాపనాశనమైన శ్రీరామనవమీ వ్రతం శ్రద్ధా భక్తిగల మానవులకు చెప్పదగినది. ఇంతే కాకుండా బంగారు, వెండి, రాగి, మొదలైన లోహాలలో దేనితోనైనా శ్రీరామ ప్రతిమ చేయించి అందులో దేవుడిని ఆవాహనం చేసి, ఇంతకుముందు చెప్పిన విధంగా పూజ చేసి, ఆ ప్రతిమ దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్రచిత్తుడై జపం చేస్తూ ఉండి, మరుసటి రోజున తిరిగి పూజ చేసి సంపూర్ణ భోజనం దక్షిణ దానాలతో బ్రాహ్మణులను సంతోషింపచేయడం లోకాభిరాముడు శ్రీరాముడు అనుగ్రహం పొందుతారు.
కాబట్టి మనుషులు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు చేయడం వల్ల సర్వపాపకర్మలు నశించిన వాడు అవుతాడు. రామమంత్రం తెలియనివాడు ఈ వ్రతం రోజున ఉపవాసం ఉండి, శ్రీరామ స్మరణ చేసినట్లయితే అన్ని పాపాలు నశించినవాడు అవుతాడు. మంచి గురువు దగ్గర మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి గంట నిశ్చలమైన మనసు కలవాడై, మోక్షాన్ని కోరుకున్న వాడై పూజించేవాడు సర్వదోషాల నుండి బంధవిముక్తుడై, నాశనం లేని శ్రీరామ తారక బ్రహ్మాన్ని పొందుతాడు' అని అగస్త్య మహర్షి వివరించాడు.
Note: HTML is not translated!