ధనుర్మాసవ్రతం ఎందుకు ఆచరించాలి ?
సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన నాటినుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది ముప్పై రోజుల సంబరం, అలాగే మూలానక్షత్రం ప్రారంభ రోజున వుండడం కూడా ముఖ్య అంశం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ధనుర్మాసం అంటే ధనుస్సు అనే పదానికి, ధర్మం అని అర్థం. అంటే ఈ ధనుర్మాసంలో ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రులం అవుతాము.
ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి. సాక్షాత్తు శ్రీరంగానాయకుని పరిణయం ఆడింది. గోదాదేవిచే రచించబడిన ముప్పై తిరుప్పావై పాశురాలు రచించింది. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అనే అర్థం వస్తుంది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి మాసోత్సవాలలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసంలో స్వామివారికి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాశురాలను నివేదిస్తారు. ధనుర్మాసంలో గోదాదేవి గోపికలను లేపి శ్రీకృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం. ధనుర్మాసం అంటే పల్లెటూర్లలో 'సంక్రాంతి' నెల పట్టడం అని అంటారు. ముంగిళ్ళలో కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి, గొబ్బెమ్మలను పెడతారు. భోగి మరుసటి రోజు సంక్రాంతి. ఈ రోజు సూర్యుడు ధనుస్సురాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుర్మాసంలో పెళ్ళికాని కన్నెపిల్లలు తమకు మంచి భర్త రావాలని కాత్యాయినీ వ్రతాన్ని చేస్తారు.
ఈ ధనుర్మాసం గురించి బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రతం చేయాలని సంకల్పించే వారు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తమ ఆర్ధిక సామర్థ్యం మేరకు బంగారు, వెండి, రాగి, పంచలోహాలు, రాగి తయారుచేసుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకుని, 'మాధవుడు' అనే పేరుతొ పూజను నిర్వర్తించాలి. ప్రతిరోజూ బ్రహ్మీముహూర్తంలో నిద్రలేని కాలకృత్యాలు పూర్తిచేసుకుని, తలస్నానం చేసుకుని, నిత్యపూజలు, సంధ్యావందనాలు ముగించుకున్న తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూదనున్ని ఆవుపాలు, కొబ్బరినీరు, పంచామృతాలతో అభిషేకించాలి. తరువాత తులసీదళాలతో, వివిధ పుష్పాలతో స్వామివారిని అష్టోత్తర శతనామాలతో కానీ, సహస్రానామాలతో కానీ పూజించి, చెక్కెర పొంగలిని, బియ్యం, పెసరపప్పు తో చేసిన పులగం నైవేద్యంగా మొదటి పదిహేను రోజులు నివేదించాలి. తరువాతి పదిహేనురోజులు దద్ధ్యోదనం నైవేద్యంగా నివేదించాలి. స్వామివారికి ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవీలి. మాధవుడినిపూజించిన తరువాత బృందావనంలో తులసిని పూజించాలి.
విష్ణుకథలను, విష్ణు పురాణాలను చదువుతూ కానీ, వింటూ కానీ గడపాలి. వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి. ధనుర్మాసం మొత్తం ఈ విధంగా ప్రతిరోజూ చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయలేనివారు 15 రోజులు, 8 రోజులు, 6 రోజులు, 4 రోజులు లేదా కనీసం 1రోజు అయినా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.
Note: HTML is not translated!