సరస్వతీ దేవి చరిత్ర ఎక్కువగా తెలియని విషయాలు ..,
వైదిక ధర్మంలో ఏ ఉపాసన చేసినా, ప్రధానమైన దేవతలు ముగ్గురు - సదాశివుడు,
మహావిష్ణువు, పరాశక్తి. ఆయా దేవతలకు సంబంధించిన
గురు రూపాలు కూడా ఉన్నాయి.
సదాశివ గురు రూపం దక్షిణామూర్తి. మహావిష్ణువు గురు రూపం హయగ్రీవుడు. పరాశక్తి గురు రూపం సరస్వతీ దేవి. సరస్వతీ దేవికి
సంబంధించి కేవలం విద్య ప్రసాదించమని ప్రార్థించడం తప్ప, పురాణ కథలు అవగాహన లేదు. కానీ
రామాయణంలో రావణుడి గత చరిత్ర తెలిపే సందర్భంలో, సరస్వతీ దేవి ప్రస్తావన ఉంది.
రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు.
బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, రావణుడు అమరత్వం అడుగుతాడు కానీ, అది ప్రకృతి
విరుద్ధం అని అంటే, రకరకాల దేవ కిన్నెర కింపురుషాది గణాల వలన చావు రాకుండా అడుగుతాడు
(తనకంటే అల్పజీవులనే భావనతో ఆ పట్టికలో నరులు, వానరులు చేర్చలేదు). బ్రహ్మ అలాగే అని వరమిచ్చాడు. ఇక కుంభకర్ణుడి వంతు.
ఈ తతంగాన్ని గమనిస్తూ ఉన్న దేవతలు, రావణుడి కోరికయే ఇంత ఘోరంగా ఉంటే అతడి తమ్ముడి కోరిక
ఇంకెంత చిక్కు తెచ్చి పెడుతుందో అని, బ్రహ్మ కుంభకర్ణుని వరం కోరుకోమనేలోపు, దేవతలు
అంతా సరస్వతీ దేవి దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు. జ్ఞానం, తెలివి, విద్య లాంటి వాటికి
అధిదేవత కాబట్టి, ఆమె మనందరి బుద్ధులలో ఉంటుంది. ఆమె దయవల్లనే మనం ఆలోచించగలం. కాబట్టి
కుంభకర్ణుని బుద్ధిని కాస్త మందగించేలా చేసిన సరస్వతీ దేవి మహిమతో, కుంభకర్ణుడు నేను
నిద్ర పోవాలి అని అప్రయత్నంగానే అంటాడు. దానికి బ్రహ్మ తథాస్తని పలకడంతో నిద్ర పోవడమే
ధ్యేయంగా కుంభకర్ణుడు జీవితాన్ని గడిపాడు. తిండి, నిద్ర తప్ప ఇంకేమీ ఎరుగని వాడయ్యాడు.
బహుశా ఈ కథ సరస్వతీ దేవి మహిమ గా చెప్పుకోవచ్చు ..