ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు ?

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు ? ....

శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం, రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

మైరావణ వృత్తాంతం: 

రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ, పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు, వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.

హనుమంతుని పయనం: 

రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో, హనుమంతునిదే పైచేయి అవుతుంది.

మైరావణుని సంహారం: 

 మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు, అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను, ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే “పంచ ముఖాంజనేయుడు”.

పంచముఖాల ప్రాశస్త్య: 

అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఆ అయిదు ముఖాలు, తన భక్తులకు అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే, రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

Products related to this article

Hanuman Chalisa Book (Pocket Size Book)

Hanuman Chalisa Book (Pocket Size Book)

Hanuman Chalisa Book ..

₹20.00

Hanuman Copper Locket

Hanuman Copper Locket

Discover the divine protection with our Hanuman Brass Locket. This sacred locket features an intricately crafted brass pendant of Lord Hanuman, symbolizing strength and devotion. Explore the spiritual..

₹501.00