మహిమాన్వితమైన ‘ప్రదక్షిణ’లో అనేక రకాలున్నాయి.
1. ఆత్మప్రదక్షిణ: సాదారణంగా ఇంట్లో ఏదైన వ్రతం లేక పూజ చేసిన తరువాత: మనచుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను
ఆత్మప్రదక్షిణ అని అంటాం. అంటే ప్రదక్షిణాపథం లేనప్పుడు ఒకేచోట నిలబడి చేసే ప్రదక్షిణ
ఇది.
2. పాదప్రదక్షిణ: సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాపథంలో
గానీ, ఆలయం చుట్టుగాని నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది.
3. దండ ప్రదక్షిణ: ప్రదక్షిణాపథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం
చేసి, అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం, మరలా సాష్టాంగనమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ
చేయడాన్ని దండప్రదక్షిణ అనంటారు. ఈ పద్ధతిలో నాలుగుదిక్కులలోగానీ, లేక నాలుగుదిక్కులు,
నాలుగుమూలలు కలిపి ఎనిమిదిచోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు.
4. అంగప్రదక్షిణ: మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకుని,
ఆలయం చుట్టూ దొర్లుతూచేసే ప్రదక్షిణకు అంగప్రదక్షిణ అని పేరు.
5. పైన పేర్కొన్న ప్రదక్షిణా పద్దతులన్నీ కలిపి చేసే ప్రదక్షిణే
మిశ్రమప్రదక్షిణ.
సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతినే అనుసరించాలి. మొక్కుబడులున్నవారు
పైన పేర్కొన్నవాటిలో వేటినైన చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణాపథం ఉన్నప్పుడు,
అందులోగాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలోగాని స్వామివారికి ఎదురుగా నిలబడి, అంటే ధ్వజస్తంభం
వద్దగాని, ప్రదక్షిణామార్గం వద్దగాని నిలబడి, స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి.
ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని అఆలయాలలో ఇలాగే ప్రదక్షిణలు చేయాలి.
అయితే …
దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ
మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎందుకంటే… శివుడు దేవదేవుడు. అంటే… దేవుళ్లకే దేవుడు. కాబట్టి… ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు
చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అదేవిధంగా… పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ… గుడిలోని శివలింగాన్ని అభిషేకించి,
పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు
చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన
ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు.
శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి
వెనుక ఉన్న సోమసూత్రం( శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకూ వెళ్లి వెనుతిరగాలి.
కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడ నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజ స్తంభాన్ని
చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు.శివప్రదక్షిణలో
సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణ
కిందకే వస్తుందంటుంది శాస్త్రం.