వ్రత విధానం :
వివాహ ప్రతిబంధక దోషాలున్నా నివారణ కావడానికి, శీఘ్రంగా అనుకూలమైన భర్తను పొందడానికి కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు. ఈ వ్రతాన్ని ఆచరించేవారికి భక్తివిశ్వాసాలు ముఖ్యం. తారాబల చంద్రబల యుక్తమైన మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని, భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి నమస్కరించి ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష కాలంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా గణపతి పూజ చేసిన తరువాత ఒక కలశాన్ని ఏర్పాటు చేసి అందులో సగం వరకూ పవిత్రోదకం పోసి మామిడిచిగుళ్ళను వుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశంపై పెట్టి, ఎఱ్ఱని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై పెట్టి దానిలో పరమేశ్వరుని నామాంకంతో ఉన్న కాత్యాయనీదేవిని ఆవాహన చేసి భక్తిశ్రద్ధలతో ఇరవై ఒక్క ఉపచారాలతో ఆ దేవిని పూజించాలి. ఎఱ్ఱని పుష్పాలతో, పసుపు కుంకుమలతో పూజించాలి. బంగారంతోగాని, పసుపుకొమ్ముతోగాని వారి వారి శక్తానుసారం మంగళసూత్రాలను కలశానికి అలంకరించాలి. కొద్దిగా ఉప్పువేసి వండిన అప్పాలను ఏడింటిని ఇంకా చెరుకుగెడ కోసి ఏడు చెరుకుముక్కలు కలిపి నైవేద్యం చేయాలి. భక్తిశ్రద్ధలతో వ్రతం పూర్తిచేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారి మీద వుంచి తరువాత ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని రాత్రి భోజనం చేయాలి. ఈ విధంగా ఏడు వరాలు వ్రతం భక్తితో చేయాలి. మధ్యలో ఏ వారం అయినా అడ్డంకి వస్తే ఆపై వారం చేయాలి. ఎనిమిదవ మంగళవారం ఉద్యాపన చేయాలి. ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటు పోసి వారినే గౌరీదేవిగా భావించి, పూజించి ఏడు అప్పాలను, ఏడు చెరుకుముక్కలను శక్తానుసారం చీర, రవికెలగుడ్డ వాయనం ఇచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనం పెట్టాలి. ఈ విధంగా చేసిన కన్యలకు కుజదోష పరిహారం, ఇతర వివాహ ప్రతిబంధక దోషాల నివారణ జరిగి, శ్రీఘ్రంగా వివాహం అవుతుంది. ఇంకా ఆ కన్యలు సుఖసౌభాగ్యాలతో వర్థిల్లుతారు. పూర్వం దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించి నలుడిని వివాహమాడింది. రుక్మిణీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన రోజున శ్రీకృష్ణుడి చెంతకు చేరింది. ఈ వ్రత కథను విన్నవారికి, చదివినవారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి అని సూత మహర్షి శౌనకాది మహామునులను వివరించాడు.
Note: HTML is not translated!