1.సకృదావర్తనము :
ప్రతి దినము ఒక సారి నమకమును, చమకమును పూర్తిగా చెప్పి, అభిషేకార్చనలు చేయడం సకృదావర్తనము అంటారు. దీని వలన గంగా స్నాన ఫలితంతో పాటు ఏ దినము ఏ పాపాలు ఆ దినముననే నశించి పోతాయి.
2.రుద్రైకాదశిని(రౌద్రీ) :
"ఏక పాఠో నమస్తేస్యహ్యనువాక: పరస్యచ" ఒక సారి నమకమును పూర్తిగా చెప్పి, చమకంలోని మొదటి అనువాకమును చెప్పి అభిషేకించుటను ఒక ఆవర్తము అంటారు. ఇలా 11 ఆవర్తములు అభిషేకించినచో ఏకాదశావర్తము అవుతుంది. దీన్నే ఏకాదశ రుద్రం అని కూడా అంటారు. దీని వలన అనేక జన్మల పాపాలు సమసిపోతాయి.
3.లఘు రుద్రము :
"తైరేకాదశభీ రుద్రై:లఘు రుద్ర ప్రకీర్తిత:"
పైన చెప్పిన ఏకాదశ రుద్రములను ఏక దీక్షతో 11 మార్లు జరిపినచో అతి రుద్రము అంటారు. అనగా 11×11=121నమకములు, 11చమకములు పఠింపబడును. ఇట్టి లఘు రుద్రాభిషేకార్చన వలన తేజస్సు, విజయము లభించి, సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది.
4.మహా రుద్రము :
"ఏకాదశభిరేతైస్తు,మహా రుద్ర:ప్రకీర్తిత:"
ఏక దీక్షతో, 11 లఘు రుద్రములు జరిపినచో, ఒక మహా రుద్రము అవుతుంది. అంటే:
121×121=1331 సార్లు నమకం,
11×11=121 సార్లు చమకం ఆవృతమవుతుంది. దీని వలన మహా పాపాలు అంతరించి పోతాయి. దరిద్రుడు కూడా ధన వంతుడవుతాడు.
5.అతి రుద్రం :
"ఏకాదశ మహా రుద్రై రతి రుద్రో బుధై:స్మృత:"
పైన చెప్పిన మహా రుద్రాలను ఏక దీక్షతో పదకొండు(11)సంఖ్యను పూర్తి చేసినచో, అతి రుద్రం అంటారు.
అనగా- 1331×11=14,641సార్లు నమకం, 121×811=1331 సార్లు చమకం పఠింపబడుతుంది. దీని వలన మహా పాప, అతి పాతక, ఉప పాతకములన్నీ నశించి పోతాయి. ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు వీటన్నింటిని మహన్యాస పూర్వకంగా చేయాలి. మహన్యాసం వల్ల కలిగే ఫలితం ఇంతని చెప్పనలవి కాదు.
"ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్" అన్నట్లుగా మహన్యాస పూర్వక రుద్రాభిషేక సహిత అర్చన చేయడం వలన ఆ దయామయుడైన శ్రీ రుద్ర భగవానుడు ప్రసన్నుడై అన్ని విధములుగా ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఇది అతిశయోక్తి కాదు.. స్వభావోక్తి మాత్రమే..!
ఓం నమః శివాయ