ఠంఛనుగా చెప్పిస్తారెవరైనా “కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, పండునో విడిచి పెట్టి రావాలీ” అని.ఆమేరకు మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక కాయను వదిలేసి వస్తుంటాం కూడా. అటుతర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం. పైగా “నేను వంకాయలు తిననండీ, కాశీలో ఎప్పుడో వదిలేశాను", “నేను సీతాఫలాలు తిననండీ…కాశీలో వదిలేశాను” అని చెప్పుకుంటూ అదో గొప్ప విషయంగా ఫీలవుతూంటాం.
నిజానికి మన పెద్దలు వదిలేయాలన్నవి “కాయాపేక్ష, ఫలా పేక్ష"
వదులుకోవడం అంటే తినే కాయలు, ఫలాలు వదిలేయటం కాదు.
కాయాపేక్ష అంటే:-
దేహం పట్ల ప్రేమ.ప్రతి వ్యక్తికి శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని.నా శరీరానికి సుఖం కావాలి, ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి రుచికరమైన భోజనం కావాలి, అనే అపేక్షలను వదిలేసి సాధువులా బతకమని అర్ధం.
ఫలాపేక్ష అంటే :~
ఏదైనా పని చేసినప్పుడు దానిద్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా.. ‘కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి’ అని చెప్పలేదు..
శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానంతో వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... “కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి ‘కాయాపేక్ష, ఫలాపేక్ష’లను గంగలో వదిలేసి ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలీ” అని.ఇక్కడ ‘కాయాపేక్షా, ఫలాపేక్ష’ అన్నారంటే ఈ “కాయము” పై ( “శరీరము” పై ‘అపేక్ష’ని ) , “ఫలాపేక్ష” (‘కర్మ ఫలము’ పై ‘అపేక్ష’ ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.
కాలక్రమేణా అది కాస్తా ‘కాయ’, ‘పండు’ గా మారిపోయింది.అంతే కానీ... కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే...మనకు వచ్చే నిజమైన పుణ్యం ఏమి ఉంటుంది….?
కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడిపండునీ, వంకాయనీ గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.
కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమనీ, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలాపేక్షనీ మాత్రమే వదులుకొని.... ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో గృహోన్ముఖులమవుదాం.
పది రూపాయలదానం చేసి, తద్వారా ఫలితం ఆశించటం, చిన్నక్రతువును చేసి ఏదో ప్రయోజనాన్ని కోరుకోవడం, బంధుమిత్రులకు చిన్న సహాయంచేసి దాని ద్వారా ఏదో ఫలితాన్ని కోరుకోవడం వంటివి మానుకొమ్మనే నిగూఢమైన అర్ధమీ ఆచారంలో దాగియున్న విషయాన్ని మనం గ్రహించాలి.