రుద్రాక్ష ధారణ
భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు
నమ్ముతారు.
సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది.రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించి
రక్షించగలదు.అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రుళ్ళు దానిని తీసి భగవంతుని పాదముల వద్ద పెట్టి మరల పొద్దున్నే వేసుకుంటారు.చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు. భగవంతుని హృదయము చిదంబరం అయితే, ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలయిన రీతిలో మీ శరీరమునందు సాత్వికమయిన భావనలు కలిగేటట్లుగా లోపల కన్నం ఉండి ఇటునుంచి అటు దారం వెళ్ళిపోయేటట్లుగా ఉన్న ఏకైక పవిత్రమయిన గింజ రుద్రాక్ష.
రుద్రాక్ష వేసుకోవడం అంటే 'నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను" అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే 'యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం' మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి. అటువంటి
భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు.