మార్గశిర శుద్ధ మోక్షద ఏకాదశి...!!
బ్రహ్మాండ పురాణంలోని శ్రీ కృష్ణ యుధిష్టరుడు సంవాదము.ఒకానొకప్పుడు యుధిష్ఠిర మహారాజు భగవానుని మార్గశిర ఏకాదశి గురించి, దానికి గల వేరొక నామము మాహాత్మ్యములను మరియు వ్రతఫలితమును గురించి అడుగగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజునకు ఇట్లు చెప్పెను.
ఓయీ! ధర్మజా! ఈ ఏకాదశి సర్వ పాపవినాశిని. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రాతఃకాలమున శ్రీకృష్ణుని తులసి దళములతో పూజించవలెను.పూర్వకాలమునందు "చంపక” నాగరాధిపతియగు "వైఖానసుడు"ను ఒక మహాధార్మిక రాజు ఉండెను. ఆ రాజు ప్రతి నిత్యము భగవత్రీతి కొరకు మరియు ప్రజాశ్రేయస్సుకై బ్రాహ్మణుల ద్వారా యజ్ఞయాగములు చేసెడివాడు.
ఒకనాడు రాజుగారు స్వప్నమున, తన తండ్రి అనేక సంవత్సరముల నుండి నరక బాధలు అనుభవించుచు ఆ యాతన నుండి విముక్తి ఎప్పుడు కలుగునోయని విచారించుటను గాంచెను.
వైఖానసరాజు తనకు కలిగిన దుస్స్వప్నమునకు దుఃఖితుడై రాజ్య వ్యవహారములను, బంధువులను దారా పుత్రులపై స్నేహము మరచి మానసిక దుఃఖంతో కాలక్షేపము చేయుచుండెను.
పితురుని (తండ్రి గారి) నరక బాధ నుండి ఉద్దరించుటకు బ్రాహ్మణ పండిత-ఋషులను రావించి వినయమున ఇట్లు చెప్పసాగెను.
ఓ సాధుసజ్జనులారా! నా తండ్రిగారు నరకమును ఉండుట నేను స్వప్నమున గాంచితిని. ఏమి శుభకర్మము చేసిన వారికి నరకం నుంచి విముక్తి కలుగును.
అప్పుడు బ్రాహ్మణ పండితులు ఇట్లు చెప్పిరి. ఓ రాజా! మీ రాజ్యమున పర్వతముని ఆశ్రమము కలదు. ఆ మునీశ్వరులు వర్తమాన - భూత - భవిష్యత్తు సమస్తమును తెలిసినవారు(త్రికాలజ్ఞులు).
మీరు కర్తవ్యమును వారిని అడిగి తెలుసుకొనుము. అనగా రాజు "వైఖానసుడు" బ్రాహ్మణ పండిత సమేతంగా పర్వతమునికి నమస్కరించెను.
అప్పుడు ముని రాజుగారి మరియు ప్రజల క్షేమమును అడిగెను. అందులకు రాజు "ఓ మహామునీ! మీ యొక్క అనుగ్రహముచే నేను నా ప్రజలు సుఖంగానే ఉంటిమి.
కానీ నా తండ్రి గారు నరకమున అనేక కష్టముల అనుభవించుచున్నట్లు స్వప్నమున గాంచితిని. వారికి ఆ యాతనల నుండి ముక్తిని కలుగునట్లు మార్గమేదైనను చెప్పవలసిందిగా ప్రార్థించెను.
అంతట పర్వతముని కొంత తడవు దివ్యదృష్టితో సర్వము ఎరిగి రాజుతో ఇట్లు పలికెను. ఓ వైఖానసా! నీ తండ్రి మిక్కిలి కామాతురుడై భోగ విలాసుడగుట వలన ఇట్టి అధోగతి సంభవించినది.
ప్రస్తుతము నీవు మార్గశిర శుద్ధ ఏకాదశి వ్రతము ఆచరించి తత్ఫలితమును నీ తండ్రికి ధారపోసిన ఎడల వారికి ఉత్తమగతి ప్రాప్తించును. ఇట్లు "వైఖానసుడు” ముని ఆజ్ఞానుసారం రాజ్యమునకు తిరిగి వచ్చి ఈ ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలమును తన తండ్రికి సమర్పించగా వారు నరక విముక్తులై భగవంతుని సన్నిధానమునకు చేరిరి.
ఓ రాజా! నిష్టాపరులై ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింతురో అట్టివారి సర్వపాపములు మరియు నరకము నుండి విముక్తి పొంది మోక్షమును సాధించగలరు. అని కృష్ణుడు యుధిష్టరుడునికి వివరించెను...స్వస్తీ..
హరినామ స్మరణం...
సమస్తపాప హరణం