తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు... ఈ విల్లిపుత్తూరు లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం... అందుకే ఇక్కడి ఆలయం లోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే... విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు...
విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది.. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది.. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు.. ఆ పేరే క్రమంగా గోదా గా మారింది..
గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది.. కళ్లుమూసినా, తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది... అంతేకాదు..! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది...
ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది.. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవ దేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు.. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి..గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా... ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు..
ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది.. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది.. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది... అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది.. తన స్నేహితురాళ్లను మేలు కొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియ చేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా... అవే ధనుర్మాసం లో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు.. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవి ని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవి ని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు..
కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవి నీ , విల్లిపుత్తూరు లోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకు వెళ్లారు.. పెళ్లికూతురిగా గర్భగుడి లోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది..
ఇదంతా మకర సంక్రాంతి కి ముందు భోగి రోజు జరిగింది.. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.