వైకుంఠ ఏకాదశి , ముక్కోటి దేవతలు ఎవరు

వైకుంఠ ఏకాదశి అను పండుగ పేరు రెండు పదాల కలియిక. వైకుంఠ , ఏకాదశి అను రెండు వేర్వేరు పదాలు. వైకుంఠం అనునది మన పురాణాల లో మహావిష్ణువు యొక్క నివాస స్థలముగా వర్ణించినారు. ఇక ఏకాదశి.  మనకు సంవత్సరానికి 24 ఏకాదశి లు వస్తాయి. పుష్య మాసం శుద్ద ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. మన వాడుక కాలెండర్ ప్రకారం నేడు 2-1-2023 న ముక్కోటి / వైకుంఠ ఏకాదశి.  మన పురాణాలలో ముక్కోటి ఏకాదశినాడు వైకుంఠ ద్వారాలు తెరువ బడుతాయి అని అంటారు. అందుకు వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువును , విష్ణు స్థానాన్ని కూడా సూచిస్తుంది.  చాక్చుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి  అవతరించినదున విష్ణువు “వైకుంటః” (వైకుంఠుడు) అయ్యాడు. జీవులకు నియంత. జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు – అని అర్థాలున్నాయి.   ఇందులో దాగి వున్న పరమార్థం ఏమిటి ?


సూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ద వైకుంఠ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి  లేదా ముక్కోటి ఏకాదశి అనంటారు. ఈ దినమున వైష్ణవాలయాల లో ఉత్తరం వాకిలి తెరుస్తారు. భక్తులు భగవద్దర్శనార్థం కాచుకొని వుంటారు.అప్పుడు మహావిష్ణువు , గరుఢారూఢుడై  ముప్పది మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశినాడే హాలాహలము , అమృతం పుట్టాయి. శివుడు హాలాహలం మ్రింగినది కూడా ఈ రోజే.   శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను చెప్పినది కూడా ఈ రోజే. 


పద్మపురాణం ప్రకారం ముర అనే రాక్షసుడిని అంతమొందించడానికి , బదరికాశ్రమములో హైమావతి  గుహలో మహావిష్ణు  నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుచే ఆ రాక్షసుడిని భస్మీపటలం చేస్తుంది. అందుకు ఆ శక్తిని నారాయణుడు “ఏకాదశి” అని పేరిడి , ఆ రోజు ఉపవాసం ఉన్న వారికి పాపాలు పోతాయని , వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని , వరమిచ్చారు. ఆ దినమున ఆ ముర అను రాక్షసుడు బియ్యం లో దాగి వుంటాడు కాన ఆ రోజు బియ్యం , దాని సంభదిత ఆహారం నిషిద్దం. ఇక్కడ ముర అన్న తామసిక , రాజశిక గుణాలకు , అరిషడ్వర్గాలకు ప్రతీక అని అర్థం. మానవులు పంచ జ్ఞానేంద్రియాలు , పంచ కర్మేంద్రియాలు , కలిపి 10 వీనికి మనస్సు అనేది పదకొండవదిగా కలవగా పాపాలు చేస్తారట. అందుకే పదకొండవ  స్థానంలో ఉన్న అజ్ఞానికి ప్రతినిధి అయిన మురాసురిన్ని , జ్ఞాణ ప్రదాయణి అయిన ఏకాదశి మాత్రమే సహరింప గలదు. అందుకే ఈ వ్రతాన్ని ఆచరించిన వారు జ్ఞాణవంతులు అవుతారని ప్రసిద్ది. 


ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది. ముక్కోటి దేవతలున్నారా ? వారు ఎవరు ? ఎక్కడ ?  కొందరు ముక్కోటి అని , కొందరు  33 కోట్ల అని , వివిధ రకాలుగా చెబుతారు. మనం ఒక్కడ అంకెగా తీసుకొనరాదు. నిజానికి ముప్పది మూడు మంది దేవతలను ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా భావిస్తూ వుంటారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి వుంటుంది.ఇక మరి కొంతమంది ముప్పైమూడు కోట్ల దేవతలను పూజిస్తారని అసలు ఇంత మంది దేవుళ్ళు ఉండరని దేవుడు ఒక్కడే అని మనకే ఏదో గొప్ప విషయం చెప్పేసినట్టు పాశ్చాత్య మతాల వారు ఫోజులు కొడతారు.


ఆ విషయం మనకి కూడ తెలుసు దేవుడు ఒక్కడే.. ఆయన సర్వాంతర్యామి అని. మరి ఈ ముప్పె ముడు కోట్ల మంది ఎవరు ??సంస్కృతం లో ఒక్కో పదానికి చాల అర్థాలు ఉంటాయి. అవి అక్కడ ఉన్న భావం ని వచ్చే అర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప మనకి తెలిసినదే సరైన అర్థమని భావించి పరిగణలోకి తీసుకుంటే అర్థం మారుతుంది. ఆ విషయం తెలియక కోటి అంటే అదేదో సంఖ్య గా బావించి అలా మూర్ఖంగా మాట్లాడతారు అన్యమతస్తులు. కోటి అంటే సమూహం అని రకాలు అని కూడ అర్థం వస్తుంది.అసలు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే అక్కడ ముప్పైమూడు మంది అని అర్థం వస్తుంది.

వారెవరంటే..

అశ్వనీ దేవతలు 2

అష్టవసువులు 8

ద్వాదశాదిత్యులు 12

ఏకాదశ రుద్రులు 11 మొత్తం ముప్పైమూడు మంది.

అశ్వనీ దేవతలు ఇద్దరు కాగా , 

1.ధరుడు 

2. ధృవుడు 

3.సోముడు 

4.అహుడు 

5. అనిలుడు 

6.అగ్ని 

7. ప్రత్యూషుడు 

8.భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.

ఇక 

1. శంభుడు

2. పినాకి 

3. గిరీషుడు 

4. స్థాణువు

5. భర్గుడు

6. శివుడు 

7. సదాశివుడు 

8. హరుడు 

9. శర్వుడు 

10. కపాలి 

11. భవుడు 

ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు. 

1. ఆర్యముడు 

2. మిత్రుడు 

3. వరుణుడు

4. అర్కుడు 

5. భగుడు 

6. ఇంద్రుడు 

7. వివస్వంతుడు

8. పూషుడు 

9. పర్జన్యుడు 

10. త్వష్ట 

11. విష్ణువు 

12. అజుడు 

 ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు.వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు. వీరిలో ఒక్కో దేవతను కోటి మంది దేవతలతో సమానంగా భావించి పూజిస్తూ వుంటారు. ఈ కారణంగానే ముప్పైమూడు కోట్లమంది దేవతలని చెప్పడం జరుగుతోంది.