పెళ్లయిన వెంటనే శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయమంటారు తెలుసుకుందాం ...!!
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ ! పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు .
గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు .కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామీ వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారని విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు ! ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు
సత్యనారాయణ స్వామీ వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే . ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు ,
వ్రతాలు మారె మహర్షీ అందించలేదేమో ! అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావొచ్చు . ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విబేధాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు .
స్త్రీలుకూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు . ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి , సకల సంపదలూ సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని , అదీ అదీ అననేల, సకల సౌభాగ్యాలూ వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చేప్పారు . పైగా సత్యనారాయణుడు అంటే, కేవలం విష్ణు స్వరూపము కాదు ! ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం . అందుకే శ్రీ సత్యనారాయణ స్వామివారిని
" మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు..
ఇక, వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది . కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందుకు ,
ఆ సత్యనారాయణుని ఆసీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . ఇంకా గర్భాదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వశిస్తారు. అందువలనే , నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు...స్వస్తీ..