Maha Shivratri : మహా శివరాత్రి

మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే. 


ఓసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని, ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ, విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి, దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని, ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి. 


జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం.ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాలవారు, అన్ని ఆశ్రమాలవారు, స్త్రీలు, పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు. 


మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల, బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు. 


భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు, శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి. 


చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు, పద్మంలాంటి పుష్పాలతోఅర్చించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్‌, భీముడు, ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది. 


రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు, యవలు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే. 


మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి. 


నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను,శంఖ పుష్పాలకు, మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకుఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి. 


నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు, సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు. ఈ కథా సందర్భం వల్ల యుగయుగాలుగా శివరాత్రి వ్రతం ఆచరణలో ఉందన్న విషయం స్పష్టమవుతుంది.