శ్రీకామకోటి శివలోచన శోషితస్య
శృంగారబీజ విభవ స్వపునః ప్రవాహే
ప్రేమాంభసార్ద్రమచిరాత్ ప్రచురేణ శంకే
కేదారమంబ తవ కేవల దృష్టిపాతమ్
పై శ్లోకంలో మూకశంకరులు అంటున్నారు – “శ్రీకామకోటి పీఠస్వరూపిణి అయిన ఓ కామాక్షీ అమ్మా!! శివలోచన శోషితస్య అంటే పరమశివుని కంటిచేత ఎండిపోయిన (ఆర్పివేయబడిన/నశించిన), శృంగారబీజ విభవస్య – శృంగారబీజములను కలిగించే వైభవము కలిగిన వాడు అనగా మన్మథుడు అనే బీజాన్ని, పునః ప్రవాహే – తిరిగి బ్రతికించుటలో - ప్రేమ అనే జలములచే తడిసిన నీ యొక్క కృపాకటాక్షము (దృష్టిపాతము) పొలముగా నేను భావిస్తున్నాను తల్లీ !!
అంటే శివుడి కంటి మంటకి ఎండిపోయిన మన్మథ బీజాన్ని తిరిగి మొలకెత్తించగలిగే పొలము ఏది – అది అత్యంత ప్రేమ అనే జలములతో బాగా తడిసిన అమ్మవారి దృష్టిపాతము అనే పొలముగా మూకశంకరులు పేర్కొన్నారు.
అమ్మవారి యొక్క చల్లని అపాంగవీక్షణములను గురించి ఈ శ్లోకంలో ‘అపాఙ్గాత్తే’ అని ఇచ్చారు శంకరులు. అపాంగవీక్షణము అంటే కడగంటిచూపు. అమ్మవారి క్రీగంటి చూపు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎదురుగా చూసే చూపుకన్నా క్రీగంట చూసే చూపు మరింత ప్రేమను తెలియజేస్తుంది. క్రీగంటి చూపు అని అనడంలో మరొక ఔచిత్యం కూడా ఉన్నది. అమ్మవారు విశాలాక్షి కదా.. విశాలమైన కన్నులు కలది అంటే ఈ జగత్తులో ఉన్న సకల జీవకోటిని కనిపెట్టుకుని రక్షించే విశాలమైన చూపు ఉన్న అమ్మ అని.
శ్రీమాత్రే నమః