నారదుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించినది ఎవరు?
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి
అసురులను సంహరించటానికై పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించాడు. వానిలో శ్రీసుబ్రహ్మణ్యావతార మొకటి. పరమేశ్వరుని పుత్రునిగా అవతరించి తారకాసురాది అసురులను సంహరించి లోకాన్ని సంరక్షించాడు. శ్రీమద్రామాయణం, మహాభారతం, స్మందాది పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం గురించి విపులంగా వివరించబడింది.
సుబ్రహ్మణ్యస్వామిని, స్కంద, మురుగ, కార్తికేయ మొదలగు నామాలతోకూడ పిలుస్తాం. సుబ్రహ్మణ్యుడు సనత్కుమార రూపంలో నారదునికి బ్రహ్మవిద్యను ఉపదేశించాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామికి పవిత్రమైన స్థలాలు మనదేశంలో చాల ఉన్నాయి. వానిలో ఆరుపడైవీడు అని పిలువబడే ఆరు క్షేత్రాలు శ్రీస్వామివారి మహిమతో వెలుగొండుతున్నాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆ స్థలాలలో పూజించటం శ్రేయస్కరం, శుభకరం.
సుబ్రహ్మణ్యభుజంగం అనే చక్కని స్తోత్రాన్ని ఆదిశంకరులు రచించారు. ఆస్తికులు ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యమూ పరించి, పారాయణ చేసి శ్రేయస్సును పొందగలరు.
నాదృష్టియందు సుబ్రహ్మణ్యస్వామి రూపం, నా చెవుల యందు స్కందుని కీర్తి, నా నోటియందు ఎల్లప్పుడు సుబ్రహ్మణ్యుని చరిత్ర, నా చేతిద్వారా ఆ దేవదేవుని పూజ, నాశరీరమందలి సర్వావయవములందు ఆదేవుని సేవ, అలా నా సర్వభావములు ఆ దేవుని స్వరూపమందు ఏకీభవించినవి అగుగాక.
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.