జ్ఞాని భక్తుల కలయిక
భగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. కనులు చెమ్మగిల్లాయి. ప్రశ్నలడిగిన జ్ఞానేశ్వరుని పాదాలకు మ్రొక్కాడు.
"అయ్యా! మీరు మహాజ్ఞానులు. మహాపండితులు వక్తలు మీకు నేను చెప్పదగినవాడినికాదు. మీకున్న పాండిత్యాన్ని నేను నోచుకోలేదు. నేను జ్ఞానిని కాదు. బహుగ్రంథ పఠితుడిని కాదు. బహుశ్రుతుడ్ని కాదు. మీరీ విధంగా నన్ను అడగడం కల్పవృక్షం ఒక దీనుడిని యాచించినట్లుగా ఉంది. కామధేనువు దరిద్రుని దగ్గరికి వెళ్లి దైన్యాన్ని ప్రకటించినట్లుగా ఉంది. మీరు బహుశః వినోదానికో, నాకు ఉల్లాసం కలిగించడానికో ఇలా అడుగుతున్నారని అనుకుంటున్నాను" అన్నాడు నామదేవుడు.
ఆ మాటలు విని జ్ఞానేశ్వరుడు "అయ్యా! నీవు పరమభక్తుడవు. భగవంతుడికి అత్యంత ప్రియుడవు. రసభరితమైన నీ అనుభవ విశేషాలను వినడానికి నేను కుతూహలపడుతున్నాను. వినోదానికి మాత్రం కాదు. మీ నుంచి తెలుసుకొన్నవిషయాలు నాగ్రంథరచనకు తోడ్పడగలవన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను” అన్నాడు.
అప్పుడు నామదేవుడు "అయ్యా! నాకు భగవన్నామ సంకీర్తనమంటే చాలా ఇష్టం. శ్రీమద్భాగవతమంతా భగవన్నామ సంకీర్తనమే. నేనీ మాటలను పాండురంగనిపై భారం ఉంచి చెప్తున్నాను. పరీక్షిత్తు శ్రవణభక్తి వల్లనే తరించాడు. శ్రవణభక్తిని పొంది మరణం నుంచి తప్పించుకోవాలని పరీక్షిత్తు ఆశించలేదు. భక్తుడు మరణానికి భయపడడు. అయ్యా! వినండి. నామ సంకీర్తనానికి సాటివచ్చే సాధన మరొకటేదీ ఈ ప్రపంచంలో లేదు. నామసంకీర్తనం కాకుండా తక్కిన సాధనాలన్నీ కష్ట ప్రదమైనవే. నామసంకీర్తనం ఒక్కటే కలియుగంలో భగవత్ప్రాప్తికి సులభమైన సాధనం.
భగవద్భజనంవల్ల ఐహికమైన ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. భజనపరుడు ఇతరులు గుణదోషాలను విచారించాడు. అందరిని తన ఆత్మకు సములుగా భావిస్తాడు. అందరిపట్ల నమ్రతతో వ్యవహరించడమే "వందనం" అవుతుంది.
భగవద్భజనపరుని అంతఃకరణం సర్వదా ప్రసన్నంగా ఉంటుంది. అతని హృదయంలో పరమసాత్త్వికత ప్రవేశిస్తుంది. ఈ సమస్తవిశ్వంలో శ్రీకృష్ణ భగవానుని మాత్రమే దర్శిస్తూ ఆయన చరణారవిందాలను హృదయంలో నిక్షేపించుకుని అఖండ స్మరణ చేయడమే ఉత్తమ ధ్యానం అవుతుంది.
జంతువులైన లేళ్ళు సైతం నాదమాధుర్యానికి పరవశించి, మేతమాని మైమరచి వింటాయి. అలాగే భగవన్నామ సంకీర్తనం చేస్తుండగా విన్నవాళ్లు సైతం తన్మయులవుతారు. ప్రేమయుక్తమైన శ్రవణ ఫలం చాలా గొప్పది.
శ్రీకృష్ణభగవానుడిని సర్వభావాలతో ధ్యానం చేస్తూ, సకల జీవులలో ఆయన మూర్తినే చూస్తూ, రజస్తమోగుణాలను నశింపజేసుకొని, సమస్త వాంఛలను తుడిచిపెట్టి కేవలం భగవత్ప్రేమసుధా పానం చేయడమే భగవద్భక్తి అవుతుంది.
ఏకాంతంలో కూర్చుని శ్రీకృష్ణుని ప్రేమతో ధ్యానం చేయడంలో లభించే విశ్రాంతి మరెందులోను లభించదు. విశ్రాంతి కోసం మరేపని చేసినప్పటికి అది ఆశాంతికి కారణం అవుతుంది. కలహాలకు దారి తీస్తుంది.
ఈ విధంగా నామసంకీర్తనం గురించి చెప్పి "అయ్యా! పరమోదారుడు, సర్వజ్ఞుడు. అయిన ఆ పాండురంగడు నాచేత చెప్పించిన మాటలివి" అన్నాడు నామదేవుడు.
వారిద్దరు కలిసి ఒకనాడు తీర్థయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఇద్దరికి దప్పిక అయింది. ఒకచోట ఒక బావిని చూచారు. కాని, అందులో నీళ్ళు లేవు.
జ్ఞానేశ్వరుడు లఘిమాది మహిమలలో సిద్ధుడు. తన మహిమతో నీళ్లులేని నూతిలోనుంచి రెండు చెంబుల నీళ్లు పైకి తెప్పించి, తాను త్రాగి, ఒక చెంబు నీళ్లు నామదేవుడికి తెచ్చి ఇచ్చాడు. కాని, నామదేవుడు ఆ నీళ్లు త్రాగలేదు. "ఏమి స్వామీ! నన్ను మరచిపోయావా? నా స్థితిని విచారించవా? అని పాండురంగని గూర్చి భావమగ్నుడై పలికాడు.
భగవంతుడు భక్తుని అవసరాలను సర్వదా గమనిస్తుంటాడు. వెంటనే ఆ బావి నీళ్లతో నిండిపోయింది. వెలుపలకి తేట నీళ్లు పొర్లి ప్రవహించాయి.
భక్తుని ప్రేమబంధ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూచి జ్ఞానేశ్వరుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. నామదేవుని గాఢంగా కౌగిలించుకొన్నాడు. నామదేవుడు జ్ఞానేశ్వరుని పాదాలకు మ్రొక్కాడు.
భక్తిమహిమ ముందు జ్ఞానం, అణిమాది మహిమలు ఎందుకూ పనికిరానివని జ్ఞానేశ్వరుడు గ్రహించాడు. ఆ విశ్వాసంతోనే భగవద్గీతకు వ్యాఖ్య వ్రాయడం మొదలు పెట్టాడు జ్ఞానేశ్వరుడు.