నేడు 12-04-2024 మత్స్య జయంతి చలల్లోలకల్లోల కల్లోలినీశ స్ఫురన్నక్రచక్రాటివక్త్రాంబులీనః! హతో యేన మీనావతారేణ శ్ఖః స పాయాదపాయాజ్జగద్వాసుదేవః!! ప్రస్తుతం మనమున్నవైవస్వత మన్వంతరానికి మూలమైన వాడు వైవస్వత ‘మనువు’ కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం ‘మానవులు’గా కనీస కర్తవ్యమ్. మత్స్యావతారం గురించి భారతం, భాగవతం, విష్ణుపురాణం, హరివంశం మొదలైన అనేక పురాణాదులలో వివరింపబడడమే కాక ‘మత్స్యపురాణము’ పేరిట ఒక ప్రత్యేక పురాణం 18పురాణాలలో ఒకటిగా వ్యాసభగవానునిచే రచింపబడింది. పరమాత్ముని పురాణ పురుష విగ్రహంగా దర్శించిన సందర్భంలో, మెదడు స్థానము ‘మత్స్య పురాణము’యొక్క స్థానము. దీనిని బట్టి ఆ పురాణము విలువ, మత్స్యావతారము యొక్క ప్రాధాన్యత అవగతమవుతోంది. మత్స్యావతారునిగా నారాయణుని ఉపాసిస్తే పరాపర విద్యల నొసగడమే కాక మోక్షాన్ని కూడా కలుగజేస్తాడు. అంతేకాక ఐశ్వర్యానికి ప్రతీకగా మత్స్యాన్ని శాస్త్రాదులు పేర్కొన్నాయి. నవనిధులలో మత్స్య నిధి చాలా ప్రధానమైనది. కనుక మత్స్యావతార నారాయణుని ఆరాధన, ఇహలోక భోగాలను కూడా ప్రసాదిస్తుంది. చేపలు స్తన్యమునిచ్చి కాక వాటి కంటి చూపులతోనే సంతానాన్ని పోషిస్తాయి. అదేవిధంగా మీనాకారునిగా నారాయణుని కొలిచిన వారిని కంటికి రెప్పలు వేయకుండా భగవానుడు రక్షణ కల్పిస్తాడు. భాగవతాది పురాణాలలో దశావతారాలు, అందులో మొదటిది మత్స్యావతారమని చెప్పబడలేదు కానీ నరసింహ పురాణములో మార్కండేయ మహర్షిచే దశావతార క్రమంలో స్తోత్రం చేయడం వంటివి గోచరిస్తాయి. ఎంతో ఆధ్యాత్మికత, దివ్యత్వం కూడిన ఈ అవతారాలను డార్విన్ సిద్ధాంతం అని, ‘లా ఆఫ్ ఎవెల్యూషన్’తో ముడి పెట్టడం సరికాదు.
చాక్షుష మన్వంతరము ముగిసే సమయంలో, ‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం” అని చెప్పినట్లుగా సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి శ్రీమన్నారాయణుడు ‘మత్స్య(చేప)రూపంలో అవతరించదలచాడు. వివస్వతుడు సూర్యుని శక్తితో ఉదయించిన సత్యవ్రతుడనే రాజు (ఈయనకి శ్రాద్ధ దేవుడు అనే నామాంతరం కూడా ఉంది) నారాయాణుని పరమ భక్తితో కొలుస్తూ ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ, నారాయణుని చూడాలనే కోరికతోనుండే వాడు. ఒకానొకనాడు కృతమాలానదియందు పవిత్ర స్నానమొనర్చి నదీజలాలతో తర్పణము చేయుచుండగా అతని దోయిలిలో ప్రకాశవంతమైన ఒక చేపపిల్ల రాగా, వెంటనే దానిని నదిలో విడిచాడు. నదిలోనున్న పెద్ద ప్రాణుల వలన తనకు ప్రమాదమేర్పడవచ్చునని, రక్షించమని ఆ చిన్ని చేప రాజును వేడుకోగా, దానిని తన కమండలంలో వేసి తీసుకువచ్చాడు. కాసేపటికి అది కమండలమంతా వ్యాపించగా, ఒక తొట్టెలోకి మార్చగా అది కూడా సరిపోనంతగా వ్యాపించింది. చివరకి నారాయణుని యోగశక్తితో సముద్రంలో విడిచిపెట్టి, నారాయణుడనని తెలియజేశాడు. దానితో అమితానందభరితుడైన సత్యవ్రతుడు అనేక విధాల స్తోత్రములు చేయగా, ఆనాటికి ఏడవ రోజున చాక్షుష మన్వంతరం పూర్తయి, ప్రళయం ఏర్పడుతుందని, దాని నుండి రక్షించడానికి భూదేవి నౌకగా మారి వస్తుందని, సప్తర్షులతో పాటుగా దానిలోనెక్కగా తదుపరి కర్తవ్యం తెలియజేస్తానని చెప్పి సముద్రగర్భంలో చొచ్చుకుని పోయాడు.
చెప్పిన విధంగానే ప్రళయ జలధారలతో జగత్తంతా మునిగిపోగా, సత్యవ్రతుడు, సప్తర్షులు దిక్కుతోచని స్థితిలోనున్నప్పుడు, భూదేవి మహానౌకగా మారి, నారాయణునిచే ఒసగబడిన సృష్టికి కావలసిన బీజములను నౌకయందు నిక్షిప్తము చేసి వారి వద్దకు రాగా, వారు దానియందు అధిరోహించి వెళ్ళగా, ప్రళయ జల ప్రవాహముల వలన ఆ నౌక కంపించగా, మహాతేజోవంతమై, బంగరు వర్ణముతో ప్రకాశిస్తూ లక్ష యోగానముల విస్తీర్ణముతో మహామత్స్యముగా నారాయణుడు వారికి దర్శనమిచ్చాడు.
నారాయణుని ఆజ్ఞచే మత్స్యము యొక్క మోమ్ముకు ఆ నౌకను కట్టగా, నారాయణుడు వారిని హిమాలయ శిఖరాలకు తీసుకుని వెళ్ళాడు. సత్యవ్రతునకు, సప్తర్షులకు సాంఖ్యాది యోగాములను, పురాణ సంహితలను తెలియజేశాడు. ప్రళయము ఉపశమించిన పిదప సప్తర్షులను వారి యధాస్థానములోనుంచి, సత్యవ్రతుని మనువుగా చేసి అనుగ్రహించాడు. వివస్వతుని పుత్రుడు కనుక అతని పేరు మీద ‘వైవస్వత’మన్వంతరంగా పేరు వచ్చింది. రెండు మన్వంతరముల నడిమి భాగంలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మదేవుని వద్దనుండి వేదవిజ్ఞానాన్ని, హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించి సముద్రగర్భంలోకి చొచ్చుకుపోయాడు. (మత్స్యపురాణానుసారము, ఆ రాక్షసుని పేరు సోమకాసురుడైనప్పటికీ, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి హయగ్రీవుడనే పేరునే తెలిపాయి). అప్పుడు పై గాథలో వివరించిన నారాయణుని అవతారమైన మహా మత్స్యము సముద్ర గర్భంలో ప్రవేశించి, తన కొమ్ములతో, తోకతో, డెప్పలతో, భయంకర యుద్ధం చేసి, ఆ రాక్షసుని సంహరించి, వేదరాశిని తిరిగి బ్రహ్మదేవునికి అందజేశాడు. ఈ అవతారములో ఎన్నో అవతారాల శక్తి ఇమిడి ఉంది. హిమాలయముల వద్ద శిఖరానికి, మహా సర్పముతో బంధించి, ప్రళయ సముద్రంలో మునిగిపోకుండా ఉంచడంలో కూర్మావతారం, భూమిని నౌకగా చేసి ఉద్ధరించడంలో వరాహావతారం, ‘ఇంతింతై వటుడింతయై’ అని వామనావతారంలో చెప్పినట్లు, చిన్న చేప పిల్లనుండి లక్ష యోజనముల విస్తీర్ణము గల మహా మత్స్యముగా మారాడు. ఈ అవతారంతో సృష్టి-స్థితి-లయలు చేసే భగవానుడు తానేనని నిరూపించాడు.
ప్రళయకారకుడుగా జల ప్రళయాన్ని సృష్టించాడు. సృష్టికి కావలసిన బీజాలను నౌకలో నిక్షిప్తం చేసి సృష్టి కారకుడైనాడు. వైవస్వత మనువు ద్వారా స్థితికి కావలసిన ధర్మాన్ని ఏర్పరచడమే కాక, ధర్మానికి ముఖ్యమైన వేదరాశిని బ్రహ్మదేవునికి ఇచ్చి స్థితి కారకుడైనాడు. మత్స్యావతార అద్భుతాన్ని ఈవిధంగా దర్శించవచ్చును. మహాజవో మహాపుచ్ఛచ్ఛిన్న మీనాదిరాశికః! మహాతలతలో మర్త్యలోకగర్భో మృత్పతిః!! మహాకాశములోని శిశుమార చక్రములో గల మీనాది 12 రాశులను తన తోకతో ఛేదిస్తూ తనయొక్క అధోభాగం పాతాళలోకము వరకు చొచ్చుకొనిపోగా, గర్భభాగము భూలోకమునందు వ్యాపించినది. మహీపంకపృషత్సృష్టో మహా కల్పార్ణవహ్రదః! మిత్ర శుభ్రాంశు వలయనేతో ముఖ మహా నభః!! ఈ మహా మత్స్యము యొక్క వీపుపై భూమండలం మట్టితో కలిసిన ఒక నీటి బిందువు వలె ఉండగా, ప్రళయ సముద్రము ఒక చిన్న నీటి మడుగువలెనున్నది. సూర్యచంద్రులు నేత్రములు కాగా, మహాకాశమే ముఖమండలముగానున్నది. సంసారమనే సముద్రంలో కొట్టుకుపోతున్న జీవులను చేయూతనిచ్చి రక్షించేవాడు, నిద్రాది తమో గుణాలతో జ్ఞానానికి దూరమైన జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే వాడైన మత్స్యావతార నారాయణుని, నేడు సనాతన వైదిక విజ్ఞానాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నించే మానవరూప అసురీ శక్తులనుండి, వేదాలను మరల ఉద్ధరించమని ‘వేదోద్ధార విచారమతి’ అయిన ‘మీనాకార శరీరుడై’న నారాయణుని వేడుకుందాం. యా త్వరా జలసంచారే యా త్వరా వేదరక్షణే! మయ్యార్తే కరుణామూర్తే! సా త్వరా క్వ గతా హరే!! అతివేగముగా జలములో తిరిగేవాడవు, అదేవిధంగా వేదరక్షణకు త్వరపడే వాడవైన కరుణామూర్తీ! నా ఆర్తిని కూడా త్వరగా పోగొట్టకుండా ఎక్కడ దాగున్నావు. త్వరగా కాపాడుము.