మహాలయ పక్షాలు (18-09-2024 To 02-10-2024)
మహాలయ పక్షాల సమయంలో తప్పనిసరిగా పఠించాల్సిన స్తోత్రం
ఈ పితృస్థుతి ని అందరూ రాసుకొని భద్ర పరచుకొండి. ప్రతీ రోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే, జన్యుదేవతలు. బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి.
ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.
బ్రహ్మ ఉవాచ:
౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
ఫలశ్రుతి:
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!
ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.
సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు.
సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.
ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.
ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.
ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము