️
శ్రీ మహాలక్ష్మీ దేవి
“లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగం ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ
వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్థ విభవద్ర్చహ్మేంద్ర గంగాధరాం త్వాం
త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం”
శరన్నవరాత్రి
మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు.కమలాలను రెండు
చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ
రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ
స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శక్తి
అయిన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన
దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా
కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి."యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"
అంతే అన్ని జీవులలోను ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది.
కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అష్టలక్ష్ముల
సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. ఓం ,శ్రీం ,హ్రీం ,క్లీం ,మహాలక్ష్మే
స్వాహా.. అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సర్వం శుభకరం చేకూరుతుంది.
మహాలక్ష్మీ దేవి అవతార అంతరార్థం
త్రిమూర్తుల శక్తిని ఇతిహాసపురాణాలు మూడు విధాలుగా అభివర్ణిస్తున్నాయి.
వాటి ఆధారంగా శ్రీమహావిష్ణువుకు ఉండే శక్తిని మహాలక్ష్మిగాను, శంకరునిలోని శక్తిని
మహాకాళిగా, బ్రహ్మలోని శక్తిని మహాసరస్వతిగా వ్యవహరిస్తున్నాము. శ్రీమహావిష్ణువు రక్షించువాడు,
రుద్రుడు సంహరించువాడు, బ్రహ్మ సృష్టించువాడు. పరమాత్మ ఎలాగైతే ఒక్కడో అలాగే పరమాత్మలో
ఉండే శక్తి కూడా ఒక్కటే. గుణాలను, పనులను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఈ మూడు శక్తులలో
విశిష్టమైనది విష్ణుశక్తే.
ఏకదేశస్థితస్యాగ్నే: జ్యోత్స్నా విస్తారిణీ యథా
పరస్య బ్రహ్మణోశక్తి: తథేదమఖిలం జగత్ ||
ఒక ప్రదేశంలో ఉన్న అగ్ని ప్రకాశం చాలా దూరం వరకు ప్రసరిస్తున్నట్టే
పరమాత్మ శక్తి సకల ప్రపంచంలో వ్యాపించి ఉండునని ఈ శ్లోక భావం. ఇలా పరమాత్మకు ఉండే అనంత
శక్తులలో ఒకటైన అహంతాశక్తియే ‘మహాలక్ష్మి’గా వ్యవహరించబడుతుంది.
*తస్య యా పరమా శక్తి: జ్యోత్స్యే వ హిమ దీధతే:*
సర్వావస్థాగతా దేవీ స్వాత్మభూతానపాయినీ
అహన్తా బ్రహ్మణస్తస్య సాహమస్మి సనాతనీ
అని లక్ష్మీమంత్రములో ఇంద్రునికి, చంద్రునికి వెన్నెల వలె తాను
ఆ శ్రీమన్నారాయణునికి పరమశక్తినని, సకలావస్థలలో విడిచి ఉండని దానినని లక్ష్మీదేవి పేర్కొంది.
తానే అహంతాశక్తినని, సనాతన శక్తినని ఈ శక్తియే నారాయణి అని కూడా తెలిపింది.
నిత్యనిర్దోషనిస్సీమ
కల్యాణగుణశాలినీ
అహం నారాయణీ నామ సాసత్తా వైష్ణవీమాతా
ఈవిధంగా నారాయణుని శక్తియే నారాయణిగాను, వైష్ణవిగాను, మహాలక్ష్మిగాను
వ్యవహరించబడుతుంది. ఈ మహాలక్ష్మి స్వయంగా పరమాత్మకు విశేషణమై, ధర్మమై అనేక గుణములు,
ధర్మములు శక్తి శక్తిమలు కలదని గ్రహించాలి. విష్ణుశక్తిగా చెప్పబడిన అహంతా శక్తియే
ఆదిలక్ష్మి, అందులోనివే ఆ పరాశక్తి, విద్యాశక్తి అని స్పష్టపరచబడింది.
గమనిక: ఈ రోజు పూజ చేసుకునే వారు లేదా పాల్గొనేవారు ఎట్టి పరిస్థితులలో
కూడా స్త్రీల యొక్క మనసు నొప్పించారాదు. అలాగే స్త్రీలు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా
కూడా గట్టిగ అరవడం కాని ఆవేశంగా మాట్లాడటం కాని ఖచ్చితంగా చెయ్యకూడదు.
మహాలక్ష్మ్యష్టకం
ఇంద్ర ఉవాచ –
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||
స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||
ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||
( పదకొండు సార్లు పటించవలెను )
సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం