ప్ర: చండీసప్తశతి ఉగ్రదేవతకు సంబంధించినది కదా! అలాంటి దేవతల్ని ఆరాధించడం సమంజసమేనా?
జ: చండీసప్తశతిలోని దేవి ఉగ్రదేవతకాదు. సర్వశక్తిమయి, సర్వదేవతాత్మిక. కేవలం సాత్త్విక శక్తులైన దేవతలను రక్షిస్తూ, ముల్లోకాలకు క్షేమాన్ని కలిగించే జగన్మాత. శక్తియొక్క తీవ్రత చండి . ఇది దుష్టత్వాన్ని దునుమాడే పరమేశ్వరీ స్వరూపం.
ఇదే చండీసప్తశతికి 'దేవీమహాత్మ్యం' అనేది అసలుపేరు. లక్ష్మి, గౌరి, సరస్వతి అనబడే సౌమ్యదేవతా రూపాలు కూడా ఆ పరాశక్తి మూర్తులే.
సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే,
యాని చాత్యంత ఘోరాణి తైరక్షాస్మాన్ తథా భువమ్|
"అమ్మా! ముల్లోకాలలో ఉన్న నీ సౌమ్య రూపాలు, అత్యంత ఘోరరూపాలు మమల్నీ, ఈ లోకాలను రక్షించాలి" - అని ఆ గ్రంథంలోని ఆకాంక్ష. ముల్లోకాలలో తీవ్రశక్తులు,
ప్రసన్నశక్తులు కూడా ఉంటాయి.
ప్రచండసూర్యుడు, ప్రసన్నభానుడు వరద నీరు, తేట నీరు పెను గాలి, మలయ పవనం అన్నీ భగవద్రూపాలే. ఇందులో దేనిని ఉగ్రం అంటాం? ఇవి ప్రకృతిలో సహజమైన శక్తులు. ఇవన్నీ మనల్ని రక్షించాలనే విశాలభావన, మంచిమనస్సు చండీసప్తశతిలోని ప్రధానాంశాలు.