'కార్తీక పౌర్ణిమ' నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన
రోజు. కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనుకున్న నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?
కార్తీక మాసంలో వచ్చే
ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో
భక్తి శ్రద్ధలతో పూజించి , వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది
మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక
పౌర్ణమి రోజున కానీ శివాలయాలు , విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే
భక్తుల తాకిడి అధికంగా వుంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా
పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతం ప్రాంతాల్లో ఇదే రోజుని దేవ దీపావళి , దేవ
దివాళి అని అంటుంటారు. ముఖ్యంగా ఈరోజున వారణాసిలోని గంగా నది ఒడ్డున వున్న ఘాట్లు అన్నీ
దీపాల అలంకరణతో శోభాయమానంగా వెలిగే దృశ్యం చూపరులని కట్టిపడేస్తుంది.
అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల త్రిపుర పూర్ణిమ , త్రిపురారి
పూర్ణిమ అని పిలుస్తుంటారు. శివుడు త్రిపురాసురుడిని అంతమొందించింది ఈరోజే కావడంతో...
ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ , త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుచుకుంటుంటారు.
కార్తీక పౌర్ణమి రోజునే విష్ణువుని కూడా పూజించడానికి ఓ కారణం వుంది.
మహాప్రళయం బారి నుంచి మనుని రక్షించడానికి ఆ శ్రీ మహా విష్ణువు మత్సావతారం ఎత్తింది
ఈ కార్తిక పౌర్ణమి రోజునే. అందుకే ఇవాళ విష్ణువుని కూడా ఆరాధిస్తుంటారు. ఈ కార్తీక
పౌర్ణమికి ప్రభోదిని ఏకాదశికి కూడా ఓ సంబంధం వుంది. ప్రభోదిని ఏకాదశితో ఆరంభం అయ్యే
చతుర్మాసం పండగలన్నీ మళ్లీ నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక పౌర్ణమితో ముగుస్తాయి.
ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు.
కార్తీక పౌర్ణమి , కార్తీక పూర్ణిమ ఎలా వచ్చింది ?
మహాభారతం ప్రకారం తారకాసురుడిని, శివుడి తనయుడు కార్తికేయుడు అంతమొందిస్తాడు.
అయితే , ఈ ఘటన తర్వాత తారకసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మ దేవుడిని పూజించి , మెప్పించి
, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా
వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద , విల్లుకాని విల్లుతో
, నారికాని నారి సారించి , బాణంకాని బాణం సంధించి , మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక,
ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు
బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు.
వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు.
విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని , వారిని వెంటపెట్టుకుని
శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో
భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా , ఆదిశేషువు అల్లెతాడు
కాని అల్లెతాడుగా , శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో
శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని , అందువల్ల
ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి, ఆ పరమ శివుడిని పూజించి
రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే
, శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం
మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక
పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి, భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.
*దీపారాధన :*
ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన
చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది, అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక
పౌర్ణమి రోజున 360 జతల దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి
ఒక్కో దీపం చొప్పున, అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను
దేవా అని.
*సత్యనారాయణ వ్రతం :*
సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన
రోజు, మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి
ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ
వ్రతం చేయడం కన్నా, కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు
పెద్దలు.
*ఏకాదశి రుద్ర అభిషేకం :*
ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది
ఏకాదశి రుద్ర అభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో, శివుడిని అభిషేకించడమే
ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత.