దీపావళి:
దీపానాం + ఆవలి = దీపావళి ... దీపాల వరుస అని అర్థం. దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
దీపంజ్యోతి పరంబ్రహ్మం దీపంజ్యోతి పరాయణే
దీపేన వరదాదీపం సంధ్యాదీపం నమోస్తుతే
దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి ,సద్గుణ సపత్తికి భావించినందువల్లనే దీపానికి అంతటి ప్రాముఖ్యత.
దీపం త్రిమూర్తుల స్వరూపం. దీపంలోని మూడు రంగులలో ఎరుపు - బ్రహ్మదేవుడికి, నీలం - శ్రీమహావిష్ణువుకి, తెలుపు - పరమేశ్వరునికి ప్రతీకలు అని పురాణాల ద్వారా తెలుస్తున్నది.
దీపావళి రోజున నూనెలో (నువ్వుల నూనె) లక్ష్మీదేవి, నదులు, చెరువులు,బావులు, నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో ప్రవహిస్తుంది. అమావాస్య చీకట్లను పారద్రోలి దీపలక్ష్మి తన కిరణాలతో జగత్తును కాంతివంతం చేస్తుంది. లక్ష్మీదేవిని దీపావళి రోజున పూజించడం మన హిందువులకు సాంప్రదాయంగా వస్తున్నది. లక్ష్మ దేవి నువ్వులనూనెలో ఉంటుంది కాబట్టి దీపావళి రోజున మట్టిప్రమిదలలో రెండు వత్తులు వేసి వెలిగించి ఇంటిని అలంకరిస్తారు.
తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్ !
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే !!
దేవ, దానవులు క్షీరసాగరమధనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది అని అందుకే దీపావళి పండుగను జరుపుకుంటారు అని ఒక నమ్మకం ఉంది. ఈ రోజునే శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను దానంగా పొంది ఒక అడుగు ఆకాశంపై, రెండవ అడుగు భూదేవిపై ఉంచి మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని బలిచక్రవర్తిని ప్రశ్నించగా, బలిచక్రవర్తి తన శిరస్సు చూపించాడని మహావిష్ణువు తన మూడవ అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కేస్తాడు.
రాముడు అరణ్యవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చినది అమావాస్య రోజునే అందుకే ప్రజలు శ్రీరాముడికి స్వాగతం పలకడానికి కాగడాలు వెలిగించి చీకట్లను పారద్రోలి వెలుగును చూపించారట.
శ్రీకృష్ణుడు ఈరోజునే ఇదే తిథినాడు చిన్నతనంలో దేవేంద్రుడి దుష్టచర్యను ఎదిరించి గోవర్ధనగిరిని తన చిటికెన వ్రేలితో ఎత్తి ప్రజలను, గోవులను పొంగిన నదుల బారినుండి రక్షించాడట.
ఈ రోజునే పాండవులు పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని, ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని ముగించుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చారు.
మొఘలు చక్రవర్తి జహంగీరు సిక్కు మతపోషకుడు గురు హరిగోవిందుని మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ చెరసాల నుంచి ఈ రోజునే విముక్తి చేశాడట. సిక్కులు ఈ రోజును 'బందీ ఖోర్ - ఖోల్'గా పండుగ జరుపుకుంటారు.
జైనమత గురువు మహావీరుడు ఇదే రోజున మోక్ష సాధనదశకు చేరుకున్నాడట. ఆ మహనీయుని జ్ఞాపకార్థం జైన మతస్తులు గురుస్మరణ దినోత్సవంగా నివాళులు అర్పిస్తారు.
ఇదే రోజున మార్వాడీలు గత సంవత్సరపు వ్యాపార పుస్తకాలను ప్రక్కన పెట్టి కొత్త ఖాతాపుస్తకాలు మొదలుపెడతారు.
దీపావళి రోజున హిందువులు తమ తమ ఇళ్ళలో ధనలక్ష్మీదేవి పూజచేస్తారు.
పూజా విధానము
లక్ష్మీదేవి పూజతోపాటు ఈ రోజున వైభవలక్ష్మీ వ్రతాన్ని కానీ లక్ష్మీకుబేర వ్రతాన్ని కూడా ఆచరిస్తే ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు.
లక్ష్మీకుబేర వ్రతం:
కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి. దీపావళి రోజున కుబేరుని భక్తిపూర్వకంగా పూజించేవారికి సంపదలతో పాటు ఆయురారోగ్యాలు లభిస్తాయి. పూజకు ముందు శ్రీలక్ష్మీకుబేర చిత్రపటాన్ని ఒక పీటపై పెట్టుకుని పసుపుకుంకుమలతో అలంకరించాలి. పీటముందు అరటి ఆకుపరిచి అందులో నవధాన్యాలు పోసి, పలుచగా సర్దుకోవాలి. నవధాన్యాల మధ్యలో చెంబును పెట్టుకుని అందులో శుభ్రమైన నీళ్ళను పోసి కొద్దిగా పసుపు కలుపుకోవాలి. చెంబులో మామిడాకులు నిలబెట్టి వాటి మధ్యలో పసుపు రాసిన కొబ్బరికాయ పెట్టుకోవాలి. పూజా సామగ్రి దగ్గర పెట్టుకుని పసుపుతో వినాయకుడి ప్రతిమ చేసుకుని, అరటాకు కుడిపక్కన చక్కగా అమర్చుకోవాలి. పసుపుముద్దకు కుంకుమ పెట్టి దీపారాధన చేసి, వినాయకుణ్ణి ప్రార్థించాలి. తరువాత పుష్పాలతో లక్ష్మీదేవిని అర్చిస్తూ లక్ష్మీస్తోత్రాలను చదవాలి.
సరసిజ నిలయే, సరోజహస్తే ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
అని స్తోత్రం చదివిన తరువాత ...
ఓం దనధ సౌభాగ్య లక్ష్మీకుబేర
'వైశ్రవణాయ మమకార్య సిద్ధిం కురుస్వాహా' అనే మంత్రాన్ని పఠించాలి.
తరువాత సాంబ్రాణి వెలిగించి, ధూపం వేసి, ఇంట్లో నాలుగు దిక్కులలో ధూపాన్ని చూపించాలి. నైవేద్యం సమర్పించి కర్పూరహారతి ఇవ్వాలి.
ఇంకొక విధానం ...
లక్ష్మీకుబేర చిత్రాన్ని ఒక పీటపై పెట్టుకుని దాని ముందు
IN TABLE FORMAT ...
27 20 25
22 24 26
23 28 21
ఈ సంఖ్యలను బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. తొమ్మిది నాణేలను తీసుకుని కుబేర ముగ్గుపై ఉన్న సంఖ్యలపై ఉంచాలి. పూజకు ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. దీపారాధన చేసే ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలి. దీని వల్ల కోరుకున్న కోరికలు తీరుతాయి.
కుబేర మంత్రం :
'ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః' ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి.
ఏ ఇంటిముందు సమృద్ధిగా దీపాలు వెలుగుతూ ఉంటాయో శ్రీమహాలక్ష్మీదేవి ఆ ఇంట ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెపుతోంది. దీపావళి రోజున సాయం సంధ్యాకాలంలో లక్ష్మీ స్వరూపమైన తులసికోట ముందు, ముందుగా దీపాలు వెలిగించి, శ్రీమహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలతో, శాస్త్రోక్తంగా పూజ చేసిన తరువాత ...
చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ !
ఆహ్లాద జననీం పుష్టి శివం శివకరీం సతీమ్ !!
అని ధ్యానం చేసి, సర్వలోక ప్రాణకోటికి హృదయ తాపాలను పోగొట్టే సర్వసంపన్న శక్తివంతురాలుగా భావించి, పూజ పూర్తయిన తరువాత గృహాన్ని దీపాలతో అలంకరించాలి. ఇల్లాలి ఇంటి అందెలు ఘల్లుఘల్లు అంటూ ఉంటే శ్రీమహాలక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందట.
దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వెనుక ఒక విశిష్టత ఉంది. అది ఏమిటంటే ...
పూర్వకాలంలో దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతుష్టుడై, మహిమ కలిగిన ఒక హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన దగ్గర ఉన్న ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ హారాన్ని కిందపడేసి కాలితో తొక్కేసింది. అది చూసిన దుర్వాస మహర్షి కోపోద్రిక్తుడై దేవేంద్రుడిని శపిస్తాడు. శాప ఫలితంగా దేవేంద్రుడు దేవలోక అధికారాన్ని కోల్పోయి, సిరిసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితులలో శ్రీమహావిష్ణువుని ప్రార్థించాడు. పరిస్థితిని గమనించిన శ్రీమహావిష్ణువు దేవేంద్రుడిని ఒక జ్యోతిని వెలిగించి దాన్ని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచించాడు. దేవేంద్రుడు, శ్రీహరి తెలిపిన విధంగా చేయడంతో లక్ష్మీదేవి కరుణించి తిరిగి దేవేంద్రుడికి దేవలోక ఆధిపత్యం, సకల సిరిసంపదలను ప్రసాదించిందట.
భారతదేశంలో వివిధ ప్రాంతాలలో దీపావళిని వివిధ రీతులలో జరుపుకుంటారు.
గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలలో దీపావళిని రైతులు 'పశుపూజారి'గా జరుపుకుంటారు.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గోవర్ధనగిరిని నిర్మించి పూజిస్తారు. ఉత్తరప్రదేశ్ లో 'భరత్ మిలాన్' పేరిట జరుపుకుంటారు.
రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కుక్కలకు, కాకులకు ఆహారాన్ని తృప్తిగా పెట్టి పసుపుకుంకుమలతో పూజిస్తారు. రాజస్థాన్ లో 'హిడ్' పూజ నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్నే 'కాకత్సోహార్' అని కూడా ప్రసిద్ధి పొందింది.
మధుర ప్రాంతంలో 'అన్నకూట్' పేరుతొ నిత్వహిస్తారు. పశుపక్షాదులకు ఆహారాన్ని పెట్టి గౌరవిస్తారు.
పశ్చిమబెంగాల్, ఒరిస్సాలలో 'కాళీపూజలు' జరుపుతారు. ఈ పూజను 'జగద్ధాత్రి' అని పిలుస్తారు.
కేరళలో బలిచక్రవర్తిని జయించిన రోజుగా పరిగణించి దీపావళి పండుగ జరుపుకుంటారు.
తమిళనాడులో దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళి కానుకలు తెచ్చుకోవడం సాంప్రదాయంగా భావిస్తారు.
మహారాష్ట్రలో దీపావళి రోజున 'లక్ష్మీపూజ' చేస్తారు.
మనదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దీపావళిని జరుపుకుంటారు.
జపాన్ లో 'తోరనో గోష్టి' అని, మారిషష్, నేపాల్ వాసులు 'నేపాల్ తీహార్' పేరుతొ దీపాలను వెలిగించి దీపావళిని జరుపుకుంటారు.
బర్మాలో 'అంగేజుల పండుగ' పేరుతొ దీపావళి జరుపుకుంటారు. దీన్నే 'తంగాజు' అని కూడా అంటారు.
చైనాలో 'నాయి మహుబా' అన్న పేరుతొ దీపాలను వెలిగించి దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.
థాయ్ ల్యాండ్ వారు దీపాలను వెలిగించడం పవిత్రకార్యంగా భావించి దీపాలను వెలిగించి పండుగను జరుపుకుంటారు.
శ్రీలంకలో జాతీయ దినంగా జరుపుకుంటారు.
ఇజ్రాయిల్ లో స్వాతంత్ర యోధుడు 'మెకాబ్బిన్' స్మృత్యర్థం 'హనుక' అనే దీపోత్సవం జరుపుకుంటారు.
వియత్నాంలో నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. సుమిత్రా, జావా ద్వీపాలలో, జర్మనీలోను ఘనంగా జరుపుకుంటారు.
Note: HTML is not translated!