కార్తీక పురాణము - ఐదవ రోజు పారాయణము
తొమ్మిదవ అధ్యాయము
యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు? యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి'
విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇవ్వసాగారు 'సూర్యచంద్రులు వాయువు ఆకాశ గోసంధ్యలూ దశదిశ కాలాలూ మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలను విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా! శ్రద్ధగా వినండి. వేదమార్గాన్ని విడిచిపెట్టిన స్వేచ్చాపరులూ, సాధుజనంతో బహిష్కరింప బడినవారూ యమదండనకు అర్హులు. బ్రాహ్మణుడినీ, గురువునూ, రాగినీ పాదాలతో తొక్కేవాడు, తల్లిదండ్రులతో గొడవపడేవాడూ, అసత్యవాదీ, జంతువులను హింసించేవాడూ, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించేవాడూ, డాంబికుడూ (గొప్పలు చెప్పుకునేవాడు), దయలేనివాడూ, పరభార్యతో సంగమించేవాడూ, డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడూ, చేసిన దానాన్ని బైటపెట్టుకునేవాడూ, మిత్రద్రోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల మగపిల్లలను చూసి ఏడ్చేవాడినీ, కన్యాశుల్కాలతో జీవించేవాడినీ, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను వదిలిపెట్టినవాడినీ, నిత్యకర్మలు చేయనివాడినీ, ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచేవాడినీ, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడినీ, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడినీ, యాచించిన (అడుక్కుంటున్న) బ్రాహ్మణుడికి ఇవ్వనివాడినీ, శరణాగతులను దండించేవాడినీ, నిత్యం స్నానసంధ్యలు విడచినవాడినీ, బ్రాహ్మణ అశ్వ గోహత్య ఇలాంటి పాపం చేసిన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిళుడు అంటారా? వీడు చేయని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి, దాసీసంగమ దాసుడయి చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా తీసుకు వెళ్ళడానికి అర్హుడు ఎలా అయ్యాడు?'
యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు 'ఓ యమదూతలారా! ఉత్తమలోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఎటువంటి కారణం వలనకాని దుష్టగుణం నుండి మంచిమార్గంలో కలిసేవాడు, నిత్యం దైవచింతనాపరుడు, స్నానసంధ్యా జపహోమ చేసినవాడు మీ యమలోకంలోకి అర్హులు కారు. ఓ యమదూతలారా! అసూయ లేనివారై, జపాగ్ని హోత్ర నిర్వాహకులై, సర్వ కర్మలనూ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్నగోదాతలు, వృషోత్సర్జనా కర్తలూ యమలోకాన్ని పొందడానికి అనర్హులు. విద్యాదాత (గురువులు) పరోపకార శీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపంచేసేవారు, వివాహ ఉపనయనాలను చేయించేవారూ అనాథ ప్రేత సంస్కారకర్తా వీళ్ళు ఎవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యం సాలగ్రామాన్ని అర్చించి, ఆ తీర్థాన్ని తీసుకునేవాడూ, తులసీ మాలికలు ధరించేవాడు, గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవాడూ, భాగవతాన్ని పఠించేవాడూ, పూజించేవాడూ, వినేవాడూ, సూర్యుడు మేష-తుల-మకర సంక్రాంతులలో ఉండగా ప్రాతఃస్నానం ఆచరించేవాడూ వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని, తెలియకగాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు, పాపవిముక్తులు అవుతారు. ఓ యమదూతలారా! ఇన్ని మాటలు ఎందుకు? ఎవడైతే మరణకాలంలో హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణు లోకానికే వస్తాడు.'
ఈ విధంగా సాగుతున్న యమ, విష్ణుదూతల సంవాదం అంతా విన్న అజామిళుడిలోని జీవుడు తన శరీరం దాసీ సాంగత్యం వంటి పాపాలను తలచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం చెందాడు. 'ఇది ఏమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపొతే నా నాలుకపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది?' అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా! కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదం అయినది. కాగా హరికి ప్రియంకరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంతపుణ్యం కలుగుతుందో ఊహించు ...' అంటూ ఆపాడు వశిష్టుడు.
తొమ్మిదవ అధ్యాయం సమాప్తం
పదవ అధ్యాయం
జనక ఉవాచ: 'వశిష్టా! ఈ అజామీళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు? అన్నీ పూర్తి వివరంగా చెప్పు'
వశిష్ట ఉవాచ: 'నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణుదూతల చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభువైన యముడిని చేరి ఇలా చెప్పసాగారు.
యమదూతల ఆరోపణ - యముని ఉపదేశం
'అయ్యా! పాపాత్ముడూ, దురాచారుడూ, నిందిత కర్మలు చేసేవాడూ అయిన అజామీళుడిలోని జీవుడిని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుండి విడిపించి, తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము' అని యమకింకరులు చెప్పింది విని, రవ్వంత కోపానికి గురి అయిన యముడు జ్ఞానదృష్టితో అంతా చూసిన తరువాత 'కింకరులారా! 'కించిదపి పుణ్య విహీనోపి' అజామీళుడు అనే పాపి, అంత్యకాలంలో హరినామ స్మరణం చేయడం వలన సమస్తపాపాలనూ నశింప చేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొనిపోబడ్డాడు. తెలిసి తాకినా, తెలియక తాకినా సమస్త జాతులనూ అన్నం ఆరగిస్తారో అదే విధంగా దుష్టత్ములై, మహిమను తెలుసుకోలేక పోయిన ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలూ దహించబడిపోతాయి. ఇక, భక్తిభావంతో స్మరించినవారు కేవలం కైవల్య పధగాములే అవుతారు' అంటూ సేవకులకు ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడిపోయాడు.
అజామీళుడి పూర్వజన్మం
అజామీళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చన చేసేవాడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యలు చేయకుండా, దైవంపట్ల చిత్తమూ, దేవుడి ద్రవ్యాలను అపహరించేవాడు అయి ఉండేవాడు. బ్రాహ్మణుడు అయి ఉండీ కూడా మధుపానం, దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడు అయి ఉండీ కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్చా విహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలంలో అదే గ్రామంలో దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రంతో బాధపడుతూ, అన్నం కోసం పట్టణాలు, పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని చేస్తూ ఉన్నాడు. ఒకానొకసారి అతనికి లభించిన యాయవార వస్తువులు అన్నింటినీ మోసుకొని వచ్చ భార్యను పిలిచి 'చాలా ఆకలిగా వుంది. త్వరగా వంట చేయి. ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు. అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను' అన్నాడు. కాని, యవ్వనం, మదంతో వున్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుడి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అందుకు కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో ... అతన్ని తన ముష్టిఘాతం ఇచ్చింది. అలసీ, బడలికగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంలో ఆమెనూ, ఇంటినీ వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్ళి, భిక్షాటన చేస్తూ బ్రతకడం మొదలుపెట్టాడు. మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ ఇల్లాలు, మొగుడు తెచ్చినవి అన్నీ సుష్టుగా తిని, మొగుడు ఇచ్చినవి అన్నీ అలంకరించుకుని, మొగుడు తెచ్చిన మంచి చీర కట్టుకుని, తాంబూలం తింటూ ఒకానొక రజకుడి యింటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది. కానీ, నీతిమంతుడు అయిన ఆ రజకుడు, ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో ... వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో కోరుకున్న కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇంతకుముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం అర్చకుడిని చూసి, సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడు అయిన వీడు, ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా, అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ పతిత సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమిలాడి తెచ్చుకుని, అది మొదలు అతని మాటలకు తుచ తప్పకుండా బ్రతకసాగింది.
ఇటువంటి పాపాల వలన, మరణం తరువాత అ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి, అనుభవించి సత్వవిష్టుడి కొడుకు అయిన అజామీళుడుగా జన్మించి, కార్తీక పౌర్ణమి రోజున శివసందర్శనం, అంత్యకాల హరినామ స్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.
ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో సంభోగం జరిపిన బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించి, నరకం అనుభవించి - కన్యాకుబ్జంలోని ఛండాలగృహంలో బాలికగా జన్మించింది. కాని, ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనంలో నివశించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యరోదన విని. జాలిపడి, తనతో తీసుకుని వెళ్ళి, తన ఇల్లాలికి పెంపకం కోసం ఇచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లకే తరువాత కాలంలో అజామీళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వు అడిగిన అజామీళుడి పూర్వ కథ ఇది. సమస్తమైన పాపాలకూ హరినామ స్మరణకన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది.
జనక నరపాలా! ఎవరి నాలుక హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలు అన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని అనడంలో ఏమీ సందేహం లేదు! మోక్షం ఆసక్తి కలవారు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కష్ట పుణ్య ప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే వుండడం వలన, ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో, వాళ్ళు నరకప్రాప్తులు అవుతారు అని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.
తొమ్మిదవ - పదవ అధ్యాయాలు
ఐదవరోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!