కార్తీక పురాణము - పదనాలుగవ రోజు పారాయణ
ఇరవై తొమ్మిదవ అధ్యాయం
తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి - 'మహామునీ! నేను బహు పాపాత్ముడిని. ఆకలితోవుండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలుచేసిన మందభాగ్యుడిని. అయినా
నాయందు దయతో మళ్ళీ నా యింటికి అతిథిగా వచ్చావు. దయచేసి నా ఇంట విందు ఆరగించి, నా సర్వదోషాలను ఉపశమింప చేయి' అని ప్రార్థించాడు. దూర్వాసుడి అతనిని తన బాహువులతో
(చేతులతో) లేవనెత్తి - 'రాజా! ప్రాణదాతను 'తండ్రీ' అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానంలో ఉన్నావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కాని బ్రాహ్మణుడినీ
తాపసినీ, నీకన్నా వయోవృద్ధుడినీ అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చేయదు. అందువల్ల, నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోకు. నేను నిన్ను కష్టపెట్టాను.
అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీవంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం' అని చెప్పి, అతని ఆతిథ్యాన్ని స్వీకరించి, విష్ణుభక్తుల మహాత్య ప్రకటన కోసం, పరీక్షించడానికి
వచ్చిన దూర్వాసుడు - ఆ సత్కార్యం పూర్తికావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి, కార్తీకశుద్ధ ద్వాదశీ వ్రతం సమస్త సత్ఫలితాల ప్రదాయిని అని తెలుసుకోవాలి. శుద్ధ ఏకాదశినాడు
ఉపవాసం, జాగరణలు చేసి - ద్వాదశినాడు దానాలు (క్షీరాబ్దద్వాదశీ వ్రతం) నిర్వర్తించి, బ్రాహ్మణ సమేతుడై, ద్వాదశీ ఘడియలు దాటకుండా పారణం చేయడంవల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి.
ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది, పరంలో ఉత్తమపదాన్ని పొందుతారు.
ఇరవై తోమ్మిదవ అధ్యాయం సమాప్తం
ముప్పైవ అధ్యాయం
పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీకమహత్యాన్ని విని, శౌనకాదిఋషులు "మహానుభావా! కలియుగ కల్మషగతులు, రాగాదిపాశయుక్త సంసారగ్రస్తులూ అయిన సామాన్యులకి
సునాయసంగా లభించే పుణ్యం ఏది? అన్ని ధర్మాలలోనూ అధికమైనది ఏది? దేవతలందరిలోకీ దేవాదిదేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహం దేనివలన నశిస్తుంది?
జరామృత్యుపీడతలు, జడమతులు, మాంద్యులు అయిన ఈ కాలపు ప్రజలు తేలిగ్గా తెములుకు పోయే తెరువు ఏమిటి?'' అని అడిగారు. అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు. "మంచి ప్రశ్నలను
వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించడం వలన వివిధ తీర్థక్షేత్రాల పర్యటన, స్నానాల వల్లా వివిధ యజమానాది నిర్వహణలవల్లా కలిగేటువంటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను
మీకు చెప్పిన కార్తీకఫలమే వేదోక్తమైంది. విష్ణువుకి ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం. సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను, సమయం కూడా సరిపోదు. కాబట్టి అన్ని
శాస్త్రాలలోనూ వున్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణుభక్తీకన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులై, నరకానికి దూరంగా, సంసారసాగరాన్ని తరించిపోతారు.
కార్తీకమాసంలో విష్ణు ప్రీత్యర్థంగా స్నాన, దాన, జప, పూజా, దీపారాధన మొదలైనవి చేసేవాళ్ళ పాపాలు అన్నీ వాటికవే పటాపంచలై పోతాయి. సూర్యుడు తులారాశిలో నెలరోజులు కూడా విడవకుండా
కార్తీకవ్రతం ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. కార్తీక వ్రతం చేయనివాళ్ళు కుల, మత, వయో, లింగభేదరహితంగా 'అంధతామిశ్రం' అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీస్నానం
చేసినవాళ్ళు దేవతలచే కీర్తించబడతారు. విష్ణులోకాన్ని చేరతారు. కార్తీక స్నానం చేసి, విష్ణువుకి అర్చన చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయనివాళ్ళు వెయ్యిసార్లు ఛండాలపు
జన్మల పాలవుతారు. సర్వశ్రేష్ఠము, హరి ప్రీతిదాయకమూ, పుణ్యకరమూ అయిన ఈ వ్రతాచారణం దుష్టాత్ములకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీకస్నాన దానజప పూజాదులు
చేసేవాళ్ళు సర్వదుఃఖావిముక్తులు అవుతారు, మోక్షం పొందుతారు. దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధనం, ధన-ఫల-ధాన్య-గృహాదిదానాలు అమిత పుణ్యఫలదాలు, కార్తీకం ముప్పయిరోజులూ
కార్తీకమహత్యాన్ని వినినా - పారాయణ చేసినా కూడా - సకల పాపాలూ నశించిపోతాయి. సంపత్తులు సంభవిస్తాయి. పుణ్యాత్ములు అవుతారు. ఇన్ని మాటలు ఎందుకు? విష్ణుప్రియమైన కార్తీక
వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి.
ముప్పైవ అధ్యాయం సమాప్తం.
పదనాలుగవ (చతుర్థశి) రోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!