కార్తీక పురాణము - పందొమ్మిదవ రోజు పారాయణ
ఏడవ అధ్యాయం
నారదుడు చెబుతున్నాడు: పృథుభూపాలా! కార్తీక వ్రతస్థుడు అయిన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను.
కార్తీక వ్రతస్థులకు నియమాలు
ఈ వ్రతస్థుడు మాంసము, తేనే, రేగుపండ్లు, నల్లఆవాలు, ఉన్మాదకాలను తినకూడదు. పరాన్నభుక్తి-పర ద్రోహం, దేశాతనాలు విడిచిపెట్టాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ బ్రాహ్మణ
గురురాజులను, నువ్వులనూనెను, విక్రయ అన్నము, నింద్యవంజనయుక్త భోజనము, దూషితాహారము విదిచిపెట్టాలి. ప్రాణి సంబంధిత హీనదాన్యాలను, చద్ది అన్నాన్ని తినకూడదు. మేక, గేదె, ఆవు
వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమీష సంబంధిత క్షీరాలు స్వీకరించకూడదు. బ్రాహ్మనులచే అమ్మబడే రసాలను భూజాతలవణాలను విసర్జించాలి. రాగిపాత్రాలలో ఉంచిన పంచగవ్యం, చిన్న
చిన్న గుంటలలో వుండే నీళ్ళు, దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడూ మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి వీటిని విసర్జించాలి. బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని(నేలపై
పడుకోవడం) ఆకులలోనే భోజనం చేయాలి. నాలుగవఝామున భుజించడమే శ్రేష్ఠం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్థశినాడు తప్ప మిగిలిన దీక్షాదినాలలో త్రైలాభ్యంగనం చేయకూడదు.
విష్ణువ్రతం చేసేవాళ్ళు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయాలను విసర్జించాలి. బహిష్టలతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రత భ్రష్టులతోనూ, వేదత్యక్తులతోను సంభాషించకూడదు
అటువంటివారి ఎంగిలికాని, కాకులు తాకిన ఆహారాన్ని గాని, మాడుపట్టిన అన్నాన్ని గాని తినకూడదు. తన శక్తికొలది విష్ణు ప్రీతికి క్రుచ్చాదులు చేయాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి,
మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదుపోట్ల, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమ్యాదిగా పరిత్యజించాలి. ఇవేగాక ఇంకా కొన్నిటిని కోడా విసర్జించాలి. మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీకమాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగులా పారిపోతారు. వంద యజ్ఞాలు చేసినవాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కాని, కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. కాబట్టి యజ్ఞయాగాదులు కన్నా కార్తీకవ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా! భూలోకంలో వున్న పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా కార్తీక వ్రతస్థుడి శరీరంలోనే వుంటాయి. విష్ణ్వాజ్ఞాపరులైన ఇంద్రాదులు అందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు. విష్ణు వ్రతాచరణాపరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో, అక్కడినుండి గ్రహ, భూత, పిశాచగణాలు పలాయనాన్ని పాటిస్తాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయాల్సిన అవసరమే లేదు.
ఏడవ అధ్యాయం సమాప్తం
ఎనిమిదవ అధ్యాయం
ప్రజారంజనశీలా! పృథునృపాలా! ఇక, ఈ కార్తీకవ్రత ఉద్యాపన విధిని వివరంగా చెబుతున్నాను విను.
ఉద్యాపన విధి
విష్ణు ప్రీతికోసమూ, వ్రత సాఫల్యత కోసమూ కార్తీకశుద్ధ చతుర్థశినాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి దానిచుట్టూ తోరణాలు ఉన్నది, నాలుగు ద్వారాలు కలది,
పుష్పవింజామరలతో అలంకరిపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. నాలుగు ద్వారాల దగ్గర సుశీల, పుణ్యశీల, జయ, విజయులు అనే నలుగురు ద్వారపాలకులను మట్టితో
ఏర్పాటుచేసుకుని వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో నాలుగురంగులు గల ముగ్గులతో 'సర్వతోభద్రం' అనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమానమైన కొబ్బరికాయతో కూడిన
కలశం ప్రతిష్టించి, శంఖచక్ర గదా పద్మధారీ పీతాంబరుడు లక్ష్మీసమేతుడూ అయిన నారాయణుడిని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి. శ్రీమహావిష్ణువు ద్వాదశిరోజున
నిద్రలేచి, త్రయోదశియందు దేవతలకు దర్శనం ఇచ్చి, చతుర్థశినాడు పూజనీయుడై ఉంటాడు కనుక, మానవుడు ఆ రోజున నిర్మలచిత్తుట్టుడై ఉపవాసం వుండి, విష్ణుపూజను విధి విధానంగా
ఆచరించాలి. గురువుయొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపంలో ఆవాహన చేసి, షోడసోపచారాలతోను పూజించి, పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి. గీతాలు, వాయిద్యాలతో మంగళ ధ్వనులతో ఆ
రాత్రి జాగరణ చేసి, మరుసటిరోజు ప్రాతఃకాలకృత్యాలు నెరవేర్చుకుని, నిత్యక్రియాలను ఆచరించాలి. తరువాత నిష్కల్మషంగా హోమం చేసి, బ్రాహ్మణ సమారాధన చేసి, యథాశక్తి దక్షిణలు
ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్థశినాడు ఉపవాసం చేసినవాడు, విష్ణుపూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు.
తరువాత పూర్ణిమనాడు శక్తిగలవాడు ముప్పై దంపతీ పూజలను ఆ శక్తులను కనీసం ఒక్క దంపతీ పూజ అయినా చేసి, వ్రతనాధునకు దేవతలకు తులసికి పునః పూజ చేసి, కపిలగోవును
అర్పించాలి. ఆ తరువాత ...
'ఓ బ్రాహ్మణులారా! మీరు సంతోషించుటచేత నేను విష్ణువు అనుగ్రహమును పొందెదనుగాక! ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా పాపాలు నశించుగాక! నా కోరికలు తీరునుగాక! గోత్రవృద్ధి
స్థిరమగుగాక! జీవితాంతాన దుశ్శక్యమైన వైకుంఠవాసం లభించుగాక! అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. వారి చేత తథాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి, బంగారపు కొమ్ములతో
అలంకరించబడిన గోవును గురువుకు దానం ఇవ్వాలి. ఆ తరువాత సజ్జనులతో కూడినవాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి.
ఏడవ, ఎనిమిదవ అధ్యాయాలు సమాప్తం
పందొమ్మిదవ (బహుళ చవితి)రోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!