కార్తీక పురాణము - ఇరవై ఒకటవ రోజు పారాయణము
పదకొండవ అధ్యాయము
మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడించవస్తున్న జలంధరుడికి భయపడినవారై దేవతలు అంతా విష్ణు స్తోత్రం చేయసాగారు.
సర్వదేవతా కృత విష్ణు స్తోత్రం
శ్లో నమో మత్స్య కుర్మాది నానా స్వరూపై
సదాభక్త కార్యోద్యతా యార్తి హంత్రే
విధాత్రాధి పరగస్థితి ధ్వంసకర్త్రే
గదాశంఖ సద్మాసి హస్తయతే స్తు !! 1
రమావల్లభో యసురాణాం నిహంత్రే
భుజంగారి యానాయ పీతాంబరాయ
మఖాది క్రియాపాకకర్త్రే వికర్త్రే
శరణ్యాయ తస్మై వతాస్మొనతాస్మః !! 2
నమో దైత్య సంతాపి తామర్త్యదుఃఖా
చల ధ్వంసదంభోళయే విష్ణవేతే
భుజంగేళ టేల్ శయా నార్కచంద్ర
ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మః !! 3
నారద ఉవాచ:
సంకష్ట నాశనం స్తోత్ర మేతద్యస్తు పఠేన్నరః
స కదాచిన్న సంకష్టైః పీడ్యతే కృపయాహరేః
మత్స్యకూర్మాది అవతారములు ధరించినవాడునూ - సదా భక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడును, దుఃఖములను నశింపచేయువాడును, బ్రహ్మాదులను సృష్టించి, పెంచి, లయింపచేయువాడును, గద, శంఖం, పద్మం, కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించినవాడును యగు నీకు నమస్కారమగుత
(1). లక్ష్మీపతి, రాక్షసారతి గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించినవాడును, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వ రక్షకుడవూనగు నీకు నమస్కార మగునుగాక.
(2).రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధమువంటి వదవును, శేషశయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును యగు ఓ విష్ణూ! నీకు నమస్కారము. పునః పునః నమస్కారము.
(3). ఇలా దేవతలచేత రచించబడినదీ, సమస్త కష్టాలను సమయింప చేసేదీ అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడు అయితే పఠిస్తూ ఉంటాడో వాడి యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరి దయవలన తొలగిపోతాయి' అని పృథువుకు చెప్పి, నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు.
ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినపడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి, గరుడవాహనంవైపు కదులుతూ 'లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరుడికీ-దేవగణాలకి యుద్ధం జరుగుతుంది. దేవరలు నన్ను ఆశ్రయించారు. నేను వెడుతున్నాను' అని చెప్పాడు. ఇందిరాదేవి రవంత చలించినదై 'నాథా! నేను నీకు ప్రియురాలనై ఉండగా నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది?' అని ప్రశ్నించింది. ఆ మాటకి ఆ మాధవుడు నవ్వి 'నిజమే దేవీ! నాకు నీ మీదనున్న ప్రేమచేతా, బ్రహ్మనుండి అతను పొందిన వరముల చేతా, శివాంశసంజాతుడు కావడం చేతా జలంధరుడు నాచేత చంపదగినవాడు కాదు' అని మాత్రం చెప్పి, సర్వాయుధ సమీకృతుడై, గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు.
మహాబలియైన గరుడుడి రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షససేనలు మేఘశకలాలవలె చెల్లాచెదురై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విషువును ఎదిరించాడు. వారిమధ్యన జరిగిన ఘోరయుద్ధం వలన, ఆకాశమంతా బాణాలతో కప్పబడిపోయింది. అద్భుతకర్ముడైన శ్రీహరి అనేక బాణాలతో జలంధరుడియొక్క జెండానీ, రథచక్రాలనీ ధనుస్సునీ చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో, గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన యసురేంద్రుడు - ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలశాయికీ, జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమయింది. ఆ ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్ళకీ భూమిమొత్తం ధ్వనిమయమై పోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుడి జలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు 'నీ పరాక్రమం నన్ను ముగ్దుడిని చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి 'బావా! రమారమణా! నీవు నాయందు నిజంగా ప్రసన్నుడవు అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవగణాలతోనూ సహా తక్షణమే వచ్చి నాయింట కొలువుండిపో''మ్మని కోరాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు తక్షణమే దానవ మందిరానికి తరలివెళ్ళాడు.
సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్టించాడు జలంధరుడు. దేవ, స్థిత, గంధర్వాదులు అందరివద్ద ఉన్న రత్నసముదాయాన్ని అంతటినీ స్వాధీనపరచుకున్నాడు. వాళ్ళనందరినీ తన పట్టణంలో పడివుండేటట్లుగా చేసుకుని, తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథుచక్రవర్తీ! ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన యింట కొలువు ఉంచుకుని, భూలోకమంతటినీ ఏకాచ్చద్రాదిపత్యంగా ఏలుతుండగా, విష్ణుసేవా నిమిత్తంగా నే (నారదుడు) ఒకసారి ఆ జలంధరుడి ఇంటికి వెళ్ళాను.
పదకొండవ అధ్యాయం సమాప్తం
పన్నెండవ అధ్యాయం
నారదుడు చెబుతున్నాడు : పృథురాజా! అలా తన గృహానికి వెళ్ళిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తిప్రపత్తులతో శాస్త్రవిధిగా సత్కరించి, తరువాత 'మునిరాజా! ఎక్కడ నుంచి ఇలా విచ్చేశావు? ఏయే లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పని ఏమిటో చెబితే, దానిని తప్పక నెరవేర్చుతాను' అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను.
'జలంధరా! యోజన పరిమాణమూ, పొడవూ గలదీ అనేకానేక కల్పవృక్షాలను, కామధేనువులనూ గలదీ - చింతామణులచే ప్రకాశవంతమైనదీ అయిన కైలాసశిఖరంపై - పార్వతీ సమేతుడు అయిన పశుపతిని సందర్శించాను. ఆ విభవాలకు దిగ్భ్రాంతుడినయిన నేను అంతటి సంపదకలవారు మరెవరయినా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంపదలను కూడా చూసి - నువ్వు గొప్పవాడివో, ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని యిలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే వున్నారుగాని ఒక్క స్త్రీ రత్నపు ఆధిక్యతవల్ల, నీకన్నా ఆ శివుడే ఉత్కృష్టవైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ యింట్లో అచ్చరలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరయినా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంక స్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగారు. కళ్యాణాత్పూర్వం వీతరాగుడయిన విషమాంబకుడు సైతం యే విదుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అద్రినందనకేనా ఈడుకాలేదు. నిత్యమూ ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీకూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడంవలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివుడికి తర్వాత వాడివేగాని, ప్రథముడివి మాత్రం కావు.
ఉపర్యుక్తవిధంగా, జలంధరుడితో ఉటంకించి, నా దారిన నేను వచ్చేశాను. అనంతరం, పార్వతీ సౌందర్య ప్రలోభుడై, జలంధతీరుడు మన్మధబగ్వగ్రస్తుడు అయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవుగదా! అందువల్ల విష్ణుమాయా మొహితుడు అయిన ఆ జలంధరుడు సింహికానందనుడయిన 'రాహు' అనే వాణ్ణి చంద్రశేఖరుడి దగ్గరికి దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రుడిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాసపర్వతాలు అన్నీ, తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి, తన రాకను నందీశ్వరుడిద్వారా నటరాజుకు కబురుపెట్టాడు. 'ఏం పనిమీద వచ్చావు?' అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు ...
ఓ కైలాసవాసా! ఆకాశంలోని దేవతలచేతా, పాతాళంలోని ఫణులచేతా కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకూ ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజా! వల్లకాటిలో నివసించేవాడివీ, ఎముకల పోగులను ధరించేవాడివీ, దిగంబరుడివీ అయిన నీకు హిమవంతుడి కూతురూ, అతిలోక సౌందర్యవతీ అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్నిరకాల రత్నాలకూ నేను రాజునివున్నాను. కాబట్టి, స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తని అవడానికి నేనే అర్హుడినిగాని, నువ్వేమాత్రమూ తగవు.
కీర్తిముఖ ఉపాఖ్యానము
రాహువు ఇలా చెబుతుండగానే ఈశ్వరుడియొక్క కనుబొమ్మలవలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వనికలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఖించబోగా - రాహువు భయపడి పారిపోబోయాడు. కాని, అ రౌద్రమూర్తి అనతిదూరంలోనే రాహువును పట్టుకుని మ్రింగివేయబోయాడు. అయినప్పటికినీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో, ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై, శివాభిముఖుడై 'హే జగన్నాథా! నాకు అసలే ఆకలి, దప్పికలు ఎక్కువ. వేటిని తినవద్దు అంటున్నావు గనుక, నాకు తగిన ఆహారపానీయాలు ఏమిటో ఆనతి ఇవ్వు' అని అన్నాడు. హరుడు అతనిని చూసి 'నీ మాంసాన్నే నీవు ఆరగించు' అన్నాడు. శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప మిగిలిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుడిపట్ల కృపాళుడయిన మహాశివుడు - నీ యీ భయంకర కృత్యానికి సంతుష్టుడిని అయినాను. ఇకనుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు'మని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా! తదాదిగా ఆ శిరోవషేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు 'ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించినవారి పూజలన్నీ వృథా అవుతాయి గనుక నన్ను అర్చించదలచినవారు ముందుగా కీర్తిముఖుడిని పూజించితీరాలి' అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బార్బరస్థలంలో విముక్తుడిని చేయడంవలన తదాదిగా రాహువు బర్బరనామధేయంతో ప్రసిద్ధిచెందాడు. ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి, భయవిముక్తుడై జలంధరుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు.
పదకొండు, పన్నెండు అధ్యాయములు సమాప్తం
ఇరవైఒకటవ (బహుళ షష్ఠి)రోజు పారాయణ సమాప్తం
Note: HTML is not translated!