కార్తీక పురాణము - ఇరువైరెండవ రోజు పారాయణ
పదమూడవ అధ్యాయం
నారద ఉవాచ: ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుడిమీద రణభేరీ వేయించాడు. కోట్లాది సేనలతో - కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన వున్న శుక్రుడు రాహువుచేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది. రాక్షససేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం, వర్షకాలపు మేఘావృత్తమైన ఆకాశంవలే కనిపించసాగింది. ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందు ఉంచుకుని రహస్యమార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు. 'ఓ దేవాధిదేవా! ఇన్నినాళ్ళుగా వాడివల్ల మేము పడుతున్న ఇక్కట్లు అన్నీ నీకు తెలుసు. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం, మా రక్షణార్థం వాడిని జయించు తండ్రీ!' అని ప్రార్థించారు. వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు, విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనని 'కేశవా! గత జగడంలోనే ఆ జలంధరుడిని యమునిపాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదలి వాడి ఇంట్లో కాపురం ఉండడం ఏమిటి?' అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు 'పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశవలన పుట్టడంచేతా, లక్ష్మికి సోదరుడు కావడంచేతా, యుద్ధంలో నాచేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వాడిని జయించు' అని చెప్పాడు. అందుమీదట శివుడు 'ఓ దేవతలారా! వాడు మహా పరాక్రమవంతుడు. ఈ శాస్త్రాలవల్లగాని, నా చేతగాని మరణించేవాడు గాడు. కాబట్టి, మీరందరూ కూడా ఈ అస్త్రశాస్త్రాలలో మీమీ తేజస్సులను సయితం ప్రకాశింపచేయాలి' అని ఆజ్ఞాపించడంతో, విష్ణ్వాది దేవతలందరూ తమతమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి, మహోత్తమమూ, భీషణ జ్వాలాసముదాయసంపన్నమూ, అత్యంత భయంకరమూ అయిన 'సుదర్శన'మనే చక్రాన్ని వినిర్మించాడు.
అప్పటికే ఒకకోటి ఏనుగులు, ఒకకోటి గుర్రాలు, ఒకకోటి కాల్బలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుణ్ణి, దేవతలూ, ప్రమథగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమతమ గణాలతో జలంధరుడిని ఎదుర్కొన్నారు. రెండు తెగల మధ్యనా భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచీ వచ్చే వీరరస ప్రేరకాలయన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమీ ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది. పరస్పర ప్రయోగితాలైన - శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గదాద్యాయుధభరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగావుంది. యుద్ధభూమిలో నేలకూలిన రధగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమథగణోపహతులైన దైత్యులని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింప చేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుడి చెవినబడింది. తక్షణమే ఆయన ముఖంనుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది, అత్యంత భయంకరమైన తాలుజంఘోదర వక్త్రస్తనాలతో మహావృక్షాలను సైతం కూలగోడుతూ రణస్థలి చేరింది.
శ్లో సా యుద్ధభూమి మాసాద్య భక్షయంతీ మహాసురాన్
భార్గవం స్వభగేధృత్వా జాగా మాంతర్హితా సభః !!
రావడం రావడమే పేరుమోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ వూపుఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్థానమైపోయింది. మరణించినవాళ్ళను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమాదగణాల విజృంభనకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలవలె చెల్లాచెదరయిపోసాగింది. అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణిత శరపరంపరతో శివగణాలను నిరోధించసాగారు. ఎంచక్కటి పంటమీద మిడతల దండులాగా తమమీదపడే రాక్షసబాణాలకు రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగ చెట్లవలె తయారయిన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగారు. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు.
పదమూడవ అధ్యాయం సమాప్తం
పదనాల్గవ అధ్యాయం
నందేశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నిశుంభుడి బాణాఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలనూ, జెండానూ, ధనుస్సునూ, సారథినీ నాశనం చేసేశాడు. అందుకు కోపంతో కాలనేమి నందీశ్వరుడి ధనుస్సును ఖండించాడు. క్రుద్దుడయిన నంది శూలాయుధంతో కాలనేమిని ఎదుర్కొన్నాడు. కాలనేమి ఒక పర్వత శిఖరాన్ని పెకలించి నందిని మోదాడు. నంది మూర్ఛపోయాడు. వినాయకుడు తన బాణాలతో శుంభుడి సారధిని చంపేశాడు. అందుకు కోపంతో శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణాలతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో, వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి - కాలినడకన శుంభుడిని చేరి వాడి వక్షస్థలాన్ని గాయపరిచాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశుంభులిద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. ఇది గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకుడికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూశ్మాండ-భైరవ-భేతాళ-పిశాచ-యోగినీగణాలన్నీ ఆయనను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుడి విజృంభనతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర, కుమారస్వాములు ఇద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభనతో వీగిపోతూన్న తన బలాన్ని చూసిన జలంధరుడు 'అతి' అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలనూ ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాలమధ్య ప్రాంతమంతా నిండిపోయింది. అయిదు బాణాలతో విఘ్నేశ్వరుడినీ తొమ్మిది బాణాలతో నందీశ్వరుడినీ, ఇరవై బాణాలతో వీరభద్రుడినీ కొట్టి మూర్ఛపోగొట్టి, భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు - ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలనీ, పతాకన్నీ, గొడుగునూ నరికేశాడు. మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు 'పరిఘ' అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు. అద్బుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు విగత స్పృహుడయ్యాడు.
పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సమాప్తం
ఇరువైరెండవ (బహుళ సప్తమి)రోజు పారాయణ సమాప్తం.
Note: HTML is not translated!