Karthika Masam Day 23 Parayanam

కార్తీక పురాణము - ఇరవైమూడవ రోజు పారాయణము 


                    పదిహేనవ అధ్యాయము 


వీరభద్రుడి మూర్ఛతో  వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరుగెత్తి పురహరున్ని శరణు వేడింది. అభవుడయిన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు. అంతవరకూ భయకంపితులైన సమస్త గణాలవాళ్ళూ కూడా శివసందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధప్రవేశం చేశారు. నంది వాహనారూఢుడై వస్తూన్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాలవలె రాక్షసులంతా పారిపోసాగారు. జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు. శుంభనిశుంభ కాలనేమ్యాశ్వముఖ, బలాహక, ఖడ్గరోమ, ప్రచండ, ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరుడితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివుడికి వీళ్ళేపాటి? ఆయనొక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు. బలాహకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివ వాహనమైన వృషభం యొక్క శృంగ (కొమ్ముల) ఘాతాలకి అనేకమంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాఛత్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు. ఆహ్వాన సూచకంగా పదిబలమైన బాణాలతో పశుపతిని గాయపర్చాడు. అయినా శివుడి మోహంలో చిరునవ్వు మాయలేదు. ఆ మందహాసంతోనే జలంధరుడినీ, గుర్రాలనీ, రథాన్నీ, జెండానీ, ధనుస్సునీ నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు - ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. శివుడా గదని తన బాణాలతో విరగగొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు. ఒకే ఒక్క బాణంతో వాడిని రెండుమైళ్ళ వెనుకపడేలా కొట్టాడు విరాట్ శిఖామణి అయిన శివుడు. అంతటితో జలంధరుడు, ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వ సమ్మోహనకరమయిన గాంధర్వ మాయను ప్రయోగించాడు. నాదమూర్తియైన నటరాజు మొహితుడు అయ్యాడు. గాంధర్వ గానాలు, అప్సరా నాట్యాలు, దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడయి పోయాడు. ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలూ చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడు అలా మోహితుడై పోయాడో తక్షణమే జలంధరుడు శుంభ-నిశుంభలిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి, తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు. వెళ్ళేముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. 'మాయ'తప్ప, బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ, పదిచేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుదాలతోనూ ఒకానొక మాయావృషభం మీద శివ మందిరమైన పార్వతీ అంతఃపురానికి బయలుదేరాడు. 
అలా వస్తూవున్న మాయా జలంధరుడిని చూసి, అంతవరకూ పరదృష్టి గోచరంగాని పార్వతి, వాడి దృష్టిపథంలో పడింది. అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడయితే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో, వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడు అనే విషయం పార్వతికి అర్థమైపోయింది. అంతటితో ఆమె అంతర్హితయై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ప్రత్యక్షమయిన విష్ణువు ఇలా చెప్పాడు 'తల్లీ! పార్వతీ! వాడు చూపించిన దారిలోనే నేనుకూడా ప్రయాణించాల్సి వుంది. దిగులుపడకు' అని ఆమెను ఓదార్చాడు. 'నీ ప్రాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరాని వాడు అయ్యాడో అలాగే ఆ జలంధరుని భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయింపరానివాడుగా తయారయ్యాడు. వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే, నేను వాడి ఇల్లాలి యందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను.' అని ధైర్యం చెప్పి, రాక్షసలోకానికి బయల్దేరాడు విష్ణువు. 


                    పదిహేనవ అధ్యాయం సమాప్తం


                    పదహారవ అధ్యాయం


ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు, అక్కడ ఆ రాక్షస రాజ్యంలో, జలంధరుడి భార్య అయిన బృందకు దుస్స్వప్నాలు కలుగసాగాయి. ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లూ, దిగంబరుడు అయినట్లూ, ఒళ్ళంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లూ, నల్లటి రంగు పువ్వులతో అలంకరించబడినట్లూ, పూర్తిగా ముండనం (గుండు) చేయించుకున్నట్లూ, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లూ, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లూ కలలు వచ్చాయి. అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి, తను చూసినది కలే అని తెలుసుకుని, అది ఆశుభమని తలపోసి చింతించసాగింది. ఐనా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదిక్కులా మసలసాగింది. ఆ విధంగా ఒకానొక వేళ వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనుపించారు. వారిని చూసి భీతావహయైన బృంద, వెనుదిరిగి పారిపోతూ ఆ వనంలోనే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని 'ఓ మునివర్యా! నన్ను రక్షించు. నాకు నీవే శరణు' అని కేకలు వేయసాగింది. అప్పుడా ముని భయగ్రస్తురాలైన ఆమెనూ, ఆమెని వెన్నంటి వస్తున్న రాక్షసులని చూసి ఒక్క హుంకార మాత్రం చేత, ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్ గా ప్రణమిల్లి 'ఓ ఋషీంద్రా! ఈ గండం నుంచి నన్ను కాపాడిన దయాళుడవు గనుక, నేను నా సంశయాలను కొన్నిటిని నీ ముందుంచుతున్నాను. నా భర్తయైన జలధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా వుందో దయచేసి నాకు తెలియజేయి' అని ప్రార్థించింది. కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశంవంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. మునివారికి కనుబొమ్మలతోనే కర్యవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మళ్ళా ఆకాశానికి ఎగిరి, అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులనూ, మొండెమునూ, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద ఘోల్లుమని ఏడ్చింది. అక్కడే వున్న ఋషి పాదాలపై బడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది. అందుకా ముని నవ్వుతూ 'శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణవలన తప్పక బ్రతికిస్తాను' అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైనదే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతక్కుని, అతడు సజీవుడు అయ్యాడు. ఖిన్నురాలై వున్న బృందను కౌగలించుకుని, ఆమె ముఖాన్ని పదేపదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా, ఒకానొక ఉరట సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించివేసింది. మగడి వేషంలో వచ్చి తన ప్రతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవుడిపై విపరీతంగా ఆగ్రహించింది. 'ఓ విష్ణుమూర్తీ! పర స్త్రీ గామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక! నీ మాయతో ఇతఃపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై, నీ శిష్యుడైన ఆదిశేష సహితుడవై అడవుల బడి తిరుగుతూ, వానర సహాయమే గతియైనవాడవవు గాక!' అని శపించి అని అభిలషిస్తూ చేరువ అవుతున్న శ్రీహరి నుంచి తప్పుకుని, అగ్నిని కల్పించుకుని అందులోపడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు, ఎందరు ఎన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతి పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 


                    పదిహేనవ పదహారవ అధ్యాయాలు సమాప్తం


                    ఇరవైమూడవ (బహుళ అష్టమి)రోజు పారాయణ సమాప్తం 

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

₹1,600.00

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil Ashta Mulika Oil is used for lightning Diya's before deities and it is best for lightning. This oil is prepared by mixiture of lifelong herbs with Lakshmi Tamara seeds, kasturi be..

₹180.00

0 Comments To "Karthika Masam Day 23 Parayanam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!