Karthika Masam Day 24 Parayanam

కార్తీక పురాణము - ఇరవై నాలుగవ రోజు పారాయణ


                    పదహేడవ అధ్యాయం


ఇక ఇక్కడ యుద్ధరంగంలో అధికమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు, తిరిగి ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయాలని అనుకుని మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభ నిశాచరులచేత వధింపబడుతూ వున్న ఆ మాయాగౌరిని చూశాడు ఈశ్వరుడు. చూసీచూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు, యుద్ధాన్నీ, తన పరాక్రమాన్నీ, కర్తవ్యాన్నీ విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదునుగా జలంధరుడు అపుంఖశాన్యైకాలైన మూడు బాణాలను శివుని శిరసుపైనా, వక్షస్థలంపైనా, ఉదరమందునా ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం కలగలేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మచే భోధించినవాడై, కోలుకున్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణ రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక, అనేకమంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతూన్న వారిలో వున్న అగ్రనాయకులైన శుంభ, నిశింభులను చూసిన రుద్రుడు 'పారిపోతూన్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించేదరుగాక' అని శపించాడు. అది గమనించిన జలంధరుడు - బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగుపరుగున వచ్చి, ఈశ్వరుడి వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగంనుండి పరుగుతీయసాగింది. దానిని మళ్ళించడం సాంబశివుడికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది రుద్రుడికి, వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు, భూమ్యాకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది. అతని మొండెం కూడా రథనుంచి భూపతితమైపోయింది. ఆ మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరుడిలో లీనమైపోయింది. బ్రహ్మాదిదేవతలందరూ సంతోషాతిరేకులు, అవనతశిరస్కులూ అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు. స్తుతించారు, కృతఙ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం 'బృందామోహితుడై అడవులలో అల్లాడిపోతూన్న విష్ణువును స్వస్థుడిని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించవలసింది' అని ప్రార్థించగా, శివుడు 'మొహినీదేవత నాశ్రయించ'మని చెప్పి జయజయ ధ్వానాల నడుమ సకలగణ మహామాయని ప్రార్థించసాగారు.


                    దేవతాకృత మహామాయా ప్రార్థనం


శ్లో     య దుద్భువా స్సత్వ రజస్తమో గుణాః 
    సృష్టి స్థితి ధ్వంస నిదాన కారిణః 
    య దిచ్చయా విశ్వమిదం భవాభవౌ 
    తతోతి మూల ప్రకృతిం నతాస్కృతామ్         1
శ్లో     యాహి త్రయోవింశతి భేద శాబ్దితా 
    వై ద్రూప కర్మాణి జాగు స్త్రయోపివై 
    జగత్యాశేషే సమాధిష్టితా  పరా 
    వేదాస్తూ మూల ప్రకృతిం నతా స్మృతాం     2
శ్లో     య ద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం 
    దారిద్ర్య భీ మోహ పరాభ వాదీన్ 
    న ప్రాప్నుంప త్యేవహి భక్తవత్సలాం 
    సదివ మూల ప్రకృతిం నతాస్మృతాం          3
సృష్టి స్థితిలయలకు కారణమైన సత్త్వరజస్తమోగుణాలు మూడు దేనినుంచి పుట్టినవో, దేనియొక్క యిచ్చవలన లోకంలో జనన - మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాము

(1) ఏదైతే ఇరవైమూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించబడినదో, వేదములతో సైతము దేనియొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము.

(2). దేనియందు భక్తుడైనవాడు దరిద్ర, భయ, మోహ, పరాభవాలను పొందడో, దేనికైతే తన భక్తులయందలి  ఎడతెగని ప్రేమకలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము .

(3). నారద ఉవాచ:     స్తవమేత త్త్రిసంథ్యాం యః పఠే దేకాగ్ర మానసః 

            దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్మృశంతి తం


నారదుడు చెబుతున్నాడు: దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతీ (మహామాయా) స్తవాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళు ఏనాడూ కూడా దారిద్ర్యాన్నిగాని, భయాన్నిగాని, మొహాన్ని గాని, దుఃఖాన్నిగాని అవమానాన్నికాని పొందారు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి 'ఓ దేవతలారా! త్రిగుణాలరీత్యా నేను త్రిమూర్తులనూ ధరించివున్నాను. రజోగుణం వలన - లక్ష్మిగాను, తమోగుణం వలన - సరస్వతిగానూ, సత్వగుణం వలన - పార్వతిగానూ విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ-పార్వతీ-సరస్వతులను ఆశ్రయించం'డని ఆదేశించి అంతర్థానమైపోయింది. దేవతలు రమా-ఉమా-సరస్వతుల చెంతకువెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలను ఇచ్చి - 'విష్ణువు ఎక్కడయితే మొహావృతుడైనాడో అక్కడ ఈ బీజాలను చల్లించండి' అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి - శ్రీహరి మోహితుడై పడివున్న బృందా చితి ప్రాంతమంతటా ఆ బీజాలను చిలకరించారు.
ఓ పృథు భూపతీ! పాతివ్రత్య మహిమాసుశోభితమైన ఈ గాథను - ఏకాగ్రచిత్తంతో చదివినా, విన్నా స్త్రీలుగానీ - పురుషులుగానీ ఇహంలో సంతాన సంపదనూ, పరంలో స్వర్గసంపదనూ పొందుతున్నారు అన్నాడు నారదుడు.


                    పదిహేడవ అధ్యాయం సమాప్తం


                    పద్దెనిమిదవ అధ్యాయం


తిరిగి నారదుడు చెబుతున్నాడు: ఓ పృథుమహారాజా! పూర్వోక్తవిధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల - త్రిగుణశోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన - ఉసిరిగ, లక్ష్మీవలన - మాలతి, గౌరివలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకూ బృందామోహాలతో మాంధ్యుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లు అయి మొలచిన లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మహిమలవలన, కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ, వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలయి ఉండటం వలన, ఆ బీజోత్పన్నమైన 'మాలతి' బర్చారీ నామధేయయై విష్ణువుకి దూరం అయింది. కేవలం అనురాగపూరితాలయిన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియాంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై, దాత్రీ తులసీసమేతుడయి, సర్వదేవతా నమస్కారాలనూ అందుకుంటూ వైకుంఠానికి తరలివెళ్ళాడు. అందువల్లనే కార్తీకవ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు ...


                    తులసీ మహిమ


ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు తీర్థస్వరూపమై వర్థిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాపా సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో, వారికి యమధర్మరాజును దర్శించే పనివుండదు. అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూ వుంది. తులసిని ప్రతిష్టించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక, శారీరక పాపాలేగాక, మాటలవలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాదినదులు, విష్ణ్వాదిదేవతలు తులసి దళాలతో నివశిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవారైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటివాడిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటివాడు విష్ణుసాయుజ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం, సత్యం, ముమ్మాటికీ సత్యం. తులసీచెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసీ వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే, అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది, అదే విధంగా ...


                    ధాత్రీ (ఉసిరి) మహిమ


ఉసిరిగచెట్టు నీడను పిండప్రదానం చేసినవారి పితరులు నరకం నుంచి విముక్తులు అవుతారు. ఎవడైతే తన శిరస్సుపైనా, ముఖంలోనూ, దేహంలోనూ ఉసిరిపండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి. ఎవరి శరీరంపై ఉసిరికఫలమూ, తులసి, ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడే అని తెలుసుకో. ఉసిరిగపండ్లనీ, తులసీదళాలనీ కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగాస్నానఫలం లభిస్తుంది. ఉసిరి ప్రత్తితోగాని, ఫలాలతోగాని దేవతాపూజ చేసినవాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి. సమస్త దేవతలూ, మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిగచెట్టును ఆశ్రయించుకుని వుంటారు.


ఏ నెలలోనైనా సరే - ఎవడైతే ద్వాదశినాడు తులసి దళాలను, కార్తీకం ముప్పదిరోజులలోనూ ఉసిరిగప్రత్తిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు, కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తాడో, వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది, ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే, అన్ని విష్ణుక్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలనీ మహిమలనీ చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసీ ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకుగాని, సహస్రముఖుడైన శేషుడికిగాని సాధ్యం కాదు. ఈ ధాత్రీ తులసే జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవాళ్ళై తమ  పూర్వులను కలిసి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు.


                    పదిహేడవ, పద్దెనిమిదవ  అధ్యాయాలు సమాప్తం


                    ఇరవైనాలుగవ (బహుళ నవమి)రోజు పారాయణ సమాప్తం 

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

₹1,600.00

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil Ashta Mulika Oil is used for lightning Diya's before deities and it is best for lightning. This oil is prepared by mixiture of lifelong herbs with Lakshmi Tamara seeds, kasturi be..

₹180.00

0 Comments To "Karthika Masam Day 24 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!