karthika puranam day 28 parayanam

      కార్తీక పురాణము -   ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ


                    ఇరవై అయిదవ అధ్యాయం


శ్రీక్రిష్ణుడు చెబుతున్నాడు:


సత్యభామ! నారదప్రోక్తలైన (నారదుడు చెప్పిన)సంగతులతో ఆశ్చర్యమనస్కుడు అయిన పృథువు, ఆ ఋషిని పూజించి, అతని వద్ద శలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో, వాళ్ళు నాకు యజ్ఞాది కర్మకాండలు చేసినవారికంటే కూడా చేరువ స్నేహితులు అవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాప్రాప్తులై పాపభీతి లేనివాళ్ళు అవుతారు.


శ్రీ కృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ 'స్వామీ! ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యంవలన 'కలహ'కు కైవల్యం లభించింది. కేవలం కార్తీకమాసపు పుణ్యంవలన రాజద్రోహ మొదలైన పాపాలు పటాపంచలు అయిపోతున్నాయి. స్వయంకృతాలో, కర్తలనుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి? దానిని వివరించు' అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు.


                    పాపపుణ్యములు ఏర్పడు విధానము


శ్లో     దేశ గ్రామకులానిస్యు ర్భోగభాంజికృతాదిషు     
    కలౌతు కేవలంకర్తా ఫలభు క్పుణ్య పాపయోః


'ప్రియా! కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు దేశానికీ, త్రేతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికీ, ద్వాపరయుగంలోనివి వారివారి వంశాలకి చెందినవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ 'కర్త' ఒక్కడికే సిద్ధిస్తుంది. 
సంసర్గరహిత సమాయత్తములయే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటంవలన, ఒక స్త్రీతో రమిచడంవలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగానూ, సంపూర్తిగానూ అనుభవిస్తున్నాడు.


వేదాదిబోధనల వలన, యజ్ఞము చేయడంవలన, పంక్తిభోజనంవలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవవంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, వినడంవలన, తలచుకోవడంవలన అందులోని వందవభాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను ద్వేషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని, తన పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో, ఇతరుల చేత సేవలు చేయించుకొన్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును యిచ్చి తీరాలి. అలా ఈయనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడు అవుతున్నాడు, పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికీ జరిగిందో వారు, యజమానుల పుణ్యంలో ఆరవభాగాన్ని హరించినవారు అవుతున్నారు. స్నాన, సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా, వారు తమ పుణ్యంలో ఆరవవంతు ఆ యితరులకు కోల్పోతారు. ఎవరినుంచి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మవలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెబుతుంది. కర్తకు కర్మఫలం తప్ప మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్య కర్మలవలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ చేసేవాడికి దక్కదు.


ఋణశేషం ఉండగా మరణించినవారి పుణ్యంలో - శేషఋణానికి తగినంత పుణ్యం ఋణదాతకు చెందుతూ వుంది. పాపంగాని, పుణ్యంగాని, ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడూ, ఆ పనిచేయడంలో తోడుపడేవాడు, దానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవవంతు ఫలాన్నీ పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుడివాటిలో గురువుకు, కుమారుడినుండి తండ్రికి, భార్యనుండి భర్తకు - ఆరవభాగము చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలది, నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో, కొడుకోగాని ఇతరునిచేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరవవంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా, మనకేమీ నిమిత్తమూ లేకపోయినా వివిధ జనసాంగాత్యాలవలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించకతప్పడం లేదు. అందువల్లనే సజ్జనసాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి, ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.


                    ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం

                     ఇరవై ఆరవ అధ్యాయం 

                    ధనేశ్వరుని కథ - సత్సాంగత్య మహిమ


బహుకాల పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడు అయిన అతగాడు కులాచార భ్రష్టుడయి పాపకర్మల పట్ల ఆసక్తుడయి సంచరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం, మొదలైన దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమేగాక, షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు.
వర్తకం నిమిత్తం ఒక దేశమునుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదే విధంగా ఒకసారి మాహిష్మతీనగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదానది ప్రవహిస్తూ ఉంది.


ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీకమాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతంది కదా! ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడనే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజూ నర్మదా తీరంలో సంచరిస్తూ, అక్కడ స్నాన-జప-దేవతార్చనా విధులను నిర్వహిస్తున్న బ్రాహ్మణులను చూశాడు. కొందరు కార్తీక పురాణ శ్రవణాన్ని ఆచరించడం చూశాడు. మరికొందరు నృత్యగాన మంగళవాద్య యుతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారూ, విష్ణుముద్రలను ధరించినవాళ్ళు, తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు, చూడటమే కాదు, నెలపొడుగునా అక్కడే మసలుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది, వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందఱో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. చివరకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామ ఉచ్చారణం కూడా చేసేవాడు. 

నెలరోజులూ యిట్టె గడిచిపోయాయి. కార్తీక ఉద్యాపనా విధినీ, విష్ణు జాగారాన్నీ కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమినాడు గో, బ్రాహ్మణ పూజలను ఆచరించి, దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. తరువాత సాయంకాలం శివప్రీత్యర్థ్యం చేయబడిన దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామా! నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమా!


శ్లో     మమరుద్రస్వయఃకశ్చి దంతరం వరికల్పయేత్ 
    తస్యపుణ్య క్రియాస్సర్వానిష్ఫ లాస్యుర్న సంశయః!!


ఎవరైతే నన్నూ, శివుణ్ణీ భేదభావంతో చూస్తారో, వారియొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృథా అయిపోతాయి. అదీగాక, ఆ శివుడు కార్తీక పౌర్ణమినాడే త్రిపురసంహారం చేసినవాడు అవడం చేత గూడా, ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలను అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోను, వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరిగుతున్నాడు కాని, ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో వున్న అతగాడికి అక్కడి భక్తులు తులసితీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది.


మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుడిని పాశబద్ధుడిని చేసి, కొరడాలతో మోదుతూ యముడి వద్దకు తీసుకువెళ్ళారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ప్రారంభించగా చిత్రగుప్తుడు 'హే ధర్మరాజా! వీడు ఆగర్భ పాపత్ముడేగాని, అణువంతయినా పుణ్యం చేసినవాడు కాదు' అని చెప్పాడు. ఆ మాటమీద దండధరుడు తన దూతలచేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి, కుంభీపాక నరకంలో వేయించాడు.


కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని యముడికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుడిని తన కొలువుకు పిలిపించి మళ్ళీ విచారణను తలపెడుతుండగా, అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు 'ఓ యమధర్మరాజా! ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలయిన పుణ్యాలను ఆచరించాడు గనుక, ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఏవయితే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవభాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి ఈ ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులయిన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది వున్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసానవేళ హరిభక్తులచేత తులసీతీర్థం పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరుపబడింది. పుణ్యనర్మదా తీర్థాలతో విగతదేహం సుస్నాతమయ్యింది. అందరు హరిప్రియుల ఆదరణకు పాత్రుడు అయిన ఈ విప్రుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు - పాపభోగాలయమైన నరకంలో ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు.


                    ఇరవై అయిదు, ఇరవై ఆరు అధ్యాయాలు సమాప్తం  


                    ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తం 

Products related to this article

Padma Asanam (Big)

Padma Asanam (Big)

Padma Asanam..

₹851.00