కార్తీక పురాణము - ముప్పైవ రోజు పారాయణ
ఇరవై తొమ్మిదవ అధ్యాయం
సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు 'ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది. ఆయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా, సూతమహర్షి సమాధాన పరచసాగాడు ...
రావిచెట్టు - దరిద్రదేవత
పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మినీ, కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి, తక్కిన సంపద అంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి, శ్రీదేవిని పెండ్లిచేసుకోదలిచాడు. కాని, శ్రీదేవి 'ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్టకు పెండ్లి గాకుండా కనిష్టనయినా నేను కళ్యాణమాడటం పాడిగాదు గనుక ముందామె మనువుకి సంకల్పించ'మని
కోరింది. ధర్మబద్ధమైన 'రమ' మాటలను అంగీకరించి, విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్టాదేవిని సమర్పించాడు.
స్థూలవదన, శుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసుశిరోజాలూ గలిగిన జ్యేష్టాదేవిని, ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.
దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు
నిరంతర హోమధూప సుగంధాలతోనూ, వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి, పెద్దమ్మ దుఃఖిస్తూ 'ఓ ఉద్దాలకా! నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేదీ, అతిథి పూజా సత్కారాలు జరిగేవీ, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోనానురాగంగల భార్యాభర్తలు ఉన్నచోటగాని, పితృదేవతలు పూజింపబడే చోటగాని, ఉద్యోగస్థుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజా దురంధరుడూ ఉండే స్థలాలలోగాని నేను ఉండను.
ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ యింట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో! ఎక్కడయితే దురాచారాలూ, పరద్రవ్య, పరభార్యాపహరణశీలురైన వారు ఉంటారో అలాంటి చోటులో అయితేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యాలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులూ ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను' అంది.
రావి మొదట్లో - జ్యేష్టానివాసం
ఆమె మాటలకు వేదవిదుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై 'ఓ జ్యేష్టా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వు ఈ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో'మని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్టాదేవి రావిచెట్టు మొదలులో అలాగే వుండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ, పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో వున్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణు కమలాసమేతుడై జ్యేష్టాదేవి ఎదుట ప్రత్యక్షమయి,ఆమెని ఊరడించుతూ 'ఓ జ్యేష్టాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి వుంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వుండిపో.
ప్రతియేటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ వుంటుంది' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్యేష్టాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీలపట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేట్లుగానూ ఏర్పరచాడు శ్రీహరి.
ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా, నారదుని చేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధానంగా, నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వివరించాను. ఎవరయితే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో సమస్త పాపాలనుండీ విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు. అని సూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు - అక్కడినుండి బదరీవన దర్శన కాంక్షులై పయనమయ్యారు.
ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాలు సమాప్తం
ముప్పైవ (బహుళ అమావాస్య)రోజు పారాయణ సమాప్తం
కార్తీక మాసపురాణ పారాయణ సమాప్తం
Note: HTML is not translated!