ముక్కోటి ఏకాదశి పూజా విధానం
పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి, సూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన రోజున వైకుంఠంలో మూడు కోట్ల దేవతలు స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. హిందువులకు ఎంతో శ్రేష్టమైనదని కూడా అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది కాబట్టే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే సాగరమథనంలో హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
ప్రాతఃకాలంలో స్నానసంధ్యాదులు పూర్తిచేసుకుని వైష్ణవ ఆలయాలలో, గృహంలో తిరుప్పావై పాశురాలు పఠించాలి. ఆలయాలను, గృహాలను మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు. శ్రీమహావిష్ణువు స్తోత్రాలను, అర్చనలు, అభిషేకాలను నిర్వహించి పునీతులు అవుతారు. ముక్కోటి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసితీర్థం తప్ప వేటినీ తీసుకోకూడదు. ద్వాదశి రోజున అతిథి లేకుండా తినకూడదు. ఈ రోజున ఉపవాసం చేసినవారు పాప విముక్తులు అవుతారు అని అంటారు. దశమి రోజున రాత్రి ఆహారం తీసుకోకూడదు, ఏకాదశి రోజుమొత్తం ఉపవాసం ఉండాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, దుష్టమైన ఆలోచనలు చేయకూడదు, ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి అంతా జాగరణ (మేల్కొని) ఉండాలి, అన్నదానం చేయాలి. ముక్కోటి ఏకాదశి పూజ నిష్ఠనియమాలతో చేసేవారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని పండితులు చెబుతున్నారు.
శ్రీమహావిష్ణువు ఫోటో లేదా విగ్రహం ముందు కలశం పెట్టి దానిపై తెలుపురంగు వస్త్రం వేసి, టెంకాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసిదళములు అధికంగా ఉపయోగించాలి. వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలలో వెల్లడించారు. శ్రీహరికి జాజిమాలను వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ముక్కోటి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూర్తిచేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించి, ఐదు తామర వత్తులు వేసి కొబ్బరినూనె వేసి దీపారాధన చేయాలి. ముక్కోటి ఏకాదశి రోజున చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణం, పురాణశ్రవణం మోక్షాన్ని కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. 'ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా చాలు. తలపెట్టిన కార్యాలు అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయి.
Note: HTML is not translated!