శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం
ప్రథమ అధ్యాయం
పూర్వం ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మునులు కూర్చుని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయంలో అక్కడికి పురాణాలను విశ్లేషాత్మకంగా చెప్పగల ప్రజ్ఞకలవాడు అయిన శ్రీ సూతమహర్షి అక్కడికి చేరుకున్నాడు. సూతమహర్షికి సకల సపర్యలు చేసిన పిదప శౌనకాది మహామునులు ఇలా అడిగారు 'ఓ పౌరాణిక బ్రహ్మ! మానవులు ఏ వ్రతం చేస్తే కోరిన కోరికలు ఫలించి ఇహ, పరలోకసిద్ధిని పొందుతారో, ఏ తపస్సు చేస్తే లబ్దిపొందుతారో మాకు వివరంగా విన్నవించండి అని వేడుకోగా … వారి మాటలు విన్న సూతమహర్షి 'ఓ మునిశ్రేష్టులారా! పూర్వం ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీమహావిష్ణువును మీరు అడిగినట్లుగానే అడగగా, శ్రీమహావిష్ణువు స్వయంగా నారదమహర్షికి చెప్పిన దానిని మీకు చెపుతాను శ్రద్ధంగా వినండి, అని చెప్పసాగాడు.
పూర్వం కలహప్రియుడు, లోకసంచారి అయిన నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకాల అనుగ్రహం పొందడానికి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మఫలం వల్ల పలు జన్మలు ఎత్తుతూ, అనేక కష్టాలను అనుభవిస్తున్న మానవులను చూసి, జాలిపడి వీరి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏది అని విచారిస్తూ విష్ణులోకం అయిన వైకుంఠం చేరుకున్నాడు. దేవర్షి అయిన నారదమహర్షి, విష్ణులోకంలో చతుర్భుజుడు, తల్లని శరీరంకలవాడు, శంఖు చక్ర గదా పద్మాలను కలిగి ఉన్న శ్రీహరిని చూసి ఇలా స్తుతించాడు. మనస్సులో ఊహించుటకుగాని, మాటలతో వివరించుటకుగాని శక్యం కాని అతీతమైన రూపం కలవాడా! ఆది మధ్యంత రహిత గుణాత్ముడైనటువంటి మహాపురుషుడు అయినటువంటి నారాయణా! భక్తుల బాధలు తొలగించు శ్రీ మన్నారాయణా! నీకు భక్తితో నమస్కరిస్తున్నాను'. శ్రీహరి నారాదని సాదరంగా ఆహ్వానించి కూర్చుండబెట్టి 'ఓ నారదమహర్షీ! నీవు వచ్చిన కారణం ఏమిటి? నీ కోరిక తీరుస్తాను నాకు చెప్పు' అని పలికాడు. అప్పుడు నారదుడు శ్రీమహావిష్ణువును చూసి నారదుడు ఈ విధంగా ప్రార్థించాడు 'ఓ జగద్రక్షా! భూలోకంలో మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు. వారికి అటువంటి కష్టాలు ఎలా తొలగిపోతాయి, అందుకు ఉపాయాన్ని అనుగ్రహించు'. దానికి శ్రీహరి ఇలా చెప్పాడు … 'నారదమునీ! నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగావు. అందుకు ఒక వ్రతం వుంది. అది సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు, ఇహలోకంలో సకల ఐశ్వర్యాలను పొంది అంత్యమున మోక్షాన్ని పొందుతారు' అని తెలిపాడు. నారదుడు ఇలా ప్రశ్నించాడు 'ఓ నారాయణా! ఆ వ్రతం ఆచరించే విధానం ఏమిటి? ఆచరించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది? దాన్ని ఇంతకుముందు ఎవరు ఆచరించారు? అంతా వివరంగా తెలియజేయండి' అని అడిగాడు.
శ్రీహరి ఇలా చెప్పసాగాడు … సత్యనారాయణ వ్రతం సకల దుఃఖ నివారణను చేయడమే కాకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించి, సంతానాన్ని పొందుతారు. అన్నింటా విజయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని వైశాఖ మాసంలో కాని, మాఘమాసంలో కాని, కార్తీక మాసంలో కాని ఏకాదశి, పూర్ణిమ మొదలైన శుభ తిథులలో కాని, రవి సంక్రమణ రోజున గాని ఆచరించాలి. కష్టాలు సంభవించినప్పుడు, దారిద్ర్యంతో బాధపడుతున్నవారు ఈ వ్రతం చేయటం మంచిది. ఈ వ్రతాన్ని శక్తి కలవారు ప్రతినెల ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానాధికాలు పూర్తయిన తరువాత భక్తిశ్రద్ధలతో నిశ్చలమైన మనస్సుతో 'దేవాధిదేవా! శ్రీ సత్యనారాయణ స్వామీ! నీ అనుగ్రహం పొందడానికి భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను' అని మనసులోనే ధ్యానం చేసుకొని నమస్కరించాలి. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తరువాత మధ్యాహ్నసమయంలో కూడా కర్మానుష్టానాలు నెరవేర్చి సాయంకాలం మళ్ళీ స్నానం చేసి రాత్రి ప్రారంభకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి.
పూజాస్థలంలో గోమయంతో అలికి, వరిపిండి మొదలైన ఐదు రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపై తెల్లని నూతన వస్త్రాన్ని (టవల్)పరిచి, దానిపై బియ్యం పోసి దానిపై కలశం పెట్టుకోవాలి. ఆ కలశం వెండితోగాని, రాగితోగాని, ఇత్తడితోగాని మట్టితోకాని చేసుకోవాలి. తరువాత ఆసనంపై మళ్ళీ కొత్త నూతన వస్త్రాన్ని పరిచి దానిపై సత్యనారాయణస్వామి పటాన్నికానీ, విగ్రహాన్నికానీ ప్రతిష్టించుకోవాలి. విగ్రహాన్ని ఒక కర్షము బంగారంతోకానీ, అర్థ కర్షము బంగారంతోకానీ లేదా పావు కర్షము బంగారంతో అయినా చేయంచి పంచం, రుతుములతో అభిషేకించి మంటపంలో ఉంచాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలైన నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆది దేవత ప్రత్యధి దేవతాయుతంగా పూజించాలి. విఘ్నేశ్వరుడు మొదలైన ఐదుగురు దేవతలను కలశానికి ఉత్తరంలో మంత్రంతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్టించి పూజించాలి. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు, మొదలైన ఎనిమిది దిక్కులలో ప్రతిష్టించుకుని పూజించాలి. తరువాత సత్యనారాయణ స్వామి కలశం మీద పూజించాలి. నాలుగు వర్ణములవారు, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించాలి. బ్రాహ్మణులు పౌరాణికంగాను, వైదికంగాను కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే వ్రతం ఆచరించాలి. చివరికి సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతం చేసేవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకువచ్చిచేసుకోవాలి. అరటిపండ్లు, ఆవుపాలు, గోధుమరవ్వ అది లేనిపోతే బియ్యం నూక, చెక్కెర లేదా బెల్లం ఇవన్నీ సమానంగా కలుపుకుని ప్రసాదం తయారుచేసి స్వామివారికి నివేదన చేయాలి. ఈ విధంగా నైవేద్యం నివేదించిన తరువాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోనూ, బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతాలను జరిపించాలి. ఇది భూలోకంలో కలియుగంలో ఇష్టకామితార్థాలను సిద్ధించుకోవడానికి అత్యంత సులభమైన మార్గం.
సత్యనారాయణస్వామి వ్రత విధానం
సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :
శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం
Note: HTML is not translated!