శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ
ద్వితీయ అధ్యాయం
ఓ మునిశ్రేష్టులారా! పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెపుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూతమహర్షి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడంతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇళ్ళూ తిరుగుతూ ఉండేవాడు. భగవంతుడు బ్రాహ్మణప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టాలను అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ పేద బ్రాహ్మణుడి ఎదురుగా నిలబడి 'ఓ బ్రాహ్మణా! నీవు వేదపండితుడివై వుండీ ఇలా దరిద్రాన్నిఅనుభవిస్తూ ఎందుకు తిరుగుతున్నావు?' అని అడిగాడు. అంత ఆ బ్రాహ్మణుడు 'ప్రభూ! నేను అత్యంత దరిద్రుడను, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, చాలా కష్టాలను అనుభవిస్తున్నాను' అని బదులు చెప్పాడు. శ్రీహరి 'బ్రాహ్మణుడా! శ్రీ సత్యనారాయణస్వామి శ్రీహరి అవతారము. ఆ సత్యదేవుడిని సేవించినట్లయితే నీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి నువ్వు ఆ సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించు' అని చెప్పి, వ్రత విధానాన్ని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అంతర్థానమయ్యాడు. వెంటనే ఆ దరిద్ర బ్రాహ్మణుడు సత్యనారాయణస్వామి వ్రతం రేపు చేస్తాను అని మనసులో సంకల్పించుకుని ఆ రోజు రాత్రి ఉత్సాహంతో నిద్ర పట్టక చెరువులో గడిపి మరుసటి రోజు ప్రాతఃకాలంలో లేచి నిత్యకృత్యాలు నెరవేర్చుకుని ఆ రోజు తప్పకుండా వ్రతం ఆచరించాలి అని మనస్సులో దృఢంగా నిశ్చయించుకుని భిక్షాటనకు బయలుదేరాడు. ఆరోజున బ్రాహ్మణుడికి ఏ రోజూ రానంత ద్రవ్యం వచ్చింది. అతను తన బంధువులను పిలిచి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతం ఆచరించాడు. వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ప్రతిమాసంలో కూడా విడువకుండా సత్యనారాయణస్వామి వ్రతాన్ని భక్రిశ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేయడం వలన ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలు పొందడమే కాకుండా సకల పాపాలనుండి విముక్తుడై అంత్యంలో మోక్షాన్ని పొందాడు. ఈ వ్రతం ఆచరించినవారు సకల దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖసంతోషాలతో జీవిస్తారు.
ఓ మునులారా! ఈ విధంగా ఆ శ్రీహరి నారదుడికి చెప్పిన ఈ వ్రతం ఇప్పుడు మీకు తెలిపాను అని చెప్పాడు. 'ఆ బ్రాహ్మణుని అనుసరించి ఎవరు ఈ వ్రతం చేశారో సవివరంగా తెలపండి అని మునులు కోరగా సూతమహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో ఒక అబ్రాహ్మణుడు ఈ వ్రతం ఆచరిస్తుండే వాడు. భక్తిశ్రద్ధలతో బంధువులు, సర్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథను వింటుండేవారు. ఆ సమయంలో ఒక కట్టెలు అమ్ముకువాడు అమితమైన ఆకలిదప్పులతో ఉన్నా కూడా బ్రాహ్మణుడు చేస్తున్నది అంతా చూసి 'ఓ మహాత్మా! మీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేస్తే ఏమిటి ఫలితం? దయతో ఈ వ్రతం సవివరంగా తెలుపండి' అని కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు 'నాయనా! ఇది సత్యనారాయణ వ్రతం, ఈ వ్రతం ఆచరించిన ఎడల సకల కోరికలు సిద్ధిస్తాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి' అని తెలుపాడు. కట్టెలు అమ్ముకునేవాడు సంతోషించి దాహం తీర్చుకుని, ప్రసాదాన్ని తీసుకుని, భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అ తరువాత కట్టెలు అమ్ముకునేవాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి నిశ్చయించుకుని మరుసటిరోజు పుల్లల కావిడి భుజంపై పెట్టుకుని ఈ రోజు ఈ పుల్లలు అమ్మిన ధనం వెచ్చించి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని సంకర్పించుకుని పట్టణంలోకి బయలుదేరాడు. అతను ఆ రోజు ధనవంతులు ఉండే వీథికి వెళ్ళి అమ్మగా పూర్వం కంటే రెట్టింపు ధనం వచ్చింది. అతడు అమిత సంతుష్టుడై అరటిపళ్ళు, చెక్కెర, నేయి, పాలు, గోధుమనూక మొదలైన పూజా సామాగ్రి తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. తరువాత అతను తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా శ్రీసత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. వ్రతఫలం వలన అతడు ధనాన్ని, పుత్రులు, పుత్రికలను పొంది జీవితకాలం అంతా సకల సుఖాలను అనుభవించి అంత్యంలో సత్యలోకాన్ని పొందాడు.
Note: HTML is not translated!