శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం
తృతీయ అధ్యాయం
ఓ మునిశ్రేష్టులారా! ఇంకొక కథను చెపుతాను వినండి. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి, బ్రాహ్మణులకు ధనం ఇచ్చి, సంతోషపెడుతూ ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణాలు కలిగినది. ఆ రాజు వ్రతం చేస్తుండగా 'సాధువు' అనే వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవను నింపుకొని వ్యాపారం కోసం ఆ మార్గంలో వెళుతూ ఆ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి, తన పడవను ఒడ్డుకు పంపించి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు 'ఓ రాజా! నీవు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతం గురించి సవివరంగా నాకు తెలపాలని కోరుకుంటున్నాను. దయతో నాకు చెప్పు' అని రాజును అడిగాడు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు 'ఓ వైశ్యుడా! పుత్రులు పొందడానికి మేము శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేస్తున్నాము. ఈ వ్రతం చేయడం వలన సకల కార్యాలు సిద్దిస్తాయి' అని చెప్పి వ్రతం ఆచరించవలసిన విధానం చెప్పాడు. వైశ్యుడు అంతా విని, 'రాజా! నాకు కూడా సంతానం లేదు. కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం పొందుతాను' అని చెప్పి తన వ్యాపారం పూర్తి చేసుకుని తన భార్య లీలావతికి వ్రతాన్ని గురించి చెప్పి, నాకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత భర్తతో సుఖించిన లీలావతి గర్భవతి అయి పదవ మాసంలో ఒక కుమార్తెను ప్రసవించింది. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్థమానం అవుతూ వచ్చింది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి 'నాథా! మనకు సంతానం కలిగితే శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కదా! మనకు సంతానం కలిగింది కాబట్టి వ్రతం చేయమని చెప్పింది. అందుకు అతను అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేస్తాను అని వ్యాపారం కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు.
కొంత కాలానికి కళావతికి యుక్త వయస్సు వచ్చింది. ఒక దూతను పిలిచి నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుడిని చూసి రమ్మని చెప్పి పంపిచాడు. వైశ్యుడు ఆ విధంగా చెప్పగా, ఆ దూత కాంచన నగరానికి వెళ్ళి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుడిని చూసి తీసుకుని వచ్చాడు. అన్ని విధాలా తన కుమార్తెకు తగినవాడు కావడంతో ఆ వైశ్య కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వైభవంగా పెళ్ళి జరిపించాడు. ఆ ఆనందంలో వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మరచిపోయాడు. అంతట సత్యనారాయణ స్వామికి ఆ వైష్యుడిపై కోపం వచ్చింది. వ్యాపారంలో ఆరితేరిన ఆ వైశ్యుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్రతీరంలో ఉన్న రత్నసాను పురానికి చేరుకున్నాడు. రాత్నాసాను పురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సాధువు తన వ్రతం చేయకపోవడం చూసిన శ్రీ సత్యనారాయణస్వామి కోపంతో ఆ వైశ్యుడికి కఠిన దుఃఖం కలుగుగాక అని శపించాడు. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి నలుమూలలా వెతుకుతూ తన దగ్గరకి వస్తున్నట్లు చూసిన దొంగలు ఆ ధనాన్ని ఆ వర్తకుల దగ్గరే వదిలి పారిపోయారు. రాజభటులు ధనాన్ని అక్కడ ఉండటం చూసి ఆ వైశ్యులే దొంగలు అని నిశ్చయించుకుని వారిని బంధించి రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. భటులు రాజును చూసి 'ప్రభూ! ధనంతో పాటు దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించి తగిన శిక్షను విధించండి' అని తెలిపారు. రాజు ఎటువంటి విచారణ చేయకుండానే వారిని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. భటులు రాజుగారి ఆజ్ఞ ప్రకారం వైశ్యులను తీసుకునివెళ్ళి కారాగారంలో బంధించారు. ఆ వైశ్యులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుడి మాయచేత వారు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనితో పాటు చంద్రకేతు మహారాజు వర్తకుల పడవలలో ఉన్న ధనాన్ని తన ధనాగారానికి తరలించాడు. సత్యదేవుడి శాపం వలన సాధువు ఇంట్లో ఉన్న ధనధాన్యాలు అన్నీ దొంగలుపడి దోచుకుని పోయారు. సాధువు భార్య రోగగ్రస్తురాలు అయింది. తినడానికి తిండిలేక, ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకుని బ్రతకడం మొదలుపెట్టింది. కళావతి కూడా ఆకలి భాధతో భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఒకరోజు బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది కళావతి. అక్కడ ఆ బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేస్తుండటం చూసింది. కథ అంతా విని, కరుణించి కాపాడు అని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రోద్దుపోయిన తరువాత ఇళ్ళు చేసుకుంది.
ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమగా ఇలా అడిగింది. 'అమ్మాయి! యింత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏముంది? చెప్పు' అని అడిగింది. దానికి కళావతి 'అమ్మా! నేను ఒక బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా! ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందట కదా' అంది. అప్పుడు లీలావతి కళావతి చెప్పిన మాటలు విని వ్రతం చేయాలని సంకల్పించుకుంది. లీలావతి బంధుమిత్రులతో కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేసి 'స్వామీ! మా అపరాధాన్ని మన్నించండి. మమ్మల్ని క్షమించి నా భర్త, అల్లుడు సుఖంగా ఇళ్ళు చేరుకునేలా దీవించండి' అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి 'రాజా! నీవు బంధించిన వారు ఇద్దరూ దొంగలుకారు. వారు వర్తకులు, రేపు ఉదయాన్నే వారిద్దరినీ విడిపించి, వారి ధనం వారికి ఇచ్చి కారాగారం నుండి విడుదల చేసి పంపించు లేకపోతే నువ్వు సర్వనాశనం అయ్యేలా చేస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలోకి వచ్చి తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు ఆ వర్తకులను రాజు దగ్గరకి తీసుకువచ్చి రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వర్తకులు ఇద్దరూ రాజుగారికి నమస్కరించి గత సంగతులు తలచుకుంటూ తమకి వచ్చిన కష్టానికి చింతిస్తూ భయభ్రాంతులై నిలబడి ఉన్నారు. అప్పుడు రాజు వర్తకులను చూసి 'వర్తక శ్రేష్టులారా! మీకు ఈ ఆపద దైవవశం వల్ల సంభవించింది. భయపడకండి' అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేసి, వారికి నూతన వస్త్రాలను ఇచ్చి సత్కరించి, వారిద్దరినీ సంతోష పరిచాడు. రాజు వారిని అనేక విధాలుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి సకల మర్యాదలతో సత్కరించి ఇక సుఖంగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. వర్తకులు పరమానందభరితులై రాజును అనేక విధాలుగా కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు.
సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :
సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి
శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం
Note: HTML is not translated!