హోళీ
హోళీ పండుగను భారతదేశం అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోళీ పండుగ చేసుకుంటారు. దేశమంతా వేరు వేరు పేర్లతో రకరకాలుగా ఉత్సవాలు జరుపుకుంటారు. త్రిమూర్తులను దంపతసహితంగా పూజించే రోజు ఈ ఒక్క రోజే ఫాల్గుణ పొర్ణమి అదే హోళీ పున్నమి. ఫాల్గుణోత్సవం, డోలాపున్నమి, కళ్యాణ పూర్ణిమ, కాముని పున్నమి, అనంగపూర్ణిమ, హోళికాపూర్ణిమ, హోళికాదహో, వసంతపూర్ణిమ, హోళీ ఇలా రకరకాల పేర్లతో హోళీ పండుగను వివిధ ప్రాంతాలలో రకరకాల ఆచారాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రావణాసురుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని హరి భక్తి నుండి దూరం చేయలేక తన సోదరి అయిన గ్నిలో దహనం కాకుండా వరంపొందిన హోలిక వొడిలో కూర్చోమని ఆదేశించి అగ్ని రాజేస్తాడు. అయినా విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని నారాయణుడు కాపాడుతాడు. హోలిక ఒంటరిగా కాకుండా మరొక వ్యక్తితో కలిసి అగ్నిలో ప్రవేశించినందుకు అగ్నిదేవుడు ఆగ్రహంతో హోలికను దహించివేస్తాడు. అందుకే హోళికా దహన్ అని పిలుస్తారు. కంసుడు శ్రీకృష్ణుడి ప్రాణాలు తీయమని పూతన అనే రాక్షసిని పంపించగా, పూతన కృష్ణుడిని తన ఒడిలో పెట్టుకుని పాలు పడుతుంది. అయితే కృష్ణుడు పాలతోపాటు పూతన ప్రాణాలను కూడా హరిస్తాడు. శీతాకాలాన్ని పూతనగా, చలికాలం అంతమై వాతావరణం వెచ్చబడడాన్ని పూతన సంహారంగా భావిస్తారు. మాఘ శుక్ల త్రయోదశి రోజున కామ స్వరూపుడు అయిన మన్మథుడు శివుడి తపస్సును భగ్నం చేయడంతో పరమశివుడు తన మూడవ నేత్రం తెరిచి కాముడిని దహనం చేశాడు. తరువాత మన్మథుడి భార్య రతీదేవి ప్రార్థనపై శాంతించిన శివుడు రతీదేవికి మాత్రమే సశరీరంగా మిగిలిన వారికి అనంగునడిగా వరం ప్రసాదించాడు. మన్మథుడు తిరిగి పునర్జీవితుడు అయింది ఫాల్గుణ పౌర్ణమి కాబట్టి ఈ రోజుని 'కాముని పున్నమి' లేదా 'అనంగ పూర్ణిమ' అనే పేర్లు ఏర్పడ్డాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో శివాలయాలలో శివపార్వతుల విగ్రహాలను ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉత్సవం జరుపుతారు. అలాగే కృష్ణుడు తిరుగాడిన నేల మథుర, బృందావనం, నందగావ్ ప్రాంతంలో పదహారు రోజులపాటు జరుపుకుంటారు. డోలోత్సవంగా పిలవబడే ఈ పండుగ రోజున విద్యార్థులు కేసర రంగు లేదా తెల్లని రంగు బట్టలు ధరించి ఏకతార, వీణ వంటి సంగీత వాయిద్యాలకు అనుగుణంగా నాట్యాలు ేస్తూ రాధా కృష్ణుల విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ ఊయల ఊపుతా భక్తి గీతాలను ఆలపిస్తారు. పురుషులు రంగునీళ్ళు చిమ్ముతూ వెంట నడుస్తారు. ఇంటిపెద్ద ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడినీ, అగ్నిదేవుడినీ పూజించిన తరువాత కృష్ణుడి విగ్రహానికి గులాల్ రాసి పిండివంటలు నైవేద్యంగా సమర్పిస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలాలో వేసి ఊపుతూ రంగులు చల్లుకుంటూ ఉత్సవం చేస్తారు. అందుకే 'డోలా పూర్ణిమ' అని పేరు వచ్చింది. ఉత్తర హిందూ ప్రాంతాలలో వసంతఋతువును ఆహ్వానిస్తూ సృష్టికర్త బ్రహ్మ, జ్ఞానప్రదాత్రి సరస్వతీదేవిని పూజిస్తారు కాబట్టే ఫాల్గుణోత్సవం అని పిలుస్తారు. ఈ రోజునే మధుర మీనాక్షి తపస్సు చేసి, సుందరేశ్వరుడిని వివాహం చేసుకున్న రోజు ఫాల్గుణ పౌర్ణమి. అందుకే దక్షిణాది దేవాలయాలలో లక్ష్మీనారాయణ వ్రతం చేస్తారు. అందుకే 'కళ్యాణ పూర్ణిమ' అనే పేరు వచ్చిందని విష్ణుపురాణంలో లిఖించబడింది. ఒరిస్సాలో కూడా జగన్నాథుడిని ఊయలలో వేసి ఊపుతూ పూజిస్తారు. గోవా, కర్ణాటక, మహారాష్ట, కేరళ, కొంకణ్ లు హోళీని శిశిరోత్సవంలో భాగంగా జరుపుకుంటారు. ఉత్తర భారతంలో కొన్ని చోట్ల హోళీ నాటి సాయంత్రమే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పంచాంగ శ్రవణం చేస్తారు. గుజరాత్ లో హోళీ పండుగ రోజున భోగిమంటలు వెలిగించి నృత్యాలతో, ఉట్లోత్సవం నిర్వహిస్తారు. మణిపురి వాసులు హోళీ పండుగను ఆరు రోజులపాటు జరుపుకుంటారు., మణిపురిలో ప్రత్యేకత ఏమిటంటే గడ్డి కప్పిన పూరిపాకను దహనం చేసి హోళీ పండుగ సంబరాలు మొదలుపెట్టి 'తాబల్ చొంగ్బ' అనే ప్రత్యేక నాట్యం చేస్తారు. బ్రజ్ ప్రాంతంలో కర్రలను కుప్పగా పోగుచేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీథి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణాలు చేస్తారు. తరువాతి రోజు ఈ విజయాన్ని దుల్ హెండి రోజుగా ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలో ఇది కొన్ని జిల్లాలలో, పట్టణాలలో స్వల్పస్థాయిలలో జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ లో హోళీ పండుగకు బార్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోళీ అనే క్రీడను ఆడతారు. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే స్త్రీలు పురుషులను లాఠీలతో కొడతారు. బార్సానాలో హోళీ రోజున స్త్రీలు లాఠీలతో పురుషులను వెంబడిస్తారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. దీంతో స్త్రీలు కోపంతో పురుషులను లాఠీలతో కొడతుండగా పురుషులు డాలుతో కాపాడుకుంటారు. లాత్ మార్ మాదిరిగానే హర్యానాలో 'కరోర్ మార్' అని వదినలు, మరదళ్ళు బావను,మరిదిని కొడతారు. చేతికి ఏది దొరికితే వాటితో కొడతారు. హోళీ అనే పండుగను దేశమంతా చిన్నా పెద్దా తేడా లేకుండా, జాతి సమైక్యతను కాపాడే విధంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. నేపాళీలు తమ పండుగలలో హోళీని ఒక గొప్ప పండుగగా పరిగణిస్తారు. హోళీ పండుగను తమ చుట్టుపక్కల వారిపై రంగులు జల్లుకుంటూ రంగు నీళ్ళను పోసుకుంటారు. దీన్నే లోలా (నీటి బుడగ) అని కూడా అంటారు. హోళీ రోజు చాలామంది పానీయాలలో, ఆహారంలో గంజాయి కలుపుకుంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశమంతా హోళీ పండుగను వారి వారి పద్ధతులలో జరుపుకుంటారు.
Note: HTML is not translated!