సంకష్టహర గణపతి వ్రత విధానం ?
సంకష్టహర గణపతి వ్రతం అంటే .. గణేశ పురాణం, ప్రకారం వినాయకుడి ఉపాసన ప్రాథమికంగా రెండు విధానాలు. ఒకటి వరద గణపతి రెండు సంకష్టహర గణపతి పూజ. వరద గణపతి పూజను 'వినాయక చవితి' పేరున చేసుకుంటారు. సంకష్టహర గణపతిని సంకష్టహర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. వినాయకుడికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతమే సంకటవ్రతం. ఈ సంకటహర చతుర్థి ప్రతి మాసంలో వస్తుంది. కృష్ణపక్షంలో (పౌర్ణమి తరువాత 3 లేక 4 రోజులలో చవితి వస్తుంది) ప్రదోషకాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకుంటారు. చాలా క్యాలెండర్లలో, పంచాగాలలో ఈ సంకష్టహర చతుర్థి గురించి తెలియజేస్తారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున స్నానం చేసిన తరువాత వినాయకుడిని పూజించి, ఎరుపు లేదా తెలుపు జాకెట్టు గుడ్డముక్క కాని, సుమారు అరమీటరు చదరం ఉన్న ఎరుపు లేదా తెలుపు రంగు కాటన్ గుడ్డను తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానికి పసుపు దిద్ది చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలచుకుంటూ మనసులో వున్న కోరికను మనసారా స్వామికి తెలియజేస్తూ మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. వినాయకుడి మందిరానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. వీలుంటే వినాయకుడికి ఇష్టమైన గరికెను స్వామికి సమర్పించాలి. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే గణపతిని పెట్టుకుని ప్రదక్షిణాలు చేయవచ్చు. పూజలో ఉన్న వినాయకుడిని కదపకూడదు, తీయకూడదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. సూర్యుడు అస్తమించేవరకు వండిన, ఉడికించిన, ఉప్పు కలిసిన లేక వేయబడిన పదార్థాలు తీసుకోకూడదు. పాలూ, పళ్ళు, పచ్చి కూరగాయలు తెసుకోవచ్చు. అనుకున్న మేర 3, 5, 11, 21 చవితిలు పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితిని నిర్వహించాలి. చంద్రోదయం, చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రుడికి ధూప,దీప, నైవేద్యాలను సమర్పించిన తరువాత మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం ఆచరించిన వారికి కోరిన ఎటువంటి కోరిక అయినా సిద్ధిస్తుంది అని ప్రతీతి. ఈ మొత్తం కష్టం అని భావించేవారు, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలోని వినాయకుడి మందిరం సందర్శించినా చాలు. కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం శ్రేష్ఠం. (సంకటహర చవితి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోశాలు పరిహారం అవడంతో పాటు జీవితంలోని సంకటాలు తొలగిపోతాయి.)
సంకటహర గణపతి స్తోత్రం :
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యయాయుః కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతీం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్థీ లభతే విద్యాం ధనార్దీ లభతే దానం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మొక్షార్దీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసైః ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
సంకటహర చతుర్థి వ్రత కథ :
పూర్వం ఒకానొకప్పుడు ఋషులు అందరూ కలిసి 'శతృ, దారిద్ర్యం, కష్టాలతో బాధపడేవారు, ఋణబాధలు పడుతున్నవారికి, సంతానం లేనివారికి, ఈతి బాధలు పడేవారికి, దీర్ఘవ్యాదులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవడం, ముందుకు సాగకపోవడం వంటి ఆటంకాలు అనుభవించేవారికి భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన వరువాత ఇలాంటి క్లేశాలు మనుష్యులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్నవారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని' కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు 'శ్రీలు సిద్ధించుటకు, తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చవితి అనే వ్రతం అన్ని వ్రతాలలోకి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కుంటున్న సమయంలో రాజ్యలాభం, పూర్వవైభవం పొందడానికి శ్రీ కృష్ణుడి సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లు చెప్పాడు' అని కుమారస్వామి చెప్పగా. ఋషులు ఈ విధంగా అడిగారు 'మహాసేనాధిపతి! లోకకళ్యాణ నిమిత్తం తన తల్లి అయిన పార్వతీదేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ విధంగా చెప్పాడో, ఆ విధానం మాకు కూడా తెలియజేయండి' అని వేడుకున్నారు. 'ఒకానొక కల్పంలో హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి శివుడిని పతిగా కోరుకుని భక్తితో తీవ్ర తపస్సు చేసినా ఫలితం లేకపోవడంతో, పూర్వలీల రూపంలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో స్మరించింది. స్మరించిన వెంటనే వినాయకుడు పార్వతీదేవి ముందు ప్రత్యక్షం కాగా 'ఇతరులకు అసాధ్యమైన కఠోర తపస్సు చేసినా, సర్వజన శంకరుడిని భర్తగా పొందటంలో జాప్యం జరుగుతుంది. ఇటువంటి ఆటంకాలు తొలగిపోవడానికి, స్వర్గాది లోకాలలో నీకు సంబంధించిన సంకటహరణం అనే వ్రతాన్ని ఆచరిస్తుంటారు అని నారదమహర్షి తెలియజేశారు. ఆ వ్రత విధానం వివరించమని' పార్వతీదేవి కోరింది.. అందుకు వినాయకుడు 'తల్లీ! గురు-శుక్ర మూఢాలు ఏవీ లేని శుభ శ్రావణ బహుళ చవితి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, దృఢసంకల్పంతో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకుని, దంతధావనం మొదలైన నిత్యకృత్యాలు ఆచరించి కల్పోక్త ప్రకారం గణేశ పూజ నిర్వర్తించాలి.
ఉద్యాపన విధి :
బంగారు, వెండి, రాగి లేదా మట్టితో ఆయినా వినాయకుడి ప్రతిమ చేసి నీటితో నింపి, ఎఱ్ఱని వస్త్రంతో చుట్టిన కలశంపై కాని మంటపంపై అష్టదళపద్మం ఏర్పరచి ప్రతిమను పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి, విభూతి, గంధాక్షతలతో, పుష్పదళాలతో, గరికపోచలతో అర్చించి, ధూపదీప నైవేద్యాలు అర్పించి హారతి ఇవ్వాలి. శ్రావణ బహుళ చతుర్థి నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి. పూజ పూర్తయిన తరువాత హోమం చేయాలి. పూజా మందిరంలోకి వెళ్ళి గణపతిని "సంకటం మాం నివారయ' (నా సంకటాలను తొలగించు) అని వేడుకుని నమస్కరించి ఆర్ఘ్యం ఇవ్వాలి. మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించు అని వేడుకుంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి. తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేపట్టాలి. వ్రత విధానం బాగా తెలిసిన ఆచార్యునితో పూజాది కార్యక్రమాలు నిర్వర్తింప చేయడం చాలా ఉత్తమం. ఈ పూజను పైన చెప్పిన తిథిలో ఏడాదికి ఒకసారి అయినా సరే చంద్రోదయ సమయంలో ఆచరించాలి. ఆ రాత్రి పురాణోత వేదమంత్రాలతో కాలక్షేపం, దైవసంబంధిత నృత్యగీత వాయిద్యాలచే జాగరణం చేయాలి. మరుసటి రోజు యథాశక్తి 21 మంది బ్రాహ్మణులకు దానాలు చేసి సంతృప్తి పరచాలి. వ్రతం చేయించిన ఆచార్యుడికి వస్త్ర, భూషణ, ఛత్ర పాదుకలు సమస్త సంభారములు దక్షిణ సహితంగా ఇవ్వాలి. నాకు అత్యంత ప్రీతికరమైన ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల నేను సంతృప్తి చెంది కోరికలను తీర్చుతాను' అన్నాడు గణపతి. గణపతి ద్వారా విన్న పార్వతీదేవి యథావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి, ఈ వ్రత మహిమ వల్ల ఆరు నెలలు తిరగకుండానే పరమశివుడిని భర్తగా పొందింది. శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు ఈ ప్రకారమే ఉపదేశించాడు. ఈ వ్రతం చేసిన పుణ్యఫలం వల్లనే పాండవులకు విజయప్రాప్తి కలిగింది, కనుక ఋషివర్యులారా! లోకంలో సంకటాలు నశించడానికి, మనుష్య, యక్ష, రాక్షస, గంధర్వులు, సమస్త జాతులవారి సర్వాభీష్టాలు తీరడానికి ఇంతకంటే సులభతరమైనది లేదు'' అని సుబ్రహ్మణ్య స్వామి ఋషులకు తెలియజేశాడు. ఋషులు 'ఇంకా ఎవరు ఈ వ్రతం ఆచ్చరించారో తెలపవలసింది'గా కోరారు. స్కందుడు ఇలా తెలియజేశాడు ' మహా బలవంతుడైన వాలి రావణుడిని తన చంకలో ఇరికించుకుని బంధించిన సందర్భంలో రావణుడు ఈ వ్రతం ఆచరించి సుఖంగా లంక చేరుకున్నాడు. హనుమంతుడి ఈ వ్రత ప్రభావం చేత లంకలో సీతమ్మవారి జాడ కనుగొన్నాడు. అలాగే మహారణ్యంలో భర్త జాడ కనబడక అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతిని సంకల్పం చేతనే ప్రసన్నం చేసుకుని భర్త నలమహారాజును చేరుకొని సుఖంగా జీవించింది. అహల్య కూడా పతి శాపవశంతో భర్తకు దూరమై ఈ వ్రతాచరణ వల్ల తిరిగి భర్త గౌతమ మహర్షిని చేరుకుంది. ఈ సంకష్టహర వ్రతం చేసి పుత్రులు లేనివారు పుత్రలాభం, ధనం లేనివారికి ధనలాభం, విద్యలేని వారికి విద్యాప్రాప్తి, వ్యాధిగ్రస్థులు ఆరోగ్యం పొంది సుఖంగా ఉండగలరు' అని కుమారస్వామి ఋషులకు వివరించాడు.
సంకష్టహర చతుర్థి గొప్పదనం తెలియపరిచే కథ :
ఒక సందర్భంలో ఇంద్రుడు తన పుష్పక విమానంలో బ్రుఘుండి అనే వినాయకుడి గొప్ప భక్తుడైన ఋషి దగ్గరనుండి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్ సేన్ అనే రాజ్యం దాటే సమయంలో, అనేక పాపలు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమామంపైకి దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపడిన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్బుతాన్ని ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆగిందో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు 'ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్థాంతరంగా ఆగింది' అని చెప్పాడు. అప్పుడు అ రాజు 'అయ్యా! మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది?' అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో, వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది'అని చెప్పాడు. సైనికులు అందరూ కలిసి రాజ్యం అంతా తిరిగారు ఒక్కరు కూడా చతుర్థి రోజున ఉపవాసం చేసిన వారు కనపడక పోతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ వీరి కంఠబడలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళుతున్నారు అని ప్రశ్నించారు. దానికి ఆ గణేశ దూత 'నిన్న అంతా ఈ స్త్రీ ఉపవాసం చేసింది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తరువాత లేచి కొంత తినింది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయంలో నిద్రలేచి కొంత తినటం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టచతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు. అంతే కాకుండా ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని స్వనంద లోకానికి కానీ చేరుకోవడం తథ్యం అని తెలిపాడు. గణేశ దూతని తమకు ఆమె మృతదేహాన్ని ఇవ్వమని ఎంతో బ్రతిమిలాడారు సైనికులు. అలా చేసినట్లయితే పుష్పక విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశ దూత అంగీకరించలేదు. ఆమె దేహం మీదనుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం చేత ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుడి పుష్పక విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టచవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది, వినాయకుడి భక్తులు అందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన!
సంకష్టహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడి చేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణంలో వినాయకుడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మరింత అరుదు.
వ్రత కథ:
పుత్రసంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికోసం ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లు, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లు గణేశ పురాణం తెలుపుకుంది. కృతవీర్యుడు ఈ వ్రతాన్ని పాటించి గణపతి అనుగ్రహంతో కార్తవీర్యార్జుడు వంటి పుత్రుడిని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడు అనే మహారాజు తాను కూడా సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలో ప్రజలను అందరినీ వినాయక లోకానికి తీసుకుని వెళ్ళగలిగినట్లు వ్రతకథ.
సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు:
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
అఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం
ఏకవింశతి నామ పూజ :
ఓం సుముఖాయ నమః మాలతీ పుత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమః జంబూ పత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి
ఓం వటవే హీరంబరాయ నమః సింధువార పత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి
వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలోనే. తులసి పత్రం బదులు జంబూ పత్రం (నేరేడు ఆకు) వాడటం, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడం ఇంతటి మహాపూర్వక సంకటహర చతుర్థి పూజను ఒక్క రోజు ఆచరించిన మాత్రాన గణేశ లోకంలో స్థానాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని కనీసం ఒక్కసారి అయినా నిర్వహించాలని మనవి, పూర్తి వ్రతం చేయలేకపోయినా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రుడికి, చతుర్థీ తిథికి, వినాయకుడికి నమస్కరించి భోజనం చేయండి. ఇది అత్యంత శ్రేయదాయకమైన ముహూర్తం తప్పకుండా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది.
Note: HTML is not translated!