శ్రీ సాయి నవగురువార వ్రతము
శ్రీసాయి గురిచి తెలియని వారెవరూ ఉండరు. కలియుగంలో సద్గురు అవతారం. నేటికీ సమస్త జనులకూ హితం కలిగిస్తూ ఉంటారు. పదహారేళ్ళ వయస్సులో షిర్డీలోని వేపచెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయీ పాటిల్ తో పెళ్ళి ఊరేగింపులో వచ్చి షిర్డీలో కనిపించారు. అప్పటినుంచి చివరి శ్వాస దాకా షిర్డీలోనే ఉన్నారు. దాదాపు అరవై ఏళ్ళు సాయిబాబా అక్కడ నివసించారు. తన జన్మము గురించి చివరిదాకా ఎవరికీ ఏమీ చెప్పలేదు. షిర్డీలో భక్తులు స్థానికుల సమస్యలను పరిష్కరిస్తూ వారికి తగిన సలహాలిస్తూండే వారు. అప్పుడప్పుడు కొన్ని వింతలు, విచిత్రాలు చేసేవారు. అవి చూసిన జనం బాబా మహిమను గుర్తించక తప్పలేదు. శ్రీసాయిబాబా సాధారణ వ్యక్తికాదని, మానవాతీత దివ్యశక్తి అని గ్రహించారు. నేటికీ బాబాను దర్శించాటానికి లక్షలాదిగా భక్తులు షిర్డీకి వెళ్తుంటారు. వారి కోరికలూ తీరుతుంటాయి. ప్రత్యక్షంగా బాబా సన్నిధికి వెళ్ళి తమ కోరికలు తెలుపుకోవడానికి ఆశక్తులైనవారు - శ్రీసాయిని శ్రద్ధాభక్తులతో స్మరించి నవగురువార వ్రతం ఆచరించి, తమ దుఃఖాలు పోగొట్టమని కోరికలు తీర్చమని ప్రార్థించి సఫలీకృతులవుతారు. బాబా తన భక్తులబాధలను దూరం చేసి, మనశ్శాంతి ప్రసాదిస్తారు. మీ కష్టాల విముక్తికీ షిర్డీసాయిబాబా నవగురువార వ్రతం ఆచరించి సుఖశాంతులు పొందవచ్చును.
శ్రీసాయి నవగురువార వ్రత కథ
పూణా పట్టణంలో రుక్మిణి, విఠల్ అనే దంపతులు నివశించేవారు. విఠల్ కోపిష్టి, అందువలన అతనితో పరిచయమున్నవారు ఇబ్బంది పడేవారు, రుక్మిణి చాలా నెమ్మదస్తురాలు. శ్రీసాయిబాబాను నమ్ముకొని ఉన్నది. కొంత కాలానికి విఠల్ వస్త్రవ్యాపారంలో నష్టం వచ్చి, వ్యాపారం మూతపడే స్థితి వచ్చింది. దీనితో విఠల్ కు కోపం ఇంకా పెరిగి, ప్రతిదానికి రుక్మిణిని విసుక్కోవడం చేసేవాడు. ఇళ్ళు నరకంలా మారింది. ఒక గురువారం మధ్యాహ్నం హారతి సమయంలో రుక్మిణి ఇంటికి ఒక ఫకీరు వచ్చి, భిక్ష కోసం యాచించాడు. రుక్మిణి అతనికి భిక్ష అందజేస్తూ ఫకీరు ముఖంలో ప్రసన్నతను చూసింది. ఆ ఫకీరు శ్రీసాయి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడు ఉంటాయి. చింతించవలదు అని ఆశీర్వదించాడు. ఈ మాటాలు వినగానే రుక్మిణి కన్నీరు పెట్టుకుంది. ఆమె బాధను గ్రహించిన ఫకీరు అమ్మా నీవు తొమ్మిది గురువారాలు శ్రీసాయిని పూజించు. పూజా మహత్యం వల్ల నీ ఇంటి పరిస్థితులన్నీ చక్కబడతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి గురువారం నుండి రుక్మిణి తొమ్మిది గురువారాల సాయివ్రతం ప్రారంభించింది. అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది గురువారాలు పూజ చేసి, చివరివారం ఉద్యాపన చేసి, తోమ్మిదిమందికి భోజనం పెట్టి, తొమ్మిది సాయివ్రత పుస్తకాలను బంధువులకు, స్నేహితులకు పంచి పెట్టింది. క్రమంగా విఠల్ స్నేహితుడి ధనసహాయం వల్ల అతనికి వ్యాపారం అభివృద్ధి చెందింది. వారి ఇంట సుఖసంతోషాలు తిరిగి వచ్చాయి.
వ్రతం ఆచరిస్తున్న సమయంలో రుక్మిణి ఇంటికి బొంబాయి నుండి తోడికోడలు, బావగారు వచ్చారు. తోటికోడలు రుక్మిణితో మాట్లాడుతూ తన పిల్లలు ఈ మధ్య చదువులో వెనుకబడ్డారని బాధపడింది. రుక్మిణి శ్రీసాయి నవగురువార వ్రతం ఆచరించమని చెప్పి వ్రతవిధానం మరియు ఉద్యాపన చెప్పింది.
కొన్నాళ్ళ తరువాత రుక్మిణితో తన తోడికోడలి నుండి శ్రీసాయి నవగురువారవ్రతం ఆచరించడం వలన పిల్లలు బాగా శ్రద్ధగా చదువుతున్నారని, ఈ విధానము తన స్నేహితురాలు కూడా ఆచరించడం వలన ఇష్టమైన వ్యక్తితో వివాహం జరిగిందని, తన ఎదురింట్లో ఒక నగ కనిపించకుండా పోయినందుకు ఈ వ్రతం ఆచరించగానే నగ మళ్ళీ తిరిగి దొరకినది అని, వ్రతమహత్యం చాలా గొప్పదనీ సమాచారం అందజేసింది.
నవగురువార శ్రీసాయి వ్రతఫల మహత్యాలు
► బొంబాయిలో ఒక చిన్న నటుడికి కుటుంబం గడపడం చాలా కష్టంగా ఉండేది. అతని భార్య నవ గురువార వ్రతం పూర్తి చేయగానే అతనికి టీ.వీ. సేరియల్స్ లో, చలనచిత్రాలలో అవకాశాలు రావడం ప్రారంభించాయి.
► ఎమ్.సి.ఎ. చదివిన ఒక యువకుడు పూణా నగరానికి ఉద్యోగం కోసం వచ్చి, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతనికి ఉద్యోగం మాత్రం లభించలేదు. బాధతో ఈ విషయాన్ని తల్లి తెలుపగా, ఆమె బాబాకు మ్రోక్కుకుని నవగురువార వ్రతం ప్రారంభించింది, వ్రత ఉద్యాపన రోజున ఆమె కుమారుడికి ఉద్యోగం వచినట్లుగా తెలియవచ్చింది.
► లాయరు వృత్తి చేయుచున్న ఒక యువతికి, ఎన్ని సంబంధాలు చూసినా వివాహం జరగడం లేదు. ఆమె ఒక రోజు బాబా గుడికి వెళ్ళినప్పుడు నవగురువర వ్రతం గురించి వింది. తరువాత ఆమె స్వయంగా ఆ వ్రతం ఆచరించింది. తరువాత ఆమెకు సౌమ్యుడు మంచివాడు అయిన యువకుడితో వివాహ జరిగింది.
►అహ్మద్ నగర్ నివాసి అయిన నీలాదేవి అనే ప్రభుత్వ ఉదోగినికి ఒకసారి బదలీపై ఒక మారుమూల గ్రామానికి వేశారు. ఆమె తన తల్లిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచవలసి ఉండడం వల్ల ఆమె తన బదలీని ఆపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు సరికదా 15 రోజులలో వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరాలి అని ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు వచ్చింది. ఆమె నవగురువర వ్రతం ఆచరించడం ప్రారంభించింది. రెండవ వారం చేయగానే ఆమెకు అహ్మద్ నగర్ లోని వేరొక కార్యాలయానికి మార్చబడినట్లుగా ఉత్తర్వులు వచ్చాయి. ఆమె ఎంతో కృతజ్ఞతతో నవగురువార వ్రతం పూర్తికాగానే షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంది.
►వైద్యవిద్య అభ్యసిస్తున్న కుమారి రూప అనే ఆమె మొదటి రెండు సంవత్సరాలు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు అయింది. మూడవ సంవత్సరం వచ్చేసరికి శారీరక అనారోగ్య కారణాల వలన జ్ఞాపకశక్తి తగ్గి చదువులో వెనుకబడసాగింది. ఆమె దిగులుతో తన తల్లిదండ్రులతో తెలపగా వారు ఆమెను తొమ్మిది గురువారాలు బాబా పూజ చేయమని, తరువాత బాగా చదవగలవని ధైర్యం ఇచ్చారు. తరువాత ఆమె తన తల్లిదండ్రులు తెలిపిన విధంగా చేయగా, ఆమె బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలు అయింది.
►నివాస్, చందన్ లకు వివాహం అయి పది సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. చందన్ అత్తవారింట సూటీపోటీ మాటలతో చాలా బాధపడేది. ఒకరోజు నివాస్ తన సహోద్యోగి కార్యాలయంలో స్వీట్లు పంచి పెడుతుండగా కారణం అడిగింది. అతను తనకు చాలా సంవత్సరాల తరువాత నవగురువార వ్రతం ఆచరించగా సంతానం కలిగింది అని తెలిపాడు. నివాస్ ఆ వివరాలు అన్నీ తెలుసుకొని చందన్ కు తెలుపగా, ఆమె కూడా ఆ వ్రతాన్ని చేసింది. కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చి, ఆడపిల్లను ప్రసవించింది.
► లాల్ అనే వ్యక్తి వ్యాపార నిమిత్తమై వెళుతుండగా వెనుకనుండి ట్రాక్టరు వచ్చి తగిలి మొకాలిలో దెబ్బ తగిలింది. వైద్యుడికి చూపించగా ఆపరేషను చేయాలని చెప్పాడు. కాని భయంతో ఆపరేషను చేయించుకోలేదు. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని భావించి, నెలరోజులు విశ్రాంతి తీసుకున్నా కానీ కాలినొప్పి తగ్గలేదు. కాని తన బంధుమిత్రులతో నాలుగు నెలలలో షిరిడీ, కేదారానాథ్ యాత్ర నిర్ణయించబడింది. తనకు యాత్రకు వెళ్ళే అదృష్టం లేదేమో అని బాధపడుతూ, ఓపిక చేసుకుని బాబా గుడికి వెళ్ళి బాబాను దుఃఖంతో ప్రార్థిస్తుండగా , పూజారి వచ్చి నవగురువార వ్రత పుస్తకాన్ని ఇచ్చి ఆ వ్రతం చేసినట్లయితే దుఃఖాలు అన్నీ తొలిగిపోతాయి అని తెలిపాడు. లాల్ వెంటనే నవగురువార వ్రతం ఆచరించాడు. వ్రతం పూర్తి అయ్యే రోజుకి కాలినొప్పి తగ్గి, తన వారితో యాత్ర సుఖవంతంగా సాగించాడు.
► కౌశిక్ అనే వ్యక్తి గుండె నొప్పితో బాధపడుతూ డాక్టరుకు చూపించగా ఆపరేషన్ చేయవలసి ఉంది అని తెలిపాడు. అతను వెంటనే షిరిడీ వెళ్ళి తన బాధను తొలగించమని బాబాను వేడుకుంటుండగా, ఒక ఫకీరు వచ్చి నవగురువార వ్రత పుస్తకాన్ని ఇచ్చి ఆచరించమని, అంతా మంచే జరుగుతుందని తెలిపాడు. కౌశిక్ వెంటనే షిరిడీ నుండి వచ్చి, నవగురువార వ్రతం పూర్తయ్యాక మాత్రమే ఆపరేషన్ చేయించుకుంటాను అని తెలిపి వ్రతం ఆరంభించాడు. వ్రతం పూర్తయ్యాక డాక్టరు దగ్గరికి వెళ్ళగా ఆపరేషన్ అవసరం లేదనీ మందులతో తగ్గిపోతుందని తెలిపాడు.
► నాసిక్ జిల్లా లక్ష్మీబాయి అనే ఆమెకు కుమారుడు కలిగాడు. వారి ఇంటి పురోహితుడు బాబును చూసి బాలారిష్ట దోషం ఉందని తెలిపాడు. ఆమె వారు చెప్పిన పూజలు అన్నీ చేసింది. మరియు బాబా నవగురువార వ్రతం ఆరంభించింది. వ్రతం చివరి రోజున బాబు ఊయల నుండి క్రిందపడగా, పరుగెత్తికుంటూ వెళ్ళి బాబును తీసుకుని సవరించగా బాబులో కదలిక వచ్చి ఏడ్చాడు. ఆనందంతో బాబా దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ బాబా విగ్రహం చూడగా, బాబా విగ్రహం కాలు విరిగి కనిపించింది. ఆమె ఆర్థ్రమైన హృదయంతో పదేపదే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ విధంగా బాబా, ఆ బాలుడి దోషాన్ని తాను స్వీకరించాడు.
Note: HTML is not translated!