Saibaba satcharitra 10 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

పదవ అధ్యాయం

ఎల్లవేళలా శ్రీసాయిబాబాను భక్తిప్రేమలతో జ్ఞాపకం ఉంచుకో. ఎలాగంటే బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపంలోనే లీనమై, అందరికీ హితం చేయడానికే నిమగ్నమై ఉండేవారు. వారి స్మరణమే జీవన్మరణ రూపమైన సంసారమనే చిక్కుముడిని విప్పే తరుణోపాయం. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్ఠమైన, సులభతరమైన సాధనం. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా మన దేహ ఇంద్రియాలలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిముషాన్ని ఈ సాధనం చేయడానికి వెచ్చించాలి. ఇతర దేవతలు అంతా ఉత్త భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణాలను నమ్మి కొలిస్తే వారు మన అదృష్టాన్ని బాగుచేయగలరు. వారిని శ్రద్ధగా సేవిస్తే సంసార బంధాల నుండి తప్పించుకోగలం. న్యాయమీమాంస వాటి షడ్ధర్మాలను చదివే పనిలేదు. మన జీవితం అనే ఓడకు సద్గురువు సరంగుగా చేసుకుంటే కష్టాలు, చింతలతో కూడుకున్న సంసారమనే సాగరాన్ని మనం సులభంగా దాటగలం. సముద్రాలు,  నదులు దాటుతున్న సమయంలో మనం ఓడ నడిపేవాడిలో నమ్మకాన్ని ఉంచినట్లే, సంసారమనే సాగరాన్ని దాటడానికి సద్గురు అనే సరంగుపై  పూర్తి నమ్మకాన్ని ఉంచుకోవాలి. భక్తుల యొక్క అంతరంగంలో ఉన్న భక్తిప్రేమలను బట్టి, సద్గురువు వారికి జ్ఞానాన్ని, శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తారు. పోయిన అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటన, కొందరు భక్తుల అనుభవాలు మొదలైనవి చెప్పాను. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివశించారు? ఎలా జీవించారు? ఎలా శయనించేవారు? భక్తులకు ఎలా బోధిస్తూ ఉండేవారు? మొదలైనవి చెబుతాను.

బాబావారి శయనలీల

మొట్టమొదట బాబా ఎక్కడ పడుకునేవరో, ఎలా పడుకునోవారో చూద్దాం. ఒకసారి నానాసాహెబు డేంగలే, సుమారు నలుగుమూరాల పొడవు, ఒక జానెడు మాత్రమే వెడల్పు ఉన్న ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చారు. ఆ బల్లను నేలపై వేసుకుని పడుకోవడానికి కాకుండా, బాబా దాన్ని మసీదు దూలానికి ఊయలలా వ్రేలాడేలా చినిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి, దానిపై పడుకోవడం మొదలుపెట్టారు. గుడ్డపీలికలు పలుచగా ఉండేవి, ఏమాత్రం బలమైనవి కాదు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయడమే గగనం. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎలా భారిస్తున్నాయో అనేది ఆశ్చర్య వినోదాలకు హేతువు అయింది. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలగడం నిజంగా బాబా లీలే. బాబా ఆ బల్ల యొక్క నాలుగు మూలలలో నలుగు దీపపు ప్రమిదలు ఉంచి రాత్రి అంతా దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. ఇది ఏమి చిత్రం! బల్లపై ఆజానుబాహువైన బాబా పడుకోవడానికే చోటు చాలనప్పుడు దీపాలు పెట్టడానికి చోటు ఎక్కడిది? అనేకమంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కడం, దిగడం గమనించాలని కనిపెట్టుకుని ఉండేవారు. కాని బాబా ఎవరికీ ఆ వైనాన్ని గురించి తెలియనివ్వలేదు. ఆ వింత చూడడానికి జనాలు గుంపులు గుంపులుగా గుమిగూడడంతో బాబా విసుగుచెంది ఒకరోజు ఆ బల్లను విరిచి పారేశారు. అష్టసిద్ధులు బాబా ఆధీనాలు. బాబా వాటిని ఉపేక్షించలేదు, వాటి కోసమే అభ్యాసం చేయలేదు. వారు పరిపూర్ణులు కాబట్టి సహజంగానే అవి వారికి సిద్ధించాయి.

బ్రహ్మము యొక్క సగుణావతారము

సాయిబాబా మూడున్నర మూరల మానవదేహంతో కనిపించినా వారు సర్వహృదయంతరస్థులు. అంతరంగంలో వారు పరమ నిరీహులు, నిస్ప్రుహులు అయినప్పటికీ, బాహ్యానికి లోకహితం కోరేవారిగా కనిపించేవారు. అంతరంగంలో వారు మమకార రహితులు అయినప్పటికీ, బాహ్యదృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాల కోసం ఎంతగానో తాపత్రయపడుతున్న వారిలా కనిపించేవారు. వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టయినా, బయట దయ్యంలా నటిస్తూ ఉండేవారు. లోపల అద్వైతి అయినా బయటకు ప్రపంచంలో ఉన్నట్లు కనిపిస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూసేవారు. ఇంకొక్కప్పుడు వారిపై రాళ్ళు విసురుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిడ్తూ ఉండేవారు. ఇంకొక్కప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని, ఎంతో నెమ్మదిగా, శాంతంగా, ఓపికగా సంయమనంతో వ్యవహరిస్తుండేవారు. బాబా ఎప్పుడూ ఆత్మనుసంధానంలోనే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యాన్ని చూపిస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకే ఆసనంలో స్థిరంగా ఉండేవారు. వారు ఎక్కడికీ ప్రయాణాలు చేసేవారు కాదు. చిన్న చేతికర్ర (సటకా)యే వారు సదా ధరించే దండం. చింతారహితులై ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. సిరిసంపదలనుగానీ, కీర్తిప్రతిష్టలుగాని లక్ష్యపెట్టకుండా, భిక్షాటనతో నిరాడంబరంగా జీవించేవారు. అలాంటి పావన జీవులు వారు. ఎల్లప్పుడూ బాబా 'అల్లామలిక్' (భగవంతుడే యజమాని) అని అంటూ ఉండేవారు. భక్తులలో అవిచ్చమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి వుండేవారు. ఆత్మజ్ఞానానికి అయన గని, దివ్యానందానికి వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్యస్వరూపం అలాంటిది. ఆద్యంతాలు లేనటువంటిది. అక్షయం వంటిది, భేదరహితమైనటువంటిది. విశ్వమంతా ఆవరించినటువంటిది. ఆ పరబ్రహ్మ తత్త్వమే సాయిబాబాగా అవతరించింది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగారు, గ్రహించగలుగుతుండే వారు. సాయిబాబా యొక్క నిజతత్త్వాన్ని గ్రహించలేక, వారిని ఒక సామాన్య మానవునిగా అనుకున్నవారు నిజంగా దురదృష్టవంతులు.

షిరిడీలో బాబా నివాసము - వారి జన్మతేదీ

బాబా యొక్క తల్లిదండ్రుల గురించిగాని, వారి సరైన జన్మ తేదీగాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో వున్న కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చు. బాబా 16 సంవత్సరాల ప్రాయంలో షిరిడీ వచ్చి మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నారు. హఠాత్తుగా అక్కడినుండి అదృశ్యమై, కొంతకాలం తరువాత నిజాము రాజ్యంలోని ఔరంగాబాదు సమీపంలో కనిపించరు. 20 సంవత్సరాల ప్రాయంలో చాంద్ పాటిల్ పెళ్ళి గుంపుతో షిరిడీ చేరుకున్నారు. అప్పటినుండి 60 సంవత్సరాలు షిరిడీ వదలకుండా అక్కడే ఉండి, 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. దీనిని బట్టి బాబా సుమారు 1838 వ సంవత్సర ప్రాంతంలో జన్మించి ఉంటారని భావించవచ్చు.

బాబా లక్ష్యము వారి బోధలు

17వ శతాబ్దంలో రామదాస అనే యోగిపుంగవుడు (1608-81) వర్థిల్లాడు. గోబ్రాహ్మణులను, మహమ్మదీయులనుండి రక్షించే లక్ష్యాన్ని వారు చక్కగా నిర్వర్తించారు. వారు మృతిచెందిన 200 యేండ్ల తరువాత హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలింది. వారి మధ్య సమైక్యతా భావాన్ని నెలకొల్పడానికే సాయిబాబా అవతరించారు. ఎల్లప్పుడూ వారు చెప్పే హితవు 'హిందువుల దైవమైన శ్రీరాముడు, మహమ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే. వారిద్దరి మధ్య ఏమీ భేదం లేదు. అలాంటప్పుడు వారి భక్తులు వరిలో వారు కలహించుకోవడం ఎందుకు? ఓ అజ్ఞానులారా! చేతులు చేతులు కలిపి రెండు జాతులవారు కలిసి మెలిసి ఉండండి. బుద్ధితో ప్రవర్తించండి. జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చండి, ఇతరులతో పోటీ పడకండి. మీ యొక్క వృద్ధిని మేలును చూసుకోండి. భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యోగం, త్యాగం, తపస్సు, జ్ఞానం, మోక్షానికి మార్గాలు. వీటిలో ఏదైనా అవలంభించి మోక్షాన్ని సంపాదించకపోతే మీ జీవితమూ వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేస్తే, ప్రత్యపకారం చేయకండి. ఇతరుల కోసం మీరు ఏమైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి.' సంగ్రహంగా ఇదే బాబా యొక్క ప్రబోధం, ఇది యిహపరసాధనం.

సాయిబాబా సద్గురువు

గురువులమని చెప్పుకొని తిరిగేవారు అనేకమంది ఉన్నారు. వారు ఇంటింటికీ తిరుగుతూ వీణ, చిడతలు చేతబట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరాన్ని చాటుతారు. శిష్యుల చెవులలో మంత్రాలు ఊది వారినుండి ధనాన్ని లాగుతారు. పవిత్రమార్గాన మతాన్ని బోధిస్తామని చెబుతారు. కాని మతం అంటే వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎప్పుడూ ప్రదర్శించాలని అనుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రం ఉండేది కాదు. కాని భక్తులలో అమితమైన ప్రేమ ఉండేది. నియత గురువులని, అనియత గురువులని గురువులు రెండు విధాలు. నియత గురువులంటే సమయానుకూలంగా నియమించబడతారు. నియత గురువులంటే సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహా యిచ్చి మన అంతరంగంలో ఉన్న సుగుణాన్ని వృద్ధిచేసి మోక్షమార్గంలో నడిచేలా చేసేవారు. నియత గురువుల సహవాసం 'నీవు నేను' అనే ద్వంద్వభావాన్ని పోగొట్టి, అంతరంగాన్ని  యోగంలో ప్రతిష్టించి 'తత్వమసి' అయ్యేలా చేస్తుంది. సర్వవిధాల ప్రపంచ జ్ఞానాన్ని బోధించే గురువులు అనేకమంది ఉంటారు. కాని మనల్ని  ఎవరయితే సహజస్థితిలో నిలిచేలా చేసి మనల్ని ప్రపంచపు ఉనికికి అతీతంగా తీసుకుని వెళతారో వారే సద్గురువులు. సాయిబాబా అలాంటి సద్గురువులు. వారి మహిమ వర్ణానాతీతం . ఎవరైనా వారిని దర్శిస్తే బాబా వారి యొక్క భూత భవిష్యత్, వర్తమానాలన్నిటినీ చెప్పేవారు. ప్రతి జీవిలో బాబా దైవత్వాన్ని చూసేవారు. స్నేహితులు. విరోధులు వారికి సమానమే. నిరభిమానం సమత్వం వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరాలను కూడా తీర్చేవారు. కలిమిలేములు వారికి సమానం. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ, దేహం పట్ల అభిమానం ఉండేది కాదు. శరీరదారులవలె కనిపించినా వారు నిజంగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవంతుడిలా పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తింటున్నా, త్రాగుతున్నా తమ దొడ్లలోనో, పోలాలలోనో పనిచేసుకుంటున్నా, వారు ఎల్లప్పుడూ సాయిని జ్ఞాపకం ఉంచుకుని సాయి మహిమను కీర్తిస్తూ ఉండేవారు. సాయి తప్ప ఇంకొక దైవాన్ని వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. వారు పామరులు అయినప్పటికీ వారికి వున్నస్వల్ప భాషాజ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకుంటూ ఉండేవారు. వారికి అక్షరజ్ఞానం శూన్యం అయినప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వాన్ని చూడవచ్చును. యదార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమవలన వెలువడుతుంది. కవిత్వం స్వచ్చమైన ప్రభావం నుండి వెలువడుతుంది. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలు అన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడు అయినా వీటిని శ్రీసాయిలీల పత్రికలోనో లేదా పుస్తకరూపంలోనో ప్రకటించిన ఎంతో బాగుంటుంది.

 

బాబావారి అణుకువ

 

భగవంతునికి ఆరు లక్షణాలు ఉంటాయి. (1) కీర్తి, (2) ధనం (3) అభిమానాలు లేకపోవడం (4) జ్ఞానం (5) మహిమ (6) ఔదార్యం. ఈ గుణాలు అన్నీ బాబాలో ఉన్నాయి. భక్తుల కోసం మానవరూపంలో అవతరించిన భగవతత్త్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహం అద్భుతాలు. వారే కరుణతో భక్తులను తమ దగ్గరికి  చేర్చుకొనకపోతే వారి మహత్యాన్ని తెలుసుకోగల శక్తి ఎవరికి వుంది. భక్తుల కోసం బాబా నోటి నుండి వెలువడిన పలుకులు పలకడానికి సరస్వతీదేవి కూడా వెరగు చెందుతుంది. ఒక ఉదాహరణ, బాబా అమిత అణుకువతో ఇలా అనేవారు 'బానిసలకు బానిస అయిన నేను మీకు ఋణగ్రస్తుడను. మీ దర్శనంతో నేను తృప్తిచెందాను. అలా అవడం వలన నేను ధన్యుడను' ఏమి వారి అణుకువ! బాబా యొక్క ఈ వాక్యాలు ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచానని ఎవరైనా అంటే ఈ నా అపరాధాన్ని బాబాను క్షమాపణ కోరుకుంటాను. అటువంటి పాప పరిహార్థమై బాబా నామజపం చేస్తాను. బాహ్యదృష్టికి బాబా ఇంద్రియ విషయాలను అనుభవించేవాడిలా కనిపించినా, ఇంద్రియ అనుభవాలలో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు. వారు భుజిస్తున్నప్పటికీ ఎందులోనూ వారికి రుచి ఉండేదికాదు. వారు ప్రపంచాన్ని చూస్తున్నట్టు కన్పించినా వారికి దానిలో ఏమాత్రం ఆసక్తి ఉండేదికాదు. కాకం అంటే వారు హనుమంతునిలా అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనిలోనూ మమకారం ఉండేది కాదు. వారు శుద్ధ చైతన్య పురుషులు. కోరికలు, కోపం మొదలైనవి భావి వికారాలు శాంతించి, స్వాస్థ్యం చెందే విశ్రాంతి ధామం. వెయ్యేళ్ళ వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీన్ని వివరించడానికి ఒక ఉదాహరణ.

నానావళి : షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు నానావళి. అతను బాబా విషయాలను, పనులకు చెక్కబెడుతూ ఉండేవాడు. ఒకరోజు తను బాబా దగ్గరికి వెళ్ళి, బాబాను వారి గద్దె (ఆసనం)నుండి లేవాలని, దానిపై తాను కూర్చోవాలని తనకు బుద్ధి పుట్టిందని అన్నాడు. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశారు. నానావళి దానిపై కొంతసేపు కూర్చుని లేచి, బాబాను తిరిగి కూర్చోమని చెప్పాడు. బాబా తన గద్దెపై కూర్చున్నారు. నానావళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. తన గద్దె మీదనుండి దిగిపోమన్నా, దానిపై యింకొకరు కూర్చున్నా, బాబా ఎలాంటి అసంతృప్తి వెలిబుచ్చలేదు. బాబాని, నానావళి ఎంతగా ప్రేమించేవాడు అంటే అతను బాబా మహాసమాధి చెందిన పదమూడవరోజు దేహత్యాగం చేశాడు.

మహాత్ముల కథాశ్రవణం, వారి సాంగత్యమే అతి సులభ మార్గము

సాయిబాబా సామాన్య మనవునిలా నటించినప్పటికీ, వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధికుశలతలు కలవారని తెలుస్తుంది. వారు చేసేది అంతా తమ భక్తుల మేలు కోసమే. వారు ఆసనాలుగాని, యోగాభ్యాసాలు గానీ, మంత్రోపదేశాలుగానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కనపెట్టి 'సాయి సాయి' అనే నామాన్ని మాత్రం జ్ఞాపకం ఉచుకోమని తెలిపారు. అలా చేస్తే వారు సర్వ బంధాలనుండి విముక్తులై, స్వాతంత్ర్యం పొందుతారు అని చెప్ప్పారు. పంచాగ్నుల మధ్య కూర్చోవడం, యాగాలు చేయడం, మంత్రజపం చేయడం, అష్టాంగ యోగాలు మొదలైనవి బ్రాహ్మణులకే వీలుపడుతుంది. మిగిలిన వర్ణాల వారికి అవి ఉపయోగపడేవే కావు. ఆలోచించడమే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిముషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞాపకానికి తెస్తే దానినే చింతిస్తూ ఉంటుంది. గురువును జ్ఞాపకానికి తెస్తే గురువునే చింతిస్తూ ఉంటుంది. మీరు సాయిబాబా యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని శ్రద్ధగా విన్నారు. ఇదే వారికి జ్ఞాపకం ఉంచుకోవడానికి సహజమైన మార్గం. ఇదే వారి పూజ, కీర్తన. మహాత్ముల కథలను వినడం పైన చెప్పిన ఇతర సాధనాలలా కష్టమైనది కాదు. ఇది అత్యంత సులభసాధ్యమైనది. వారి కథలు సంసారంలో ఉన్న భయాలు అన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయండి. వాటినే మననం చేసుకోండి. వాటిలోని సారాంశాన్ని జీర్ణించుకోండి. ఇంతమాత్రం చేస్తే బ్రాహ్మణులే కాక స్త్రీ, శూద్రది అన్ని వర్ణాలవారు కూడా పవిత్రులు అవుతారు. ప్రాపంచిక బాధ్యతలలో ఇరుక్కుని ఉన్న మీ మనస్సును సాయిబాబాకి అర్పించండి. వారి కథలు వినండి. వారు తప్పకుండా మనల్ని అనుగ్రహించగలరు. ఇది అత్యంత సులభ ఉపాయం. అయినా మరి దీన్ని ఎందుకు అందరూ అవలంభించ లేకపొతున్నారు? అని అడగవచ్చు. కారణం ఏమిటంటే, భగవంతుని కృపాకటాక్షం లేకపోతే మహాత్ముల చరిత్రలను వినడానికి కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వం నిరాటంకం. సుగమం అవుతుంది. మహాత్ముల కథలు వినడం అంటే వారి సాంగత్యం చేయడమే. మహాత్ముల సాంగత్యంతో కలిగే ప్రాముఖ్యం చాలా గొప్పది. అది అహంకారాన్ని, దేహాభిమానాన్ని నశింప చేస్తుంది, హృదయ గ్రంథులను తెగగొడుతుంది. చివరికి శుద్ధ చైతన్య రూపుడిగా భగవంతుని సాన్నిధ్యానికి తీసుకుని వెడుతుంది. విషయ వ్యామోహలలో మనకు గల అభిమానాన్ని తగ్గించి ప్రాపంచిక కష్టసుఖాలలో విరక్తి కలగజేసి పారమార్థిక మార్గంలో నడుపుతుంది. మీకు భగవన్నామ స్మరణం పూజ, భక్తి వంటి యితర సాధనాలు ఏమీ లేకపోయినా, కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయిస్తే చాలు. వారు మనల్ని భవసాగరం నుండి తరింప చేస్తారు. మహాత్ములు అందుకోసమే అవతరిస్తారు. ప్రపంచ పాపాలను తొలగించే గంగా, గోదావరీ, కృష్ణా, కావేరీ మొదలైన పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసే తమని పావనం చేయాలని వాంఛిస్తూ ఉంటాయి. మహాత్ముల మహిమ అలాంటిది. మన పూర్వజన్మ సుకృతంతో మనకు సాయిబాబా పాదాలను ఆశ్రయించే భాగ్యం లభించింది. మసీదు గోడకు ఆనుకుని ఊదీ మహాప్రసాదాన్ని తన భక్తుల యోగక్షేమాల కోసం పంచిపెట్టే సుందరస్వరూపుడూ, ఈ ప్రపంచం యొక్క అభావాన్ని చింతించువాడూ, సదా పూర్ణానందంలో మునిగి ఉండేవాడూ సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను.

పదవ అధ్యాయం సంపూర్ణం

పదకొండవ అధ్యాయం

0 Comments To "Saibaba satcharitra 10 Adhyayam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!