Saibaba Satcharitra 26 Adyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఆరవ అధ్యాయం

1. భక్త పంతు 2. హరిశ్చంద్ర పితలే 3. గోపాల అంబాడేకర్ ల అనుభవాలు

ఈ విశ్వంలో కనిపించే ప్రతివస్తువు కేవలం భగవంతుడి మాయతో సృష్టించబడింది. ఈ వస్తువులు నిజంగా ఉండలేదు. నిజంగా వుండేది ఒక్కటే, అదే భగవంతుడు. చీకట్లో తాడును కానీ, దండాన్ని కాని చూసి పాము అనుకున్నట్లు, ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యానికి కనిపించేలా కనిపిస్తుంది. కాని అంతర్గతంగా ఉన్న సత్యం తెలుసుకోలేము. సద్గురువే మన బుద్ధి అనే అక్షులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూసేలా చేస్తాడు. మనకు కనిపించనిది నిజస్వరూపం కాదు అని గ్రహిస్తాము. కాబట్టి సద్గురువు అసలయిన దృష్టిని కలగచేయమని ప్రార్థిద్దాంగాక! అదే సత్యదృష్టి.

ఆంతరిక పూజ : హేమాడ్ పంతు మనకి ఒక కొత్తరకం పూజావిదానాన్ని బోధిస్తున్నారు. సద్గురువు పాదాలు కడగడానికి ఆనందభాష్పాలు అనే వేడినీళ్ళను ఉపయోగిద్దాం గాక! స్వచ్చమైన ప్రేమ అనే చందనాన్ని వారి శరీరానికి పూద్దాముగాక! దృఢవిశ్వాసం అనే వస్త్రంతో వారి శరీరాన్ని కప్పుదాముగాక! ఏకాగ్రచిత్తంతో ఫలాన్ని సమర్పించేదెముగాక! భావం అనే బుక్కా వారి శరీరంపై జల్లి భక్తి అనే మొలత్రాడుని కట్టుదముగాక! మన శిరస్సును వారి బొటన వ్రేళ్ళపై ఉంచుదాముగాక! సద్గురువుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వాన్ని వారికి సమర్పింతుముగాక! అలాంటి ఆనందకరమైన పూజ చేసిన తరువాత ఇలా ప్రార్థించెదముగాక!

‘మా మనస్సును అంతర్ముఖం చేయి. దాన్ని లోపలివైపు వెళ్తున్నట్లు చేయి. నిత్యానిత్యాలకు ఉన్న తారతమ్యాన్ని తెలుసుకునే శక్తిని దయచేయి. ప్రపంచ వస్తువులలో మాకు ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలిగేలా చేయి. మేము మా శరీరాన్ని, ప్రాణాన్ని, సర్వాన్ని నీకు సమర్పిస్తాము. సుఖదుఃఖాల అనుభవాలు కలగకుండా ఉండేలా మా కళ్ళు నీవిగా చేయి. మా చంచల మనస్సు నీ పాదాల దగ్గర విశ్రాంతి పొందుగాక!’ ఇక ఈ అధ్యాయంలోని కథలవైపు కదులుదాం.

భక్త పంతు

ఒక రోజు పంతు అనే భక్తుడు, మరొక సద్గురువు శిష్యుడు అదృష్టవశాత్తు షిరిడీకి వచ్చారు. అతనికి షిరిడీకి వెళ్ళే కోరిక లేదు. కాని తను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు. అతడు బి.బి.అండ్ సి.ఇ. రైల్వేలో వెళుతున్నాడు. అందులో అనేకమంది స్నేహితులు, బంధువులు కలిశారు. వారందరూ షిరిడీకి వెళుతున్నారు. వారు అందరూ తమ వెంట రమ్మని కోరగా అతను వారికి కాదని చెప్పలేకపోయాడు. వారు బొంబాయిలో దిగారు. పంతు విరార్ లో దిగారు. అక్కడ తన గురువును దర్శించి, షిరిడీకి వెళ్ళడానికి అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తం డబ్బును సమకూర్చుకుని అందరితో కలిసి షిరిడీకి వచ్చారు. అందరూ ఉదయమే షిరిడీకి చేరుకొని 11 గంటలకు మసీదుకు వెళ్ళారు. బాబా పూజ కోసం చేరిన భక్తుల గుంపును చూసి అందరూ ఎంతగానో సంతోషించారు. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రిందపడిపోయాడు. బంధువులు, స్నేహితులు అక్కడి భక్తులు అందరూ భయపడ్డారు. అతన్ని మేల్కొల్పడానికి ప్రయత్నించారు. అతని ముఖంపై నీళ్ళు చల్లగా బాబా కటాక్షంతో తెలివి వచ్చింది. నిద్రనుండి లేచినవాడిలా లేచి కూర్చున్నాడు. సర్వజ్ఞుడు అయిన బాబా అతను వేరొక గురువు తాలూకు శిష్యుడు అని గ్రహించి, నిర్భయంగా ఉండమని ధైర్యం చెపుతూ తన గురువులోనే భక్తి నిలిచేలా ఈ క్రింది విధంగా పాలికారు 'ఏమైనా కానివ్వండి. పట్టు విడవకూడదు. నీ గురువులోనే ఆశ్రయం నిలుపుకో. ఎల్లప్పుడూ నిలకడగా ఉండు. ఎప్పుడు వారి ధ్యానంలోనే మునిగి ఉండు. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించారు. ఈ విధంగా తన సద్గురువుని జ్ఞాపకం తెచ్చుకున్నారు. తను తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు.

హరిశ్చంద్ర పితలే

బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనే అతను ఉన్నాడు. అతనికి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కొడుకు ఒకడు ఉన్నాడు. ఇంగ్లీషు మందులని, ఆయుర్వేదం మందులని కూడా వాడారు కానీ జబ్బు మానలేదు. కాబట్టి యోగుల పాదాలపై పడటం ఒక్కటే మిగిలింది. 15వ అధ్యాయంలో చక్కని కీర్తనలతో దాసగుణు బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలొ వెల్లడి చేశారని తెలుసుకున్నాం. 1910లో పితలే అలనాటి కథలు కొన్నింటిని విన్నాడు. వారినుండి, ఇతరులు చెప్పినదాని నుండి బాబా తన దృష్టి చేత, స్పర్శ చేత బాగుపడని జబ్బులను బాగుచేస్తారని గ్రహించారు. సాయిబాబాను చూడటానికి మనస్సులో కోరిక పుట్టింది. సర్వవిధాలా సన్నాహమై, బహుమతులను వెంట తీసుకుని పళ్ళబుట్టలను పట్టుకుని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చారు. అతను మసీదుకి వెళ్ళారు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. తన రోగి కొడుకును బాబా పాదాలపై పడేశారు. బాబా ఆ బిడ్డవైపు చూడగానే ఒక వింత జరిగింది. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున త్రిప్పి స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. అతని నోటివెంట చొంగ కారింది. అతని శరీరం చెమట పట్టింది. అతను చచ్చివాడిలా పడిఉన్నాడు. దీన్ని చూసి తల్లిదండ్రులు బాధపడ్డారు. అటువంటి మూర్ఛలు వచ్చేవి కానీ ఈ మూర్ఛ చాలాసేపటివరకూ ఉంది. తల్లి కంటనీరు వరదలుగా కారుతున్నాయి. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆమె స్థితి దొంగలనుండి తప్పించుకోవాలని ఒక గృహంలోకి పరుగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాడి చేతిలో పడిన ఆవులా, ఎండతో బాధపడి చెట్టు నీడకు వెళ్ళగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయానికి వెళ్ళగా అది వాడిపై కూలిపోయినట్లు ఉంది.

ఆమె ఇలా ఏడుస్తుండగా బాబా ఆమెని ఇలా ఓదార్చారు 'ఇలా ఏడవకూడదు. కొంతసేపు ఆగు. ఓపికతో ఉండు. కుర్రవాణ్ణి బసకు తీసుకుని వెళ్ళు. అరగంటలో వాడికి స్పృహ వస్తుంది.’ బాబా చెప్పిన ప్రకారం వారు చేశారు. బాబా మాటలు యథార్థం అయ్యాయి. వాడాలోకి తీసుకుని వెళ్ళగానే కుర్రవాడికి స్పృహ వచ్చింది. పితలే కుటుంబం అంతా సంతోషించారు. వారి సంశయాలు అన్నీ తీరిపోయాయి. పితలే బాబా దర్శనం కోసం భార్యతో మసీదుకు వచ్చారు. వారు బాబా పాదాలకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలను ఒత్తుతూ కూర్చున్నారు. మనస్సులో బాబా చేసిన ఉపకారానికి నమస్కరిస్తూ ఉన్నారు. బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు 'నీ ఆలోచనలు, సంశయాలు, భాయోత్పాతాలు ఇప్పుడు చల్లబడ్డాయా? ఎవరు అయితే నమ్మకం, ఓపిక ఉంటుందో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు.’ పితలే ధనికుడు, మరియూ దయకలవాడు. అతను అందరికీ మిఠాయి పంచిపెట్టారు. బాబాకు చక్కని పళ్ళను తాంబూలం ఇచ్చారు. పితలే భార్య సాత్వికురాలు, ఆమె నిరాడంబరత, ప్రేమభక్తులతో నిండి వున్నాయి. ఆమె స్తంభానికి దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిలిపి కళ్ళనుండి ఆనందభాష్పాలు రాలుస్తూ ఉంది. ఆమె స్నేహ, పరమ భావాలను చూసి బాబా అమితంగా సంతోషం చెందారు. దేవుడిలా యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడతారు. ఏ భక్తుడు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగాను పూజించి శరణు వేడుకుంటారో వారికే భగవంతుడు తోడ్పడతారు. వారు కొన్ని రోజులు బాబా దగ్గర సుఖంగా ఉన్న తరువాత ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకుని, బాబా దర్శనం కోసం మసీదుకు వచ్చారు. బాబా వారికి ఊదీ ప్రసాదం యిచ్చి ఆశీర్వదించారు. పితలేను దగ్గరగా పిలిచి ఇలా అన్నారు 'బాపూ! అతకుముందు 2 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను. వీటిని పూజామందిరంలో పెట్టుకుని పూజించు. నీవు మేలు పొందుతావు.’ పితలే వాటిని ప్రసాదంగా అందుకున్నారు .బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనల కోసం ప్రార్థించారు. ఇదే తాను షిరిడీ వెళ్ళటం మొదటిసారి కాబట్టి, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చానని బాబా మాటలకు అర్థాన్ని గ్రహించలేకపోయాడు. దీన్ని తెలుసుకోవాలనే కుతూహల పడ్డాడు కానీ బాబా ఊరుకున్నారు.

స్వగృహానికి వెళ్ళి తన ముసలి తల్లికి ఈ వృత్తాంతం అంతా చెప్పి బాబా అంతకు ముందు రెండు రూపాయలు ఇచ్చాను అన్నారు. అదేమిటి అని అడిగాడు, ఆమె తన కొడుకుతో ఇలా చెప్పింది. ’నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీ వెళ్ళినట్లు, మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పరిపూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కాబట్టి ఆయన పూజను స్వామి ఆమోదించారు. వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమన్నారు మీ తండ్రిగారు చనిపోయేవరకు వాటిని పూజిస్తూ ఉండేవారు. ఆ తరువాత పూజ ఆగిపోయింది. రూపాయలు పోయాయి. కొన్ని సంవత్సరాల తరువాత రూపాయల సంగతి పూర్తిగా మరచిపోయాం. నీవు అదృష్టవంతుడివి కావడం వల్ల, అక్కల్ కోట్ కర్ మహారాజ్ శ్రీ సాయిరూపంలో కనిపించి నీ కర్తవ్యాన్ని జ్ఞాపకానికి తెచ్చి, నీ కష్టాలను తప్పించాలని చూస్తున్నారు. కాబట్టి ఇకమీదట జాగ్రత్తగా ఉండు. సంశయాలను, దురాలోచనలను విడిచిపెట్టు. మీ తాతముత్తాతల ఆచారం ప్రకారం నడచుకో. సత్ప్రవర్తనాన్ని అవలంబించు. కుటుంబ దైవాలను పూజించు, రూపాయలను పూజించు. వాటి విలువను గ్రహించి, వాటిని శ్రద్ధగా పూజించి, మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించు. శ్రీసాయి నీలో ఉన్న భక్తిని మేల్కొల్పారు. నీ మేలు కోసం దాన్ని అభివృద్ధి చేసుకో.’ తల్లి మాటలు విని పితలే అమితంగా సంతోషించారు. శ్రీ సాయి యొక్క సర్వంతర్యాత్వంలోను, వారి శక్తి పట్ల అతనికి నమ్మకం కలిగింది. వారి దర్శన ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. అప్పటినుండి తన నడవడిక గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాడు.

అంబాడేకర్ గారు

పూణా వాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్టుమెంటులో 10 సంవత్సరాలు నౌకిరీ చేశాడు. ఠాణా జిల్లాలోను, జవ్వార్ స్టేట్ లోను అయన ఉద్యోగాలు చేసి విరమించుకున్నారు. మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టాలపాలయ్యాడు. అతని స్థితి రానురాను అసంతృప్తికరంగా ఉండేది. ఈ ప్రకారం 7 ఏళ్ళు గడిచాయి. అతను ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్తూ బాబాకు తన కష్టాలు చెపుతూ ఉండేవాడు. 1916లో అతని స్థితి చాల హీనంగా ఉండటంతో షిరిడీలో ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. దీక్షిత్ వాడా ఎదురుగా ఉన్న ఎడ్లబండి మీద కూర్చుని ఒకరోజు రాత్రి దగ్గరలో ఉన్న నూతిలో పడి చావాలని నిశ్చయించుకున్నారు. అతను ఈ ప్రకారం చేయాలని నిశ్చయించుకోగానే బాబా మరి ఒకటి చేయాలని నిశ్చయించుకున్నారు. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటలు ఉండేది. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ని పిలిచి అక్కల్ కోట్ కర్ మహారాజుగారి చరిత్రను చదివావా? అని అడుగుతూ పుస్తకాన్ని ఇచ్చారు. అంబాడేకర్ దాన్ని తీసుకుని చదవాలని అనుకున్నాడు. పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చింది. అక్కల్ కోట్ కర్ మహారాజుగారి కాలంలో ఒక భక్తుడు బాగుపడని దీర్ఘరోగంతో బాధపడుతున్నాడు. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకాడు. వెంటనే అక్కల్ కోట్ కర్ మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుండి బయటకు తీసి ఇలా అన్నారు. ‘గతజన్మ పాపపుణ్యాలను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తికాకపోతే ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించాలి. చావడానికి ముందు కొంతకాలం ఎందుకు నీ కర్మను అనుభవించరాదు? గత జన్మలోని పాపాలను ఎందుకు తుడిచి వేయకూడదు? దాన్ని శాశ్వతంగా పోయేలా చేయి.’ సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ అమితంగా ఆశ్చర్యపడ్డాడు. వారి మనస్సు కరిగింది. బాబా సలహా ఈ ప్రకారంగా లభించనట్లు  అయితే వాడు చచ్చిపోయి ఉండేవాడు. బాబా సర్వజ్ఞత్వం, దయాళుత్వం చూసి అంబాడేకర్ కు బాబా పట్ల నమ్మకం బలపడి అతని భక్తి దృఢం అయ్యింది. అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాబట్టి కొడుకు కూడా తండ్రిలా భక్తుడు కావాలని బాబా కోరిక. అతను బాబా ఆశీర్వచనం పొందాడు. వాడి శ్రేయస్సు వృద్ధి చెందింది. జోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగుచేసుకున్నాడు. కావలసినంత ధనాన్ని సంపాదించుకోగలిగాడు. మిగతా జీవితం అంతా సుఖంగా గడిపాడు.

ఇరవైఆరవ అధ్యాయం సంపూర్ణం 

Products related to this article

Bellam (Jaggery) (500 Grams)

Bellam (Jaggery) (500 Grams)

Bellam (Jaggery)..

₹80.00

Tibetan Black & Red Stone Necklace Set

Tibetan Black & Red Stone Necklace Set

Tibetan Black & Red Stone Necklace SetProduct Description:  Product: Necklace Set with Ear rings Colour: Black & RedMetal: Tibetan Black & Red Stone Necklace Length: 36 cm..

₹1,050.00

0 Comments To "Saibaba Satcharitra 26 Adyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!