కృష్ణా పుష్కరాలు
పుష్కర స్నాన విధులు ?
పుష్కర పిండప్రదాన విధులు ?
పుష్కరాల 12రోజులలో చేయవలసిన దానాలు ?
పుష్కరం అంటే భారత కాలమానం ప్రకారం పన్నెండు సంవత్సరాలు. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో పన్నెండు ముఖ్యమైన నదులు అన్నింటికీ పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు 2016ఎంతో పవిత్రమైనవి. 12 సంవత్సరాలకు ఒకసారి కృష్ణా పుష్కరాలు వస్తాయి, అటువంటి 12 పుష్కరాలకి వచ్చేవి మహా పుష్కరాలు. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాయన్నమాట. 2016వ సంవత్సరం ఆగస్టులో కృష్ణా నదికి వచ్చే పుష్కరాలు అటువంటి మహా పుష్కరాలు. అందుకే ఈ కృష్ణా పుష్కరాలలో ప్రతి ఒక్క హిందువు స్నానం చేయాలి. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 వ తేదీ 2016నుండి ఆగస్టు 23వ తేదీ 2016వరకు జరగబోతున్నాయి. పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కరకాలంలో మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు ఎంతో ప్రత్యేకమైనవి. సప్తఋషులే కాకుండా చాలామంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాల సమయంలో సంచరిస్తుంటారని, పుష్కర స్నానాలు చేసేవారికి శుభాలను కలిగిస్తారని హిందువుల ప్రగాఢ నమ్మకం. పుష్కర స్నానం వలన అశ్వమేథ యాగం చేసిన ఫలితం ఇంకా లక్ష గోదానాలు చేసిన ఫలితం లభిస్తుంది, మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాలకు ఇది చాలా మంచి సందర్భం.
భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో రెండవ పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు రాష్ట్రాల వారు ఆప్యాయంగా 'కృష్ణవేణి' అని పిలుచుకుంటారు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి.
పుష్కరస్నాన విధి : పుష్కర స్నానం శుభ్రత కోసంకాదు, ఇది దివ్య స్నానం. అందుకే ఇంటిదగ్గరే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పుష్కర స్నానానికి వెళ్ళాలి. మలిన దుస్తులతో పుష్కర స్నానం చేయకూడదు, సబ్బు, షాంపూ వంటివి కూడా వాడకూడదు. వంటికి నూనె రాసుకోవడం, నదిలో బట్టలు ఉతికి పిండడం చేయకూడదు. కేవలం నదిలో మూడు మునకలు వేసి స్నానం చేయాలి. పుష్కర స్నానం చేసే ముందు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. సంకల్పం చెప్పకుండా చేసే స్నానానికి అంతగా ఫలితం ఉండదని పెద్దలు, పురోహితులు చెపుతారు. పురోహితుల సహాయంతో సంకల్పం చెప్పుకుని పుష్కర స్నానం చేయడం ఉత్తమమైనది. అటువంటి సౌకర్యం లేనివారు ఈ క్రింద వివరించిన శ్లోకం స్నాన సంకల్పం చెప్పుకుని స్నానం చేయవచ్చు.
శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశ తిరపీ !
ముచ్యతే సర్వ పాపెభ్యో విష్ణు లోకం సగచ్చతి !!
పావని త్వం జగత్పూజ్యే సర్వ తీర్థ మయే శుభే !
త్వయి స్నాటు మనుజ్ఞాం మే దేహి కృష్ణే మహానది !!
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా శ్రీ శివ శంభో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గోదావరీ తటే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుభ పక్షే శుభ తిథౌ శుభ వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ... గోత్రః అహం .... నామధేయః ధర్మ పత్ని సమేతస్య సకుటుంబ సపరివారస్య- ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ద్యర్థం, గంగా వాలుకాభి సప్తర్షి మండలపర్యంతం కృత వారాశే పౌన్దరీకాశ్వమేధాది సమస్త క్రతు ఫలా వాప్త్యర్థం ఇహ జన్మని జన్మాంతరేచ బాల్య యౌవన కౌమార వార్థక్యేషు, జాగ్రత్ స్వప్న సుహుప్త్యవస్తాసు జ్ఞానతో జ్ఞానతస్య కామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సవేషాం పాపానాం అపనోద నార్థంచ- గంగా యమునాది సమస్త పుణ్య నదీ ఫల సిద్ద్యర్థం, కాశీ ప్రయాగాది సర్వ పుణ్యక్షేత్ర స్నాన ఫల సిద్ద్యర్థం, సర్వ పాప క్షయార్థం, ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం మకరంగ తేరవౌ మహా పవిత్ర కృష్ణా నది మహా పుష్కర స్నానం కరిష్యే.
ఈ సంకల్పం చెప్పుకున్న తరువాత ఈ శ్లోకం చదవాలి :
పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకా భయంకరి !
మృత్తికాంతే ప్రదాస్వామి ఆహారార్థం ప్రకల్పయా !!
ఈ శ్లోకం చదువుకున్న తరువాత నది ఒడ్డు నుండి కొంచెం మట్టి తీసి నదిలో వేయాలి, లేకపోతే స్నాన ఫలం దక్కదు అని పెద్దలు, పురోహితులు చెపుతున్నారు.
ఆ తరువాత స్నానం చేయాలి. అంటే నదిలో తల మునిగేలా మూడు మునకలు వేయాలి.
తరువాత
నందినీ నళినీ సీతా మాలినీ ఛ మహాపగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగ త్రిపధ గామినీ
భాగీరధి భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యాత్ర యాత్ర జలాశయే
స్నాన కాల పఠెన్నిత్యం మహా పాతక నాశనం !!
తీర్థ రాజ నమస్తుభ్యం సర్వ లోకైక పావన
త్వయి స్నానం కరోమి అద్య భవ బంధ విముక్తయే !!
కన్యా గతే దేవ గురౌ పితృణాం తారణాయచ
స్సర్వ పాప విముక్త్యార్థం తీర్థ స్నానం కరోమ్యహం !!
స్నానం తరువాత ప్రార్థనా శ్లోకాలు చదువుతూ, ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్మఖముగా కుడి చేతి బొటన వ్రేలుతో నీటిని కదిలించి మూడు దోసిళ్ళ నీళ్ళు తీరానికి (ఒడ్డు)జల్లి, తీరానికి చేరుకొని బట్టలు విడిచి పిండుకోవాలి. ఆ తరువాత పొడిబట్టలు ధరించి తమ సంప్రదాయానుసారం విభూతి వంటి వాటిని ధరించి సంధ్యా వందనాదులు పూర్తిచేసుకుని నదీతీరంలో ఉన్న దేవాలయానికి గాని దైవాన్ని కానీ అర్చించాలి.
పుష్కరాల సమయంలో చేయవలసిన దానాలు :
మొదటిరోజు : బంగారం దానం, వెండి దానం, ధాన్యం దానం, భూదానం
రెండవరోజు : వస్త్రాల దానం, ఉప్పు దానం, రత్నాల దానం
మూడవరోజు : బెల్లం, ఆశ్వశాఖ, పళ్ళు దానాలు
నాలుగవ రోజు : నెయ్యి, నూనె, పాలు, తేనె దానాలు
ఐదవరోజు : ధాన్యం, శకటం, ఆవు, నాగలి దానాలు
ఆరవరోజు : ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి (కుంకుమ) దానాలు
ఏడవరోజు : గృహం, పీట, మంచం దానాలు
ఎనిమిదవరోజు : గంధం, కందమూలాలు, పుష్పమాల దానాలు
తొమ్మిదవరోజు : పిండం, దాసీ, కన్యాదానం, కంబళి దానాలు
పదవరోజు : కూరగాయలు, సాలగ్రామం, పుస్తకాలు దానాలు
పదకొండవరోజు : ఏనుగు దానం చేయాలి
పన్నెండవరోజు : నువ్వులు దానం చేయాలి.
దానాల వల్ల కలిగే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి :
సువర్ణ (బంగారం), రజత (వెండి) | సుఖ భోగాలు |
భూమి దానం | భూ పతిత్వం |
వస్త్ర దానం | వసులోక ప్రాప్తి |
గోదానం | రుద్రలోక ప్రాప్తి |
అజ్వదానం | ఆయువు వృద్ధి |
ఔషధ దానం | ఆరోగ్యాన్ని |
సాలగ్రామ దానం | విష్ణులోకాన్ని |
గృహ దానం | ధన సౌఖ్యాన్ని |
శయ్య దానం | స్వర్గ సుఖాలను |
తిల దానం | ఆపదల నివారణ కలిగిస్తుంది. |
శ్రాద్ధం :
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం ఇంకా శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని హిందువులు విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిది అని ఋషులు చెప్పారని మన పురాణాలు చెపుతున్నాయి. శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి. పుష్కర కాలంలో నదీతీరంలో తమ తమ పితరులకు శ్రాద్ధకర్మలు చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ శ్రాద్దకర్మల వల్ల మరణించిన వారికి పుణ్యలోక ప్రాప్తి, చేసిన వారికి వంశవృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దలకు పిండాలు పెట్టి శ్రాద్ధం చేయలేని వాళ్ళు పెద్దల పేరు మీద నువ్వులు నీళ్ళతో తర్పణాలైనా విడిచిపెట్టాలి. పుష్కర రోజులలో తొమ్మిదవ రోజుగానీ, లేదా తమ పెద్దలు మరణించిన తిథి రోజున గానీ పితృ శ్రాద్ధని నిర్వహించాలి. అలాగే సమీప బంధువులకు పిండ ప్రదానం చేయవచ్చు, తర్పణం విడిచిపెట్టవచ్చు. అలాగే స్నేహితులకు, ఆత్మీయులకు పిండ ప్రధానం చేస్తే సరిపోతుంది. పిండ ప్రదానం ఆకు దొప్పలలోనే చేయాలి.
పుష్కర నీళ్ళు :
పుష్కర స్నానం వల్ల త్రికరణాలతో చేసే పాపాలు నశిస్తాయని, పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సర కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానం చేసినట్లయితే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తులో వివరించబడింది. అలాగే ప్రకృతి పరంగా స్త్రీలు బహిస్టు కాలం అయిన తరువాత ఇంటిని శుభ్రపరచుకోవడం హిందువులలో తప్పకుండా ఆచరిస్తారు. సాధారణంగా నేటి కాలంలో కొంతమంది నీళ్ళతో కడిగే సమయం చిక్కకపోవడంతో అలాగే ఇంటిని వదిలివేస్తున్నారు. మరికొంతమంది కొంత నదీజలాలను ఒక మగ్గులో శుభ్రమైన నీటిలో కలిపి ఇంట్లో ప్రోక్షణం చేస్తున్నారు. మరి పుష్కర నదీ జలాలను ఇంట్లో భద్రపరచుకుని ప్రోక్షణం చేసుకున్నట్లయితే ఇంట్లోని దారిద్ర్యం, చీడా, పీడా కూడా నశిస్తాయి.
Note: HTML is not translated!