వరలక్ష్మీదేవి వ్రతకథ
సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు. 'ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెపుతాను వినండి.
ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా, పార్వతీద్వి ఆయన దగ్గరకు వచ్చి 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యాలను, సంతానప్రాప్తి కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఎదో సెలవీయండి' అని అడిగింది. దానికి పరమేశ్వరుడు చిద్విలాసంగా నవ్వుతూ 'ఓ దేవీ! స్త్రీలకు పుత్రా పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతం శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయాలి.' పార్వతీదేవి ఇలా అడిగింది. 'నాథా! ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా పూజించాలి? దీన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా? ఆ వివరాలు అన్నీ చెప్పండి'. పార్వతీదేవి అడిగిన దానికి శివుడు ఈ విధంగా తెలిపాడు 'ఓ కాత్యాయనీ! వరలక్షీ వ్రత విశేషాలు చెపుతాను విను, పూర్వం మగధదేశంలో కుండిన అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి, తెల్లవారు ఝామునే నిద్రలేచి, స్నానం చేసి, పతిదేవుడిని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, ఇంటిపనులు అన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతూ ఉండేది. ఇంత అణుకువగా ఉన్న ఆ మహా పతివ్రతను చూసి శ్రీమహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీదేవిని, నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను' అని. ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ...
'నమస్తే సర్వలోకానాం జనన్యైపుణ్య మూర్తయే శరణ్యే ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే' అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది.
'ఓ జగజ్జననీ! నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది' అని నమస్కరించింది. వరలక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యమయింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగువైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కల కన్నాను అని వెంటనే భర్తనీ, అత్తమామాలని నిద్రలేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండ ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి ఇరుగుపొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు అలా ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలు అందరూ పూజకు ఉపక్రమించారు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి, పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి మంటపం ఏర్పాటు చేశారు. దానిమీద ఒక ఆసనం వేసి దానిపై కొత్తబియ్యం పోసి, మర్రిచిగుళ్ళు మామిడాకులతో కలశాన్ని అలకరించారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. స్త్రీలతో బాటు చారుమతి కూడా భక్రిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించారు.
'పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా' అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. తొమ్మిది సూత్రాలు ఉన్న తోరణాన్ని కుడిచేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండివంటలు చేసి నైవేద్యం సమర్పించారు. తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లు మంటూ శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలు అంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయి అని ఎంతో సంతోషించారు. రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులు అయ్యారు. చారుమతి మొదలైన స్త్రీలు నివశించే ఇళ్ళు అన్నీ స్వర్ణమయం అయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటినుండి ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళడానికి వారి వారి ఇళ్ళనుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షతలతో పూజించి 12 కుడుములు వాయనం ఇచ్చి, దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండివంటలు బంధుమిత్రులతో తమ తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారివారి ఇళ్ళకు బయలుదేరారు. మార్గమధ్యలో స్త్రీలు చారుమతి భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం చారుమతి చేసుకున్న అదృష్టం అని అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన దగ్గరే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తామందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలగడం తమ అదృష్టంగానూ తమను భాగ్యవంతులను చేసినందుకు సంతోషించారు. ఆనాటి నుంచీ చారుమతితో సహా మిగిలినవారందరూ క్రమం తప్పకుండ ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ పూజ చేస్తూ పుత్రపౌతాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తువహనాలు కలిగి సుఖసంతోషాలతో ఉన్నారు. కాబట్టి 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి' అని తెలిపాడు పరమశివుడు. సూతమహాముని శౌనకుడు మొదలైన వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో? ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలు అయి మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అని అన్నాడు.
వరలక్ష్మీదేవి వ్రతం సమాప్తం
ఇక్కడ క్లిక్ చేయండి - తోర పూజ | వరలక్ష్మీవ్రత పూజావిధానం |
Note: HTML is not translated!