వినాయక చవితి వ్రత విధానం ...
వినాయక చవితి రోజు ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, నీళ్ళతో కడగాలి. తరువాత ఇంటిలోని సభ్యులందరూ తలంటుకుని స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించాలి. గుమ్మాలను మామిడాకులతొ అలంకరించుకోవాలి. వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసి, పసుపుతో విఘ్నేశ్వరుని చేసి, తమలపాకుల చివర తూర్పు వైపుకుగానీ, ఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని వాటిపై తమలపాకులను పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసిన తరువాత ...
ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి
సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైతు
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు
శ్లోకం: య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి.
పీటపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకుని. పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్ళు కట్టి పైన కట్టుకోవాలి. పాలవెల్లిపై పత్రి వేసుకుని పాలవెల్లి నలువైపులా మొక్కజోన్ను పొత్తులను కట్టుకుని, పళ్ళతొ అలంకరించుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పాయసం మొదలైన పిండివంటలు చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. వినాయకుడి ప్రతిమ ఎదురుగా పీటపై కొన్ని బియ్యం పోసుకుని దానిపై రాగి, వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, పాత్రపై జాకెట్టు గుడ్డ వేసి, మామిడాకులు కొన్ని ఉంచి దానిపై కొబ్బరికాయ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి.
పూజకు కావలసిన పూజాసామాగ్రి ...
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా చక్కెర, పంచామృతం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, దీపారాధనకు వత్తులు, 21 రకాల ఆకులు (పత్రి), ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిణ, పళ్ళెం పెట్టుకోవాలి (ఆచమనం చేయడానికి). మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు, దక్షిణ ఉంచుకోవాలి. ఆచమనం చేసిన తరువాత చేతులు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని పీటపై కూర్చోవాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!
అయం మొహోర్తః సుముహోర్తోస్తు
తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరోపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్సుంసాం సర్వతో జయమంగళమ్
అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి. పసుపుతో చేసిన వినాయకుడికి కుంకుమబొట్టు పెట్టి అక్షింతలు చల్లి నమస్కరించాలి.
ప్రార్థన :
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంద పూర్వజః
అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు ఉంచాలి. అక్షితలు తీసుకుని పసుపు గణపతిపై వేసి నమస్కరిస్తూ ... సుమూహుర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్య ఫలసిద్ధిరస్తూ అని చెప్పాలి.
ఆచమనం ...
ఆచమ్యా ఓం కేశవాయస్వాహా (స్త్రీలయితే కేశవాయనమః అనాలి)
ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా అని చదువుతూ ఉద్దరిణతో కుడి అరచేతిలో నీరు పోసుకుని త్రాగిన తరువాత మళ్ళీ నీళ్ళు తీసుకుని కుడిచేతిని కడుక్కోవాలి. ఇలా మూడుసార్లు ఆచమనం చేయాలి.
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః,
ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః,
ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః,
ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః,
ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః,
ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్తనాయ నమః,
ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః
భూతోచ్చాటన .. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చదివి ...
అక్షతలు వాసన చూసి, భార్య ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వదలాలి. మిగతా వాళ్ళు కుడిచేతి పక్కనుంచి వెనక్కు వదలాలి. తరువాత ప్రాణాయామం చేయాలి.
దీపారాధన ...
దీపం వెలిగించి, పూలు, అక్షితలు వేసి నమస్కారం చేయాలి. (ఈ క్రింది మంత్రాలు చదువుతూ పూలు, అక్షితలు పసుపు గణపతిపై వేయాలి)
ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః,
ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఓం సీతారామాభ్యాం నమః,
సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమోనమః.
సంకల్పం ...
ఓం మమోపాత్త సమస్త దురతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం, శుభే శోభననే అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్థే, శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే, మేరో ర్ధక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య (తెలంగాణవాళ్ళు వాయువ్య ప్రదేశే అని, రాయలసీమవాళ్ళు ఆగ్నేయ ప్రదేశే అని, కోస్తాంధ్ర వాళ్ళు ఈశాన్య ప్రదేశే అని చదవుకోవాలి) ప్రదేశే, శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిదౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ గురువాసరే ... శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ... (పేరు) గోత్రోద్భవ (గోత్రం చెప్పుకోవాలి) ... నామధేయస్య, ధర్మపత్నీసమేతః, (భార్యపేరుతో మీ పేరు కలిపి చెప్పుకోవాలి) మమ సకుటుంబస్య, క్షేమ, స్థైర్య విజయ అభయాయురారోగ్యైశ్వర్యాభి వృద్యర్థం, ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిధ్యర్థం, పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్దార్థం, లోకకళ్యాణార్థం శ్రీవిఘ్నేశ్వర పూజాం కరిష్యే.
కలశ పూజ
ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం, శ్రీవిఘ్నేశ్వర పూజాం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీళ్ళు వదలాలి. కలశానికి గంధం, కుంకుమతో బొట్టుపెట్టాలి. కలశంలో గంధం, పువ్వులు, అక్షతలు వేయాలి.
దేవతీర్థాద్యావహనము
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర నమాశ్రితః
మూలో తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌతుసాగరాః సర్వ్ సప్తద్వీపా వసుంధరా
రుగ్వేదోథయజుర్వేదః సామవేదోహ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ ...
గంగేచ యమునేకృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య
ఏవమాత్మానంచ సంప్రోక్ష్య
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యాల మీదా, దేవుడిమీద, తమమీద కొద్దిగా చిలకరించుకోవాలి.
Note: HTML is not translated!