శ్రీసాయిసచ్చరిత్రము
ముప్పై ఎనిమిదవ అధ్యాయము
ఆరవరోజు పారాయణ (మంగళవారము)
గత అధ్యాయంలో బాబాగారి చావడి ఉత్సవం గురించి వర్ణించాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా వంటపాత్ర మొదలైన వాటి గురించి చదువుకుందాము.
తొలిపలుకు: ఓ సద్గురుసాయి! నీవు పావనమూర్తివి! ప్రపంచమంతటికి సంతోషాన్ని ప్రసాదించావు. భక్తులకు మేలు కలగచేశావు. నీ పాదాలను ఆశ్రయించిన వారి బాధలను తొలగించావు. నిన్ను శరణు కొరినవారిని ఉదారస్వభావుడవు కాబట్టి వారిని పోషించి రక్షిస్తావు. నీ భక్తుల కోరికలు నెరవేర్చడం కోసం వారికి మేలు చేయడం కోసం నీవు అవతరిస్తావు, పవిత్రాత్మ అనే ద్రవాన్ని బ్రహ్మం అనే అచ్చులో పోస్తే దానినుండి యోగులలో అలంకారమైన సాయి వచ్చారు. ఈ సాయి ఆత్మారాముడే, స్వచ్చమైన దైవికానందానికి వారు పుట్టినిల్లు. జీవితంలో కోరికలు అన్నీ పొందినవారి, వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తిని ప్రసాదించారు.
యుగయుగాలకు శాస్త్రాలు వేరు వేరు సాధనాలను ఏర్పాటు చేసి ఉన్నాయి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలియుగంలో దానం చేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దానాలు అన్నింటిలో అన్నదానమే సర్వశ్రేష్టమైనది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం దొరకకపోతే మనం చాలా బాధపడతాము. అటువంటి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అలాగే బాధపడతాయి. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతారో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇలా చెబుతుంది. ‘ఆహారమే పరబ్రహ్మ స్వరూపం, ఆహారం నుండే సమస్తమైన జీవులు ఉద్భవించాయి. చనిపోయిన తరువాత అవి తిరిగి ఆహారంలో ప్రవేశిస్స్తాయి.’ మిట్టమధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినట్లయితే వారిని ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టడం మన విధి, కర్తవ్యం. ఇతర దానాలు అంటే ధనం, వస్త్రాలు మొదలైనవి ఇస్తున్నప్పుడు కొంచెం విచక్షణ కావాలి కానీ ఆహార విషయంలో అటువంటి ఆలోచన అనవసరం. మన ఇంటికి మిట్టమధ్యాహ్నం ఎవరు వచ్చినా మొదట వారికి భోజనం పెట్టాలి. కుంటి, గుడ్డి, రోగిస్టులు వచ్చినట్లయితే వారికి ముందు భోజనం పెట్టిన తరువాత ఆరోగ్యవంతులైన వారికి తరువాత బంధువులకు భోజనం పెట్టాలి. మన బంధువులు మొదలైన వారికి పెట్టడంకన్నా నిస్సహాయులైన అంగవికలాంగులకు తదితరులకు పెట్టడం ఎంతో శ్రేయస్కరం. అన్నదానం లేకపోతే ఇతర దానాలు ప్రకాశించవు. అది ఎలాగంటే చంద్రుడు లేని నక్షత్రాలలాగ, పతకంలేని కంఠహారంలాగా, పింఛంలేని కిరీటంలాగా, కమలం లేని చెరువులాగా, భక్తిలేని భజనలాగా, కుంకుమబొట్టులేని పుణ్యస్త్రీలాగా, బొంగురు కంఠం ఉన్నవాడి పాటలాగా, ఉప్పులేని మజ్జిగలాగా రుచించవు. అన్నిటికంటే పప్పుచారు ఎలా ఎక్కువో అలాగే అన్ని పుణ్యాలలోకెల్లా అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం ఎలా తయారుచేసి పంచిపెడుతూ ఉండేవారో ఇప్పుడు చూద్దాము.
బాబా కోసం చాలా తక్కువ భోజనం కావాలి అదీ కొన్ని ఇళ్ళనుండి భిక్షాటన చేసే తెచ్చుకునేవారు అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఏరోజైనా బాబా అందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నట్లయితే మొదటినుండి చివరివరకు అందుకు కావలసిన ఏర్పాట్లు అన్నీ బాబాయే స్వయంగా చేసుకునేవారు. ఈ విషయంలో బాబా ఇతరులపై ఏనాడూ ఆధారపడలేదు, ఎవరికీ బాధ కలిగించలేదు. ముందుగా బజారుకు వెళ్ళి ధాన్యం, పిండి, మసాలా దినుసులు మొదలైనవి అన్నీ డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు. బాబాయే ధాన్యం విసురుతూ ఉండేవారు. మసీదు ముందు ఉన్న ఖాళీస్థలం మధ్యలో పొయ్యి పెట్టి దానిపై ఒక పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారం నీళ్ళు పోసి పెట్టేవారు. వారి దగ్గర వంటపాత్రలు రెండు ఉన్నాయి. ఒకటి పెద్దది, అది వందమందికి సరిపోయేది. రెండవది చిన్నది, అది యాభై మందికి మాత్రమే సరిపోయేది. ఒక్కొక్కప్పుడు చక్కెరపొంగలి వండేవారు. ఇంకొక్కప్పుడు మాంసం పోలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకుతున్న సమయంలో గోధుమపిండి అందులో వేసేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దాన్ని వంటపాత్రలో వేసేవారు. పదార్థాలు ఎంతో రుచిగా ఉండడానికి బాబా ఎంత శ్రమ తీసుకోవాలో అంత శ్రమ పడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అంబలి అంటే జొన్న పిండిని నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని మజ్జిగలో కలిపేవారు. భోజన పదార్థాలతో పాటు అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెం పెట్టేవారు. అన్నం సరిగ్గా ఉడికిందో లేదో అని పరీక్షించడానికి బాబా తన కఫనీని పైకి ఎత్తి చేతిని నిర్భయంగా మరుగుతున్న వంటపాత్రలో పెట్టి కలుపుతూ ఉండేవారు. వారి ముఖంలో భయపడుతున్నట్లు కానీ, చేయి కాలుతున్నట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తవగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తీసుకునివచ్చి, మౌల్వీతో భోజనాలు పెట్టించేవారు. ముందుగా కొంత మహాల్సాపతికి, తాత్యాకి ప్రసాదంగా పంపించిన తరువాత మిగతా దాన్ని బీదవాళ్ళకు, దిక్కులేనివారికి సంతృప్తిగా పెడుతూ ఉండేవారు. బాబా స్వయంగా తన చేతులతో తయారుచేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసినవారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు అయి ఉండాలి.
బాబా తన భక్తులందరికీ శాఖాహారం, మాంసాహారం ఒకే విధంగా పెట్టేవారా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. దీనికి జవాబు సులభం, సామాన్యమైంది. ఎవరు మాంసాహారులో వారికే వంట పాత్రలోది వడ్డించేవారు, మాంసాహారం తినని వాళ్ళని ఆ పాత్రను కూడా ముట్టుకోనిచ్చేవారు కాదు. వారి మనసులో మాంసాహారం తినాలనే కోరిక కూడా కలగనిచ్చేవారు కాదు. గురువుగారు ఏదైనా తినడానికి ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చా లేదా అని ఆలోచించే శిష్యుడు నరకానికి వెళతాడని రూఢీగా ఉంది. దీన్ని శిష్యులు ఎంత బాగా గ్రహించి ఎంతవరకు నెరవేరుస్తున్నారో లేదో చూడడానికి బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షిస్తూ ఉండేవారు. దీనికి ఒక ఉదాహరణ. ఒక ఏకాదశి రోజున దాదాకేల్కర్ కి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళి మాంసకొని తీసుకురమ్మని చెప్పారు. దాదాకేల్కర్ సనాతన ఆచార పరాయణుడైన బ్రాహ్మణుడు మరియు ఆచారవంతుడు. సద్గురువుకి ధనం, ధాన్యం, వస్త్రాలు మొదలైనవి ఇవ్వటం చాలదని, కావలసింది గురువు ఆజ్ఞను పాటించడమే అని, గురువు అజ్ఞను నెరవేర్చడమే అని, ఇదే నిజమైన దక్షిణ అని, దీనివల్లే గురువు సంతృప్తి చెందుతారని దాదాకేల్కర్ కి తెలుసు. అందుకే దాదా కేల్కర్ దుస్తులు వేసుకుని బజారుకి బయలుదేరారు. కానీ బాబా అతన్ని వెంటనే వెనక్కి పిలిచి అతన్ని వెళ్ళవద్దని ఇంకెవరినైనా పంపించమని చెప్పారు. కేల్కర్, పాండు అనే నౌకర్ని పిలిచి పంపించారు. పాండు బయలుదేరటం చూసి బాబా అతన్ని కూడా వెనక్కి పిలిపించి ఆరోజు మాంసం వండటం మానేశారు. ఇంకొకసారి బాబా దాదాకేల్కర్ ని పిలిచి పొయ్యి మీద ఉన్న పోలావు ఉడికిందో లేదో చూడమని చెప్పారు. కేల్కర్ దాన్ని పరీక్షించకుండానే సరిగ్గా ఉందని జవాబిచ్చారు. అప్పుడు బాబా 'నువ్వు కళ్ళతో దాన్ని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు మరి రుచిగా ఉందని ఎలా చెప్పావు? మూత తీసి చూడు' అంటూ బాబా కేల్కర్ చేతిని పట్టుకుని మరుగుతున్న పాత్రలో పెట్టి ఇలా అన్నారు 'నీ చేతిని తీసేయి. నీ ఆచారం ఒక ప్రక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేటులో వేసి సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకో'. తల్లి మనస్సులో నిజమైన ప్రేమ పుట్టినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు వాణ్ణి కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటుంది. అలాగే బాబా కూడా కన్నతల్లిలా దాదాకేల్కర్ ని ఈ విధంగా గిల్లారు. నిజంగా ఏ యోగి కానీ, గురువు కానీ తన శిష్యుడికి నిషేధిత ఆహారం తిని చెడిపొమ్మని చెప్పరు.
ఈ విధంగా బాబా పోలావు వండటం 1910వ సంవత్సరం వరకూ జరుగుతూ ఉండేది. ఇంతకుముందు చెప్పిన విధంగా దాసగుణు, బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో తెలియజేశారు. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా షిరిడీకి వచ్చేవారు దీంతో కొన్ని రోజులలోనే షిరిడీ ఒక పుణ్యక్షేత్రం అయిపోయింది. బాబా భక్తులు ఎన్నో రకాల ఆహారాలు బాబాకి నైవేద్యంగా పెడుతూ ఉండేవారు. వాళ్ళు తెచ్చిన పదార్థాలు ఫకీరులు, బీదలు తినగా ఇంకా మిగిలిపోతూ ఉండేది. నైవేద్యాన్ని ఎలా పంచిపెట్టేవారో చెప్పడానికి ముందుగా బాబాకి షిరిడీలోని దేవాలయాలలో, అందులో దేవతల పట్ల గల గౌరవాన్ని చాటే నానాసాహెబు చాందోర్కర్ కథ తెలుసుకుందాము.
నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట :
ఎవరికి తోచినట్టు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడు అని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెపుతుండేవారు. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కాదు. వారు ఎప్పుడు పుట్టారో, ఏ జాతిలో పుట్టారో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు కాబట్టి వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎలా అవుతారు? వారు మహమ్మదీయులు అయినట్లయితే మసీదులో ఎప్పుడూ ధుని ఎలా వెలిగిస్తారు? అక్కడ తులసి బృందావనం ఎలా వుంటుంది? శంఖం పూరించడానికి ఎవరు ఒప్పుకుంటారు? గంటలను మ్రోగించడానికి ఎవరు ఒప్పుకుంటారు.? సంగీత వాయిద్యాలను ఎలా వాయించనిస్తారు? హిందువుల మతం ప్రకారం షోడశోపచార పూజలను ఎందుకు జరగనిస్తారు? వారు మహమ్మదీయులు అయినట్లయితే వారి చెవులకు కుట్లు (రంధ్రాలు) ఎలా ఉంటాయి? గ్రామంలోని హిందూ దేవాలయాలు అన్నిటికీ ఎందుకు మరమ్మత్తు చేయించారు? బాబా హిందూ దేవాలయాలను, దేవతలను ఎంతమాత్రం అగౌరపరచినా ఊరుకునేవారు కాదు.
ఒకరోజు నానాసాహెబు చాందోర్కర్ తన తోడల్లుడైన బినీవాల్యాతో షిరిడీకి వచ్చారు. బాబా దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపంతో 'నా సహవాసం ఇన్నాళ్ళ నుండి చేసినా ఎందుకు చేశారు?’ అన్నారు. నానాసాహెబు మొదట దీన్ని గ్రహించలేకపోయారు. అందుకే అది ఏమిటో వివరించవలసిందిగా బాబాను ప్రార్థించారు. 'కోపర్ గావ్ నుండి షిరిడీకి ఎలా వచ్చావు?’ అని బాబా అడిగారు. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించారు. సాధారణంగా షిరిడీకి వెళ్ళినప్పుడల్లా నానాసాహెబు కోపర్ గావ్ లో దిగి దత్తదర్శనం చేసుకునేవారు. కాని ఈసారి తన బంధువు దత్త భక్తుడు అయినప్పటికీ అతన్ని కూడా వెళ్ళనీయకుండా, ఆలస్యం అయిపోతుందని చెపుతూ తిన్నగా షిరిడీకి తీసుకుని వచ్చారు. ఇదంతా బాబాకు తెలియచేస్తూ తాను గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక ముళ్ళు పాదంలో గుచ్చుకుని తనను చాలా బాధపెట్టిందని చెప్పారు. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అంటూ ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించారు.
కాలా (మిశ్రమం):
ఇక బాబా నైవేద్యం ఎలా పంచిపెట్టేవారో తెలుసుకుందాము. హారతి తరువాత భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదాలు ఇచ్చి పంపిన తరువాత, బాబా మసీదులోకి వెళ్ళి నింబారువైపు వీపు పెట్టుకుని కూర్చుంటూ ఉండేవారు. కుడి, ఎడమ వైపులలో భక్తులు వరుసలలో కూర్చుంటూ ఉండేవారు. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళాలను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదం కోసం, ఊదీ కోసం వేచిచూస్తూ బయట నిలబడేవారు. అన్ని రకాల ప్రసాదాలు బాబాకి సమర్పించేవారు. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం మొదలైనవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు పెట్టేవారు. బాబా వీటిని దైవానికి అర్పించి, పావనం చేస్తుండేవారు. అందులో కొంతభాగం బయట వేచి ఉన్న వారికి పంచిపెట్టి మిగిలింది బాబాకు అటూ ఇటూ రెండు వరుసలలో కూర్చున్న భక్తులు సంతృప్తిగా తింటుండేవారు. శ్యామా, నానాసాహెబు నిమోన్ కర్ వడ్డించేవారు. వచ్చినవారి సౌకర్యాలను వీరు చూస్తుండేవారు. వారు ఆ పనిని అతి జాగ్రత్తగా, ఇష్టపడి చేస్తుండేవారు. తిన్నటువంటి ప్రతి రేణువు కూడా తృప్తీ, సత్తువా కలగజేస్తూ ఉండేవి. అది అలాంటి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారం. అది సదా పరిశుభ్రమైనదీ, పవిత్రమైనదీ.
ఒక గిన్నెడు మజ్జిగ :
ఒకరోజు హేమాడ్ పంత్ మసీదులో అందరితో పాటు కడుపునిండా తిన్నారు. అటువంటి సమయంలో బాబా హేమాడ్ దగ్గరికి వచ్చి ఒక గిన్నెడు మజ్జిగ తాగమని ఇచ్చారు. అది తెల్లగా చూడడానికి ఇంపుగా ఉంది. కాని అతని కడుపులో ఖాళీ లేనట్టుగా ఉంది. కొంచెం త్రాగగా అది ఎంతో రుచిగా ఉంది. హేమాడ్ అవస్థను కనిపెట్టి బాబా అతనితో ఇలా అన్నారు 'దాన్ని అంతా తాగు, నీకు ఇక మీదట ఇలాంటి అవకాశం దొరకదు' హేమాడ్ వెంటనే దాన్ని అంతా తాగేశాడు. బాబా పలుకులు నిజమయ్యాయి. ఎలాగంటే త్వరలో బాబా సమాధి చెందారు.
పాఠకులారా! హేమాడ్ పంత్ కి మనం నిజంగా నమస్కరించాలి. ఎందుకంటే అతను గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా తాగారు. కానీ మనకు కావలసినంత అమృతాన్ని బాబా లీలల రూపంలో ఇచ్చారు. మనం ఈ అమృతాన్ని గిన్నెలతో తాగి సంతృప్తి చెంది ఆనందించెదముగాక!
ముప్పై ఎనిమిదవ అధ్యయాము సంపూర్ణం
Note: HTML is not translated!