శ్రీ సాయి సచ్చరిత్ర
నలభై ఒకటవ అధ్యాయం
గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం గురించిన విశేషం చెపుతాము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాలకు ఆలీ మహమ్మద్, హేమాడ్ పంత్ ను కలిసి ఈ క్రింది కథ చెప్పారు. ఒక రోజు బొంబాయి వీథులలో వెళుతున్నప్పుడు, వీథిలో తిరిగి అమ్మేవాడి దగ్గర ఆలీమహమ్మద్ సాయిబాబా చిత్రపటాన్ని కొన్నారు. దానికి ఫ్రేం కటించి, తన బాంద్రా ఇంట్లో గోడకు వ్రేలాడదీశారు. అతడు బాబాను ప్రేమించటంతో ప్రతిరోజూ చిత్రపటం దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. హేమాడ్ పంత్ కు ఆ పటం ఇవ్వడానికి 3 నెలల ముందు అతను కాలుమీద కురుపు లేచి బాధపడుతూ ఉన్నాడు. దానికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు అతను బొంబాయిలో ఉన్న తన బావమరిది అయిన నూర్ మహమ్మద్ పీర్ భాయి ఇంట్లో ఉండేవాడు. బాంద్రాలో తన ఇళ్ళు 3 నెలలవరకు మూసివేయబడింది. అక్కడ ఎవరూ లేకపోయారు. అక్కడ ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానాసాహెబు, మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలైన (జీవించివున్న) యోగుల పటాలు ఉన్నాయి. వాటిని కూడా కాలచక్రం విడిచిపెట్టలేదు. అతడు వ్యాధితో బాధపడుతూ బొంబాయిలో ఉన్నాడు. బాంద్రాలో ఆ పటం ఎందుకు బాధపడాలి? పటాలకు కూడా చావుపుట్టుకలు ఉన్నట్లుంది. పటాలు అన్నీ వాటి వాటి అదృష్టాలను అనుభవించాయి. కాని సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రాన్ని తప్పించుకుంది. అదెలా తప్పించుకోగలిగిందో నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. దీన్నిబట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనీ, సర్వవ్యాపి అనీ, అనంతశక్తుడనీ తెలుస్తున్నది. ఆలీమహమ్మాద్ అనేక సంవత్సరాల క్రిందట యోగి అయిన అబ్దుల్ రెహమాన్ బాబా చిన్న పటాన్ని మహమ్మద్ హుసేన్ పీర్ భాయికి ఇచ్చారు. అది అతని టేబుల్ లో 8 సంవత్సరాలు పడివుంది. ఒకరోజు అతడు దాన్ని చూశాడు. అతను దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నిలువెత్తు పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాడు. అందులో ఒకటి ఆలీమహమ్మాద్ కి ఇచ్చాడు. దాన్ని అతడు తన బాంద్రా ఇంట్లో పెట్టాడు. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారిని దీన్ని కానుకగా ఇవ్వడానికి వెళ్ళగా వారు ఎంతో కోపంతో కొట్టబోయి నూర్ మహమ్మద్ ని అక్కడినుండి తరిమేశారు. అతడు ఎంతో విచారపడి చికాకు చెందాడు. తన డబ్బు అంతా నష్టపోవడమే కాకుండా గురువుగారి కోపానికి, అసంతృప్తికి కారణం అయ్యాను కదా అని చింతించాడు. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేదు. ఆ పటం అపోలో బందరుకు తీసుకుని వెళ్ళి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోకి వెళ్ళి, దాన్ని అక్కడ నీళ్ళలో ముంచేశాడు. తన బంధువుల దగ్గరనుంచి, స్నేహితుల దగ్గరనుంచి పటాలను తెప్పించి (16 పటాలు) వాటిని కూడా బాంద్రా సముద్రంలో ముంచేశాడు. ఆ సమయంలో ఆలీమహమ్మద్ తన బావమరిది ఇంట్లో ఉన్నాడు. యోగుల పటాలను సముద్రంలో పడేస్తే తన వ్యాధి కుదురుతుందని బావమరిది చెప్పాడు. ఇది విని ఆలీమహమ్మద్ తన మేనేజర్ ను బాంద్రా ఇంటికి పంపించి అక్కడ ఉన్న పటాలు అన్నింటినీ సముద్రంలో పడేయించాడు. రెండు నెలల తరువాత ఆలీమహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటం ఎప్పటిలా గోడమీద ఉండటం గమనించి ఆశ్చర్యపడ్డాడు. తన మేనేజర్ పటాలు అన్నీ తీసివేసి బాబా పటం ఎలా మరిచిపోయాడో అతనికే తెలియలేదు. వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచిపెట్టాడు. లేకపోతే తన బావగారు దాన్ని చూస్తే దాన్ని కూడా నాశనం చేస్తాడని భయపడ్డాడు. దాన్ని ఎవరికి ఇవ్వాలి? దాన్ని ఎవరు జాగ్రత్తపరుస్తారు? దాన్ని భద్రంగా ఎవరు ఉంచగలరు? అనే విషయాలు ఆలోచిస్తుండగా సాయిబాబాయే ఇస్ముముజావర్ ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసింది అని తోచేలా చేశారు. ఆలీమహమ్మద్ ఇస్ముముజావర్ ను కలుసుకుని జరిగినది అంతా చెప్పాడు. ఇద్దరూ బాగా ఆలోచించి ఆ పటాన్ని హేమాడ్ పంత్ కు ఇవ్వాలని నిశ్చయించారు. అతడు దాన్ని జాగ్రత్తపరుస్తాడని తోచింది. ఇద్దరూ హేమాడ్ పంత్ దగ్గరికి వెళ్ళి సరైన సమయంలో దాన్ని బహూకరించారు. ఈ కథను బట్టి బాబాకి భూతభవిష్యత్ వర్తమానాలు తెలుసనీ, చాకచక్యంగా సూత్రాలు తీసి తన భక్తుల కోరికలు ఎలా నెరవేరుస్తూ ఉన్నారో కూడా తెలుస్తుంది. ఎవరికయితే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్దో వారిని బాబా ప్రేమించటమే కాక వారి కష్టాలను తొలగించి వారిని ఆనందభరితులుగా చేస్తూ ఉండేవారని రాబోయే కథవలన తెలుస్తుంది.
గుడ్డపీలికలను దొంగాలించుట - జ్ఞానేశ్వరి చదువుట :
బి.వి.రావు దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని, ఇతర మతగ్రంథాలను చదవాలని చాలా కాలంనుంచి కోరుకుంటున్నాడు. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిరోజూ భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని ఇతర గ్రంథాలనుండి కొన్ని భాగాలను పారాయణ చేస్తుండేవాడు. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరాలు ఏర్పడటంతో పారాయణ ఆగిపోతూ ఉండేది. మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడినుండి తన స్వగ్రామమైన పౌండుకు వెళ్ళాడు. మిగిలిన గ్రంథాలన్నీ అక్కడ చదవగలిగాడు. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఎవో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సులో ప్రవేశించడంతో చదవలేకపోతున్నాడు. అతడు ఎంత ప్రయత్నించినా కొన్ని వరసలు కూడా చదవలేకపోయాడు. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం పట్ల శ్రద్ధ కలగజేసినప్పుడే దాన్ని చదవమని వారి నోటివెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభిస్తాను అని అంతవరకూ దాన్ని తెరవననీ నిశ్చయించుకున్నాడు. అతడు 1914సవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబసమేతంగా షిరిడీకి వెళ్ళారు. అక్కడ ప్రతిరోజూ జ్ఞానేశ్వరి చదువుతున్నావా అని బాపూసాహెబు జోగ్ దేవుగారిని అడిగారు. దేవు తనకు అప్పటి కోరిక ఉందనీ కానీ దాన్ని చదవడానికి శక్తి చాలడం లేదని, బాబా ఆజ్ఞాపించినట్లయితే దాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. అప్పుడు జోగ్, ఒక పుస్తకాన్ని తీసుకుని బాబాకి ఇచ్చినట్లయితే దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇస్తారని అప్పటినుండి నిరాటంకంగా చదవచ్చు అని దేవుకు సలహా ఇచ్చారు. బాబాకు తన ఉద్దేశ్యం తెలుసు కాబట్టి దేవుగారు అలా చేయడానికి అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దాన్ని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా? అన్నారు. దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చారు. బాబా 20 రూపాయలు దక్షిణ అడగ్గా దాన్ని చెల్లించారు. ఆనాడు రాత్రి బాలకరాముడు అనే వాణ్ణి కలుసుకుని అతడు బాబా పట్ల భక్తిని వారి అనుగ్రహాన్ని ఎలా సంపాదించాలి అని ప్రశ్నించారు. మరుసటి రోజు దర్శనం కోసం దేవు వెళ్ళగా బాబా అతన్ని 20 రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు. వెంటనే దేవు దాన్ని చెల్లించారు. మసీదునిండా ప్రజాలు నిండి ఉండటంతో దేవు ఒక మూలకు వెళ్ళి కూర్చున్నాడు. బాబా అతన్ని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చోమని అన్నారు. దేవు అలాగే చేశాడు. మధ్యాహ్న హారతి తరువాత భక్తులు అందరూ వెళ్ళిన తరువాత దేవు, బాలకరాముని చూసి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమి చెప్పారో, ధ్యానం ఎలా నేర్పరో అని అడగ్గా బాలకరాముడు వివరాలు చెప్పడానికి సిద్ధపడ్డాడు. అంతలో బాబా చంద్రు అనే కుష్టురోగ భక్తుడిని పంపించి దేవుని తీసుకుని రమ్మని చెప్పారు. దేవు బాబా దగ్గరికి వెళ్ళగా ఎవరితో ఏమి మాట్లాడుతున్నావు అని బాబా అడిగారు. బాలకరామునితో మాట్లాడుతున్నాననీ, బాబా కీర్తిని వింటున్నానని అతడు చెప్పాడు. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాడు. అతన్ని బాబా లోపలికి తీసుకుని వెళ్ళి స్తంభం దగ్గర కూర్చుని 'నా గుడ్డపీలికలను నాకు తెలియకుండా ఎందుకు దొంగిలించావు?’ అన్నారు. దేవు తనకు ఆ గుడ్డపీలికల గురించి ఏమీ తెలియదు అని అన్నాడు. బాబా అతన్ని వెదకమన్నారు. అతడు వెదికాడు, కానీ అక్కడ ఏమీ దొరకలేదు. బాబా కోపంతో ఇలా అన్నారు ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. నీవు ఒక్కడివే దొంగవు. ముసలితనంతో వెంట్రుకలు పండిపోయినప్పటికీ ఇక్కడికి దొంగిలించడానికి వచ్చావా?’ అని కోప్పడ్డారు. బాబా మతిచెడినవాడిలా తిట్టి, కోపంతో చివాట్లు పెట్టారు. దేవు నిష్శ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. దేవు తాను సటకా దెబ్బలు కూడా తింటాను ఏమో అని అనుకున్నారు. ఒక గంట తరువాత బాబా అతన్ని వాడాకు వెళ్ళమని చెప్పారు. దేవు అక్కడికి వెళ్ళి జరిగినది అంతా జోగ్ కు, బాలకరాముడికి తెలియజేశాడు. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపించారు. ముఖ్యంగా దేవుని రమ్మన్నారు. ‘నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చు గానీ, అతడు దొంగలించటంతో నేను అలా పలకవలసి వచ్చింది' అని బాబా అన్నారు. తిరిగి బాబా 12 రూపాయల దక్షిణ అడిగారు. దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా ఇలా అన్నారు 'ప్రతిరోజూ జ్ఞానేశ్వరిని చదువు. వెళ్ళి వాడాలో కూర్చో, ప్రతినిత్యం కొంచెం అయినా క్రమం తప్పకుండా చదువు. చదువుతున్నప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాశక్తులతో వివరించి చెప్పు. నేను నీకు జలతారు సెల్లా ఇవ్వడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాను. ఇతరుల దగ్గరికి వెళ్ళి దొంగలించి చదవడం ఎందుకు? నీకు దొంగతనానికి అలవాటు పడాలని ఉందా? బాబా మాటలు విని దేవు సంతోషించాడు. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించారు అనీ, తనకు కావలసింది ఏమిటో అది దొరికిందనీ, అప్పటినుండి తాను సులభంగా చదవగలననీ అనుకున్నారు. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తాను శరణువేడుకున్నాడు కాబట్టి తనను బిడ్డగా ఎంచి జ్ఞానేశ్వరి చదవడంలో తోడ్పడవలసిందని బాబాను వేడుకున్నాడు. పీలికలు దొంగలించడం అంటే ఏమిటో దేవు అప్పుడు గ్రహించారు. బాలకరాముని ప్రశ్నించడమే గుడ్డపీలకలు దొంగిలించడం. బాబాకి అలాంటి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి తానే సిద్ధంగా ఉన్నారు. ఇతరులను అడగడం బాబాకు ఇష్టం లేదు. అందుకే అతన్ని బాధించి చికాకుపెట్టారు. అదీగాక ఇతరులను ప్రశ్నించడం నిష్ప్రయోజనం అని చెప్పారు. దేవు ఆ తిట్లను ఆశీర్వాదాలుగా భావించి సంతృప్తితో ఇంటికి వెళ్ళారు. ఆ సంగతి అంతటితో పూర్తికాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు,. ఒక సంవత్సరంలోపు బాబా దేవు దగ్గరికి వెళ్ళి అతని అభివృద్ధి కనుక్కున్నారు. 1914వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పైఅంతస్తులో కూర్చుని 'జ్ఞానేశ్వరి బోధపడుతుందా లేదా?’ అని అడిగారు. ‘లేదు' అని దేవు జవాబిచ్చారు.
బాబా: ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు?
దేవు కళ్ళతడి పెట్టుకుని 'నీ కృపను వర్షింపనిదే పారాయణ చికాకుగా ఉన్నది. బోధపడటం చాలా కష్టంగా ఉన్నది. నేను దీన్ని నిశ్చయంగా చెపుతున్నాను' అన్నాడు.
బాబా : చదువుతున్నప్పుడు నీవు తొందరపడుతున్నావు నా ముందు చదువు. నా సమక్షంలో చదువు.
దేవు : ఏమి చదవాలి?
బాబా : ఆధ్యాత్మ చదువు.
పుస్తకం తీసుకుని రావడానికి దేవు వెళ్ళాడు. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఆ దృశ్యాన్ని చూసిన తరువాత దేవుకి ఎంత ఆనందం, సంతోషం కలిగాయో చదువుతున్నవారే గ్రహించెదరుగాక!
నలభై ఒకటవ అధ్యాయం సంపూర్ణం
Note: HTML is not translated!